Telugu Global
National

నోటీస్ బోర్డ్, రబ్బర్ స్టాంప్.. పార్లమెంట్ కి కొత్త అర్థం

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అనే అంశంపై ప్రసంగించిన శశిథరూర్.. భారత్ లో ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అలాంటి పరిస్థితులను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీయేనని తెలిపారు.

నోటీస్ బోర్డ్, రబ్బర్ స్టాంప్.. పార్లమెంట్ కి కొత్త అర్థం
X

బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ నేత శశిథరూర్. ప్రజాస్వామ్య దేవాలయం అయిన పార్లమెంట్‌ ను బీజేపీ ప్రభుత్వం ‘నోటీసు బోర్డుగా, రబ్బరు స్టాంప్‌ గా’ మార్చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తాము చేయాలనుకున్న పనులను చెప్పేందుకు పార్లమెంట్ ని నోటీసు బోర్డుగా ఉపయోగించుకుంటోందని, మెజార్టీ సభ్యుల గళాన్ని అణచివేసి, ప్రతి బిల్లును కేబినెట్‌ నుంచి వచ్చిన విధంగా యథాతథంగా ఆమోదించుకునేలా పార్లమెంట్‌ ను రబ్బరు స్టాంప్‌ గా మార్చేశారని మండిపడ్డారు శశిథరూర్.

రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో జరిగిన లిటరేచర్‌ ఫెస్టివల్‌ లో పాల్గొన్న శశిథరూర్ పార్లమెంట్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్ వ్యవస్థ ఎలా ఉండేది, బీజేపీ వచ్చిన తర్వాత ఎలా తయారయింది అనే విషయంపై ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. శశిథరూర్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉన్నట్టు స్పష్టమవుతోందని చెప్పారు శశిథరూర్.

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం అనే అంశంపై ప్రసంగించిన శశిథరూర్.. భారత్ లో ఎమర్జెన్సీ ప్రకటించకుండానే అలాంటి పరిస్థితులను ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. ఇది అప్రకటిత ఎమర్జెన్సీయేనని తెలిపారు. ఎమర్జెన్సీలో నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటారని మనకు తెలుసని, కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన లేకుండానే ప్రభుత్వం అన్నీ నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటోందన్నారు శశిథరూర్. తెలివిగా ఈ నిర్ణయాలన్నిటినీ వారు రాజ్యంగం, చట్టం పరిధిలోనే చేశారని చెప్పారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం (UAPA)ని దీనికి ఉదాహరణగా చెప్పారు శశిథరూర్. రాజ్యాంగాన్ని చాలా సులభంగా అప్రజాస్వామిక మార్గంలోకి మారుస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు.

అప్పటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌ లో ప్రసంగిస్తుంటే.. అధికార పార్టీ సభ్యులు కూడా ప్రధానిని ఛాలెంజ్‌ చేస్తూ ప్రశ్నలు వేసేవారని గుర్తు చేశారు. 1962తో చైనాతో యుద్ధం సమయంలోనూ నాటి ప్రధాని నెహ్రూ పార్లమెంట్‌ కు జవాబుదారీగా వ్యవహరించారన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయని, ప్రస్తుత ప్రభుత్వం విజయవంతంగా మన పార్లమెంట్‌ ను నోటీసు బోర్డు, రబ్బర్‌ స్టాంప్‌ స్థాయికి తగ్గించిందని విమర్శించారు.

First Published:  21 Jan 2023 1:57 AM GMT
Next Story