Telugu Global
National

NCP అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించుకున్న శరద్ పవార్

"అన్నింటిపై పునరాలోచన తర్వాత, నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటిస్తున్నాను. నా మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను" అని శరద్ పవార్ కొద్దిసేపటి క్రితం చెప్పారు.దీంతో మహారాష్ట్ర లో మూడు రోజుల నాటకానికి తెరపడింది.

NCP అధ్యక్ష పదవికి రాజీనామా ఉపసంహరించుకున్న శరద్ పవార్
X

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధ్యక్ష పదవికి మూడు రోజుల క్రితం రాజీనామా చేసిన శర‌ద్ పవార్ ఈ రోజు తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు.

కార్యకర్తల భావోద్వేగ నిరసనలు,తన రాజీనామాను పార్టీ అగ్రనేతలు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత...

"అన్నింటిపై పునరాలోచన తర్వాత, నేను పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతానని ప్రకటిస్తున్నాను. నా మునుపటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాను" అని శరద్ పవార్ కొద్దిసేపటి క్రితం చెప్పారు.దీంతో మహారాష్ట్ర లో మూడు రోజుల నాటకానికి తెరపడింది.

పవార్ తన రాజీనామా నిర్ణయాన్ని మార్చుకున్నట్టు ప్రకటించిన తర్వాత‌, పార్టీకి సంస్థాగత మార్పులు జరగాలని, కొత్త వారికి బాధ్యతలు అప్పగించాలని, కొత్త నాయకత్వాన్ని సృష్టించాలని మాట్లాడారు. ఆ సమయంలో పవార్ అన్న కుమారుడు అజిత్ పవార్ గైర్హాజరయ్యారు.

“నేను అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నప్పటికీ భవిష్యత్తులో పార్టీలో సంస్థాగత మార్పులపై దృష్టి పెడతాను. కొత్త బాధ్యతలు, కొత్త నాయకత్వాన్ని సృష్టించడంతోపాటు సంస్థ అభివృద్ధికి నేను తీవ్రంగా కృషి చేస్తాను. పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాను, ”అని పవార్ అన్నారు.

2024లో బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే తన మరో పనిని తిరిగి ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

"అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేయడం చాలా ముఖ్యం. రాహుల్ గాంధీ నుండి సీపీఎం సీతారాం ఏచూరి వరకు అందరూ ఫోన్ చేసి నన్ను అధ్యక్షుడిగా కొనసాగాల‌ని అడిగారు" అని పవార్ తెలిపారు.

ఈ ఉదయం, ప్రఫుల్ పటేల్ నేతృత్వంలోని ఎన్‌సిపి ప్యానెల్ పవార్ రాజీనామాను తిరస్కరించింది. లక్షలాది మంది కార్యకర్త‌ల కోసం ఆయన అధ్యక్షుడిగా కొనసాగాలని ప్యానెల్ కోరింది.

పార్టీని చీల్చి బీజేపీతో జతకట్టేందుకు అజిత్ పవార్ చేస్తున్న కుట్రలను నిర్వీర్యం చేసేందుకే శరద్ పవార్ ఈ ఎత్తుగడ వేశారన్న వాదనలూ వినిపిస్తున్నాయి.

శరద్ పవార్ తాజా నిర్ణయంతో NCP కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ "సాహెబ్" తన రాజీనామాను వెనక్కి తీసుకున్నందుకు హర్షం వ్యక్తం చేశారు.

First Published:  5 May 2023 1:04 PM GMT
Next Story