Telugu Global
National

"స్నేహపూర్వక పోటీయే, ప్రత్యర్థులం కాదు": శశి థరూర్

తాను కూడా పోటీ చేయ‌నున్న‌ట్టు దిగ్విజ‌య్ సింగ్‌ ప్ర‌క‌టించిన వెంట‌నే థ‌రూర్ ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించారు. దిగ్విజ‌య్ సింగ్‌ను క‌లుసుకుని ప‌ర‌స్ప‌రం శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు.

స్నేహపూర్వక పోటీయే, ప్రత్యర్థులం కాదు: శశి థరూర్
X

కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వి రేసు నుంచి అశోక్ గెహ్లాట్ త‌ప్పుకోవ‌డంతో ఇక పోటీ శ‌శి థ‌రూర్‌, దిగ్విజ‌య్ సింగ్‌ల‌ మ‌ధ్య కొన‌సాగే అవ‌కాశం ఉంది. తాను కూడా పోటీ చేయ‌నున్న‌ట్టు సింగ్ ప్ర‌క‌టించిన వెంట‌నే థ‌రూర్ ఆయ‌న ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించారు. ఆయ‌న దిగ్విజ‌య్ సింగ్‌ను క‌లుసుకున్నారు. ప‌ర‌స్ప‌రం శుభాకాంక్ష‌లు తెలుపుకున్నారు. అనంత‌రం ఒక‌రినొక‌రు ఆలింగ‌నం చేసుకున్న ఫొటోను థ‌రూర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇది "ప్రత్యర్థుల మధ్య యుద్ధం కాదు, సహ‌చ‌రుల మధ్య స్నేహపూర్వక పోటీ" అని పోస్ట్ చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించడమే ఉమ్మడి లక్ష్యమని ఉద్ఘాటించారు. ఎవ‌రు గెలిచినా కాంగ్రెస్ గెలిచిన‌ట్టే అని వ్యాఖ్యానించారు.

థ‌రూర్ పోస్ట్‌ను దిగ్విజ‌య్ రీట్వీట్ చేస్తూ, థరూర్‌తో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. తమ యుద్ధం "మత శక్తులకు" వ్యతిరేకంగా ఉంటుందని, తామిద్ద‌రం గాంధేయ-నెహ్రూవియన్ భావజాలాన్ని విశ్వసిస్తున్నామ‌ని చెప్పారు. రాబోయే పోటీలో థరూర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

గాంధీ-నెహ్రూ కుటుంబానికి విశ్వాస‌పాత్రుడుగా దిగ్విజ‌య్ సింగ్‌కు పేరుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌ని చేసిన ఆయ‌న గ‌తంలో పార్టీ ప‌ర‌మైన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో గాంధీ కుటుంబానికి స‌హ‌క‌రించారు. ఇక శ‌శి థ‌రూర్ ..పార్టీ ప్ర‌క్షాళ‌న‌కు ప‌ట్టుబ‌డుతూ రెండేళ్ళ క్రితం సోనియాకు లేఖ రాసిన జి-23లో స‌భ్యుడు. అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్టు సోనియాకు తెలిపి ఆమోదం పొందారు.

First Published:  29 Sep 2022 11:53 AM GMT
Next Story