Telugu Global
National

వేరే గుర్తుపై పోటీ చేయ‌డం శివ‌సేన‌కు కొత్తేమీ కాదు

మహా రాష్ట్రలో జరగబోయే ఉపఎన్నికలో శివసేన పార్టీకి తన పాత ఎన్నికల గుర్తు దక్కలేదు. ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గానికి రెండు గుర్తుల‌ను ప్ర‌తిపాదించింది ఎన్నికల సంఘం. వీటిలో నుంచి ఎన్నుకోవాల‌ని సూచించింది. అయితే ఇలా వేరే వేరే గుర్తులతో పోటీ చేయడం శివసేనకు కొత్తేమీ కాదు.

వేరే గుర్తుపై పోటీ చేయ‌డం శివ‌సేన‌కు కొత్తేమీ కాదు
X

పార్టీ చిహ్న‌మైన విల్లు-బాణం గుర్తు పై కాకుండా ఇత‌ర గుర్తుల‌పై ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఉద్ద‌వ్ ఠాక్రే నేతృత్వంలోని శివ‌సేన‌కు ఇదే మొద‌టిసారి కాదు. ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో తిరుగ‌బాటు చేసి ఎంవిఎ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టి బిజెపి అండ‌తో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు పార్టీ చిహ్నం, పేరు గురించి ఈ రెండు వ‌ర్గాలూ కోర్టును ఆశ్ర‌యించాయి. ఆ వివాదం ఎన్నిక‌ల సంఘం, న్యాయ‌స్థానాల‌లో కొన‌సాగుతోంది. ఈ లోపున జ‌రిగే ఉప‌ ఎన్నికలో గుర్తులు కేటాయింపుపై ఇరువ‌ర్గాల‌కు ఎన్నిక‌ల సంఘం కొన్ని ప్ర‌తిపాద‌న‌లు చేసింది. ఉద్ద‌వ్ ఠాక్రే వ‌ర్గానికి ఉద‌యించే సూర్యుడు, త్రిశూలం గుర్తుల‌ను, పార్టీ పేర్ల‌ను కూడా ప్ర‌తిపాదించింది. వీటిలో నుంచి ఎన్నుకోవాల‌ని సూచించింది.

శివ‌సేన 56యేళ్ళ‌ చ‌రిత్ర‌లో రైలింజ‌న్‌, టార్చ్ లైట్, సూర్యుడు నుంచి బ్యాట్ బాల్ వ‌ర‌కు వివిధ గుర్తుల‌పై పార్టీ ఎన్నిక‌ల్లో పోటీ చేసింది. 1989 లోక్‌సభ ఎన్నికలలో శివ‌సేన విల్లు - బాణం గుర్తును పొందింది, ఆ తర్వాత అది పార్టీకి శాశ్వ‌త గుర్తింపుగా మారింది. 1966లో ఉనికిలోకి వచ్చిన తర్వాత, సేన మరుసటి సంవత్సరం థానే మునిసిపల్ ఎన్నికలతో పాటు 1968లో బిఎంసి ఎన్నికలలో తొలి సారి ఎన్నికల బరిలోకి దిగింది. అప్పటికి సేన డాలు (షీల్డ్)- కత్తి గుర్తుతో ఎన్నికల రంగంలోకి ప్రవేశించింది.

1980 ల‌లో జ‌రిగిన లోక్ స‌భ‌, అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో రైలింజ‌న్ ను గుర్తుగా పొందింది. ప్ర‌ముఖ నేత మ‌నోహ‌ర్ జోషి, త‌దిత‌ర శివ సైనికులు 1978 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో రైలింజ‌న్ గుర్తుపై పోటీ చేశారు. 1985 అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో శివ‌సేన అభ్య‌ర్ధుల‌కు బ్యాటు, బాల్, టార్చ్ వంటి వేర్వేరు గుర్తులు కేటాయించారు. ఆ స‌మ‌యంలో చ‌గ‌న్ భుజ‌బ‌ల్ మాజ‌గాన్ అసెంబ్లీ స్థానం నుంచి టార్చ్ గుర్తుతో గెలుపొందారు. ఆశ్చ‌ర్య‌కరంగా, ఆస‌మ‌యానికికి శివ‌సేన గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీ కాక‌పోవ‌డంతో భుజ‌బ‌ల్ ను స్వ‌తంత్ర ఎమ్మెల్యేగా అసెంబ్లీ స‌చివాల‌య రికార్డుల‌లో పేర్కొన్నారు.

1985 లో బిఎంసి లో శివ‌సేన అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు దాని గుర్తు విల్లు- బాణంగానే ఉంది. ఇదే గుర్తుపైనే అభ్య‌ర్ధులంతా గెలిచార‌ని అప్ప‌టి గిర్ గాంవ్ కార్పోరేట‌ర్ ద‌లీప్ నాయ‌క్ గుర్తు చేసుకున్నారు.

1989నుంచే విల్లు-బాణం గుర్తు

త‌మ రాజ‌కీయ పార్టీల‌ను రిజిస్ట‌ర్ చేసుకోవాల్సిందిగా ఎన్నిక‌ల సంఘం అన్ని రాజ‌కీయ పార్టీల‌ను కోరిన‌ప్పుడు బాలా సాహెబ్ ఠాక్రే త‌మ నాయ‌కులంద‌రితో రిజిస్ట్రేష‌న్‌పై చ‌ర్చించారు. అప్పుడు మ‌నోహ‌ర్ జోషి, విజ‌య్ నాద‌క‌ర్ణి, తాను ఢిల్లీ వెళ్ళి ఎన్నిక‌ల సంఘం వ‌ద్ద పార్టీ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేశామ‌ని శివ‌సేన‌నేత సుభాష్ దేశాయ్ గుర్తు చేసుకున్నారు. అప్పుడు త‌మ‌కు విల్లు-బాణం గుర్తును ఎన్నిక‌ల సంఘం కేటాయించింద‌ని చెప్పారు. 1989 లోక్ స‌భ ఎన్నిక‌ల‌లో న‌లుగురు శివ‌సేన ఎంపీలు గెలిచారు. అంటే ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల‌కు అవ‌స‌ర‌మైన అర్హ‌త కంటే ఎక్కువ శాతం ఓట్ల‌ను సాధించ‌డంతో విల్లు-బాణం గుర్తు పార్టీకి శాశ్వతమయ్యింది.

First Published:  10 Oct 2022 11:53 AM GMT
Next Story