Telugu Global
National

ముంబైని కూడా గుజరాత్‌కి తాకట్టు పెడతారా..?

2014-19 మధ్యకాలంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు గిఫ్ట్ సిటీ ప్రాజెక్ట్ ని మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతూ చివరి నిమిషంలో గుజరాత్ కి తరలించారు. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే హయాంలో కూడా అదే జరిగింది. సెమీ కండక్టర్ ప్లాంట్ మహారాష్ట్ర చేజారింది.

ముంబైని కూడా గుజరాత్‌కి తాకట్టు పెడతారా..?
X

మహారాష్ట్రలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఢిల్లీ నుంచి బీజేపీ చక్రం తిప్పుతోందంటూ శివసేన తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా వేదాంత-ఫాక్స్‌కాన్‌.. మెగా సెమీకండక్టర్ ప్రాజెక్ట్ గుజరాత్‌ కు తరలి వెళ్లడం సంచలనంగా మారింది. ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కావాలనే ఈ ప్రాజెక్ట్ ని గుజరాత్ కి సమర్పించిందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు. ఏదో ఒక రోజు ముంబైని కూడా షిండే గుజరాత్ కి తాకట్టు పెట్టేస్తారని అంటున్నారు.

గతంలో దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ - గిఫ్ట్ సిటీని కూడా గుజరాత్ తరలించుకు వెళ్లారని, ఇప్పుడు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరోసారి మహారాష్ట్రకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు శివసేన నేతలు. వేదాంత-ఫాక్స్ కాన్.. సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ముందుగా మహారాష్ట్రలో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కానీ తర్వాత దాన్ని గుజరాత్ కి తరలించారు. 2014-19 మధ్యకాలంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు గిఫ్ట్ సిటీ ప్రాజెక్ట్ ని మహారాష్ట్రలో ఏర్పాటు చేయబోతూ చివరి నిముషంలో గుజరాత్ కి తరలించారు. ఇప్పుడు ఏక్ నాథ్ షిండే హయాంలో కూడా అదే జరిగింది. సెమీ కండక్టర్ ప్లాంట్ మహారాష్ట్ర చేజారింది. రాయ్‌గఢ్ జిల్లాలో ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్‌ ను కూడా మహారాష్ట్ర కోల్పోయిందని అన్నారు మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్‌ లో ఇలాంటి పార్కులను కేంద్రం ఆమోదించిందని గుర్తు చేశారు.

వివక్ష ఎందుకు..?

ప్రస్తుతం సెమీ కండక్టర్ ప్లాంట్ తరలిపోవడంపై మహారాష్ట్రలో రాజకీయ యుద్ధం మొదలైంది. సీఎం షిండే బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిపోయారని, ఆయన ముంబైని కూడా రాసిచ్చేస్తారని అంటున్నారు శివసేన నేతలు. ఈ ఆరోపణలపై సీఎం షిండే దీనిపై వివరణ ఇచ్చారు. సెమీ కండక్టర్ ప్లాంట్ ఒక్క నెలలో తరలిపోయిందంటే ఎవరూ నమ్మరని చెప్పారు. మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారని అన్నారు. మరిన్ని ప్రాజెక్ట్ లు మోదీ ద్వారా మహారాష్ట్రకు వస్తాయని చెప్పారు. షిండే వ్యాఖ్యలతో మరింత దుమారం రేగింది. మోదీ వల్లే సెమీ కండక్టర్ ప్లాంట్ మహారాష్ట్ర నుంచి తరలిపోయిందని అంటున్నారు శివసేన నేతలు.

First Published:  16 Sep 2022 11:09 AM GMT
Next Story