Telugu Global
National

అభ్యర్థుల మధ్య ఓపెన్ డిబేట్ పెడదాం.. ప్రజలకు కూడా కాంగ్రెస్‌పై నమ్మకం వస్తుంది - శశిథరూర్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓపెన్ డిబేట్‌ (బహిరంగ చర్చ)లో పాల్గొంటే మంచిదని ఎంపీ శశిథరూర్ సూచించారు.

అభ్యర్థుల మధ్య ఓపెన్ డిబేట్ పెడదాం.. ప్రజలకు కూడా కాంగ్రెస్‌పై నమ్మకం వస్తుంది - శశిథరూర్
X

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక రసవత్తరంగా మారుతోంది. అధ్యక్ష ఎన్నిక బరిలో రాజ్యసభ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే, తిరువునంతపురం ఎంపీ శశిథరూర్, జార్ఖండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ అవుతారని, గాంధీ కుటుంబ ఆశీస్సులు కూడా ఆయనకే ఉన్నాయని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల రాజస్థాన్ కాంగ్రెస్‌లో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన మొత్తానికే రేసులో లేకుండా పోయారు. ఈ నెల 8 వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంది. అప్పటి వరకు ఎవరు బరిలో ఉంటారో తెలిసిపోతుంది. కాగా, మొదటి నుంచి ఈ పదవి కోసం తీవ్రంగా కష్టపడుతున్న ఎంపీ శశిథరూర్ సరికొత్త ప్రతిపాదనకు తెరలేపారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఓపెన్ డిబేట్‌ (బహిరంగ చర్చ)లో పాల్గొంటే మంచిదని సూచించారు. అలా చేయడం వల్ల ప్రతీ అభ్యర్థి ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఏం చేయాలని భావిస్తున్నారో ప్రజలు కూడా తెలుసుకుంటారని అన్నారు. దీని వల్ల పార్టీ పట్ల ప్రజల్లో కూడా నమ్మకం పెరుగుతుందని థరూర్ ఆదివారం పేర్కొన్నారు. బ్రిటిష్ కన్జర్వేటీవ్ పార్టీ కూడా ఇటీవల తమ నాయకుడిని ఎన్నుకోవడానికి పలు డిబేట్లు నిర్వహించిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు. అది పార్టీ వ్యవహారం అయినా సరే.. ఓ జాతీయ నాయకుడిని ఎన్నుకునే సమయంలో ప్రజల మనసులు కూడా గెలుచుకోవల్సిన అవసరం ఉందని థరూర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల మనుసుల్లో నెహ్రూ-గాంధీ కుటుంబం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. కానీ, అదే సమయంలో కొత్త నాయకుడి పట్ల కూడా విధేయత, గౌరవం కలిగి ఉండాలని ఆయన సూచించారు.

మరోవైపు మల్లిఖార్జున్ ఖర్గేకు అశోక్ గెహ్లాట్ మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీని నడిపించే శక్తి, అనుభవం ఖర్గేకు ఉన్నాయని ఆయన తప్పకుండా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారని గెహ్లాట్ పేర్కొన్నారు. శశిథరూర్ ఓ ఉన్నత తరగతికి చెందిన వ్యక్తి. కానీ ఖర్గే ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. ఆయనకు సుదీర్ఝమైన రాజకీయ అనుభవం ఉంది. అతడి మనసు కూడా చాలా స్వచ్ఛమైనది అని గెహ్లాట్ పేర్కొన్నారు. ఖర్గే దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఆయన ఎన్నికను అందరూ స్వాగతిస్తారు. ఓ జాతీయ పార్టీకి దళితుడు అధ్యక్షుడు కావడం కూడా గొప్ప విషయం అని గెహ్లాట్ అన్నారు. థరూర్ కూడా మంచి వ్యక్తే.. కానీ ఆయనకు మరింత సమయం ఉంది. ఇప్పుడు ఖర్గే లాంటి సీనియర్ల అవసరం పార్టీకి ఉన్నదని గెహ్లాట్ చెప్పుకొచ్చారు.

First Published:  2 Oct 2022 9:06 AM GMT
Next Story