అమిత్ షాపై శరద్ పవార్ తీవ్ర విమర్శలు
మన దేశం ఎలాంటివారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో సందేహం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
కేంద్రమంత్రి అమిత్ షాపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆయనను రెండేళ్ల పాటు గుజరాత్ నుంచి బహిష్కరించిందని గుర్తుచేస్తూ.. అలాంటి వ్యక్తి నేడు మన దేశానికి హోంమంత్రిగా కొనసాగడం నిజంగా విచిత్రంగా ఉందని ఆయన చెప్పారు. కాబట్టి.. మన దేశం ఎలాంటివారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలని ఆయన సూచించారు. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో సందేహం లేదంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందని ఆయన స్పష్టం చేశారు.
దేశంలోనే అత్యంత అవినీతిపరుడంటూ శరద్ పవార్‌పై అమిత్ షా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల అమిత్ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అసత్యాలు పలికారని చెప్పారు. అయితే.. 2010లో సోహ్రాబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో అమిత్ షాను సుప్రీంకోర్టు గుజరాత్ నుంచి రెండేళ్ల పాటు బహిష్కరించిందని గుర్తుచేశారు. ఆ తర్వాత 2014లో ఆయన నిర్దోషిగా విడుదలయ్యారని తెలిపారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైరి పక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటినుంచే ఒకరిపై మాటల యుద్ధం మొదలుపెట్టారు.