Telugu Global
National

పరువు కాపాడుకునేందుకే పవార్ రాజీనామా ఎత్తుగడ

దాదాపు ఆరు దశాబ్దాల పైబడిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కురువృద్ధుడు శరద్ పవార్. ఒక దశలో దేశానికి ప్రధాని కావాలని అభిలాషించిన నాయకుడు.

పరువు కాపాడుకునేందుకే పవార్ రాజీనామా ఎత్తుగడ
X

పరువు కాపాడుకునేందుకే పవార్ రాజీనామా ఎత్తుగడ

తన మేనల్లుడు అజిత్ పవార్ పార్టీని వీడి బీజేపీలో చేరుతాడన్న ఊహాగానాల మధ్య ఎన్సీపీ అధ్యక్షపదవికి శరద్ పవార్ రాజీనామా చేయడం అనూహ్య పరిణామం. దీనిని తన పెద్దరికాన్ని నిలబెట్టుకునే చర్యగానో చూడవచ్చు. తన పరువును కాపాడుకునే ప్రయత్నమే పవార్ రాజీనామా ఎత్తుగడ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని తహతహలాడే అజిత్ ప‌వార్‌ను నిలువరించే యత్నమే రాజీనామా వ్యూహంగా చెబుతున్నారు. తను పార్టీ అధినేతగా కొనసాగుతుండగా అజిత్‌ పార్టీని వీడటం పవార్‌కు తీరని అప్రతిష్ట, రాజకీయాల్లో తన పలుకుబడికి, ప్రభావానికీ ఎనలేని నష్టం. ఒకవైపు దేశ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో మేనల్లుడే పార్టీని వీడితే ఆయన మాటలకు విలువ ఏముంటుంది..? ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో శరద్ పవార్ రాజీనామా అనివార్యమైందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

పార్టీ నాయకుల, కార్యకర్తల కోరిక మేరకు పవార్ రాజీనామాని ఉపసంహరించుకునే అవకాశం ప్రస్తుతానికి కనిపించడం లేదు. కొత్త నేతను ఎన్నుకునేందుకు నియమించే కమిటీకి సూచనలిస్తూ మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు తన పరిధిని దాటిపోకుండా చూసుకునే వ్యూహాన్ని పవార్ అనుసరిస్తున్నారు. ఈ క్రమాన అజిత్ ప‌వార్ తక్షణమే పార్టీని వీడి బీజేపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి లేదు. అదే సమయాన రానున్న కాలంలో బీజేపీకి దగ్గరయ్యే అవకాశం లేకపోలేదు. పార్టీ నాయకత్వ పగ్గాలు అజిత్ పవార్ చేపట్టినా బీజేపీకి దూరంగా వుండే విధానం అనుసరిస్తారన్న గ్యారంటీ లేదు.

ఈ పరిస్థితికి మూలాలు శరద్ ప‌వార్ అనుసరించిన రాజకీయ విధానాల్లోనే వున్నాయన్నది వాస్తవం. దాదాపు ఆరు దశాబ్దాల పైబడిన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కురువృద్ధుడు శరద్ పవార్. ఒక దశలో దేశానికి ప్రధాని కావాలని అభిలాషించిన నాయకుడు. కాంగ్రెస్‌లో ఆయన కోరిక నెరవేరలేదు. 1998 తరువాత సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పుంజుకున్నాక ఆ పార్టీ నుంచి దూరమై 1999లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు పవార్. కానీ, ఆయన స్థాపించిన పార్టీ మహారాష్ట్రని దాటి ప్రభావం చూపిన దాఖలాలు లేవన్నది వాస్తవం. అంతేగాక నిర్దిష్టమైన రాజకీయ సిద్ధాంతం, విధానం లేని కుటుంబ పార్టీగానే ఎన్సీపీ కొనసాగుతూ వచ్చింది. జాతీయస్థాయి దిశానిర్దేశం చేయగలిగిన పార్టీగా అది రూపొందలేకపోయింది. వ్యక్తిగతంగా పవార్‌కు దేశరాజకీయాల్లో పలుకుబడి, ప్రతిష్ట వున్నాయి. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసినా, కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు. సంకీర్ణ రాజకీయాల శకంలోనూ ప్రధాని కావాలన్న ఆయన కల సాకారం కాలేదు.

2019లో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కూటమిగా ఏర్పడి మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో శరద్ పవార్ వ్యూహచతురత పనిచేసింది. కానీ, బీజేపీ కుట్రల ఫలితంగా శివసేనలో చీలిక రావడం, ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కూలిపోవడం పవార్‌కు మింగుడు పడని పరిణామాలే. బీజేపీ అగ్రనాయకులతో పవార్‌కు సత్సంబంధాలు ఉన్నప్పటికీ కాషాయ వ్యూహాల ముందు అవి ఏమీ పనిచేయలేదన్నది నిజం.

మరోవైపున దేశ రాజకీయాల్లో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయత్నాలు జరుగుతుండగా అదానీతో శరద్ పవార్ సమావేశం కాంగ్రెస్ స‌హా మరికొన్ని పార్టీలకు నచ్చలేదు. అదానీని సమర్థించే రీతిన పవార్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేసింది. దీనితో 2024 ఎన్నికలలో మోడీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల కూటమిలో కీలకపాత్రని పోషించే అవకాశాన్ని పవార్ కోల్పోయారు. ప్రతిపక్షాల ఐక్యతకు కలిసి వస్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ నిజంగా ఆయనలో కాషాయ వ్యతిరేకత ఎంత అన్నది ప్రశ్నార్థకమైంది. ఈ పరిణామాల నేపథ్యమే 82 ఏళ్ళ శరద్ పవార్ రాజకీయ యవనిక నుంచి క్రమంగా తప్పుకోడానికి రాజీనామా వ్యూహాన్ని ఆశ్రయించారు. గౌరవప్రదంగా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఇకముందు ఏ ఎన్నికలలో పోటీ చేయబోవడంలేదని శరద్ ప‌వార్ ప్రకటించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నది పేరే గానీ జాతీయ దృష్టి, జాతీయ దృక్పథం, దేశం యావత్తును కదిలించే స్ఫూర్తిదాయక సిద్ధాంతం, విధానాలు లేకపోవడం ఆ పార్టీ పరిమితులు. కనుక పవార్ రాజీనామా ప్రభావం మహారాష్ట్ర సరిహద్దులు దాటి వుండదన్నది అంగీకరించక తప్పని వాస్తవం.

First Published:  2 May 2023 6:30 PM GMT
Next Story