Telugu Global
National

గొర్రెల కాపరికి పోలీసులు కాపలా.. ఎందుకో తెలుసా..?

ఇసుక అక్రమంగా తరలుతున్నా, గంజాయి విక్రయాలు సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాలకృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

గొర్రెల కాపరికి పోలీసులు కాపలా.. ఎందుకో తెలుసా..?
X

మామూలుగా ఎమ్మెల్యే, మంత్రి వెంట‌ వారికి రక్షణగా పోలీసులు తుపాకులు పట్టుకొని కనిపిస్తుంటారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో మాత్రం ఓ గొర్రెల కాపరికి నిత్యం ఇద్దరు పోలీసులు తుపాకులు చేత పట్టుకుని కాపలా కాస్తుంటారు. అతడు గొర్రెల మంద‌ను తోలుకొని అడవికి వెళ్తే అక్కడికీ వెళ్తుంటారు. ఆ గొర్రెల కాపరి ఎక్క‌డికి వెళ్తే అక్క‌డికి.. నిద్రపోయే స‌మ‌యంలో కూడా అతడి పక్కనే ఇద్దరు పోలీసులు కాపలాగా ఉంటున్నారు. ఇంత‌కీ విష‌యం ఏంటో తెలుసుకుందాం..

తూత్తుకూడి జిల్లా అగరం గ్రామానికి చెందిన బాలకృష్ణన్ గొర్రెలు మేపుకొంటూ జీవనం సాగిస్తుంటాడు. అతడు వార్డు సభ్యుడు కూడా. అగరం గ్రామానికి శివారులో తామ్రభరణి అనే నది ఉంది. ఆ నది నుంచి ఇసుకను అక్రమంగా తవ్వేస్తుండటంతో ఆ ముఠాపై బాలకృష్ణన్ వందలాది ఫిర్యాదులు చేశాడు. అలాగే గ్రామంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతుండటంతో దానిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇసుక అక్రమంగా తరలుతున్నా, గంజాయి విక్రయాలు సాగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాలకృష్ణన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని పోలీసులను కోర్టు మందలించింది. దీంతో పోలీసులు ఇసుక మాఫియా, గంజాయి దందా నిర్వహిస్తున్న వారికి నోటీసులు ఇచ్చారు. దీంతో ఇసుక మాఫియా, గంజాయి మాఫియా బాలకృష్ణన్ ను బెదిరించింది. తమపై వేసిన పిటిషన్లను వాపస్ తీసుకోవాలని.. లేకపోతే చంపేస్తామని బెదిరించారు.

అయినా బాలకృష్ణన్ బెదరలేదు. తనకు మాఫియా నుంచి బెదిరింపులు వస్తున్నట్లు మళ్లీ కోర్టుకు వెళ్లాడు. దీంతో కోర్టు అతడికి ఇద్దరు పోలీసులతో భద్రత కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక అప్పటినుంచి నాలుగేళ్లుగా ఇద్దరు పోలీసులు బాలకృష్ణన్ కు కాపలాగా ఉంటున్నారు. బాలకృష్ణ గొర్రెలు కాసుకోవడానికి వెళ్లినా పోలీసులు అతడి వెంట వెళ్తూ భద్రత కల్పిస్తున్నారు. బాలకృష్ణ ఎక్కడికి వెళ్లినా వెంట పోలీసులు వెళ్లాల్సిందే.

ఒక సాధారణ గొర్రెల కాప‌రికి ఇద్దరు పోలీసులు నిత్యం కాపలా కాస్తుండటం జనానికి వింతలా కనిపిస్తుంటుంది. గ్రామస్తులకైతే రోజు చూస్తూ ఇది అలవాటు అయ్యింది కానీ.. బాలకృష్ణన్ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో అతడికి ఇద్దరు పోలీసులు కాపలా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది.

ఇక పోలీసులు మాత్రం నిత్యం అతడి వెంట తిరగలేక అల్లాడుతున్నారు. గొర్రెలు కాయడానికి వెళ్లినా.. పొలానికి వెళ్లినా వెంట వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. చూసీచూడనట్లు వదిలేద్దామంటే బాలకృష్ణన్ ప్రాణాలను మాఫియా ఎక్కడ తీసేస్తుందో.. తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని గొర్రెల కాపరిని పోలీసులు కంట కనిపెట్టుకొని ఉంటున్నారు. బాలకృష్ణన్ పెట్టిన కేసులకు కోర్టు తీర్పులు ఇచ్చేవరకు ఈ వ్యవహారం ఇలాగే కొనసాగనుంది.

First Published:  2 May 2023 6:55 AM GMT
Next Story