Telugu Global
National

విపక్షాలపై శరద్ పవార్ ఫైర్

దేశంలో నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం వంటి తీవ్ర సమస్యలుండగా విపక్షాలు ఎవరి డిగ్రీలు ఏంటి అనే విషయాలపై పోరాటం చేస్తున్నాయని శరద్ పవార్ మండిపడ్డారు.

విపక్షాలపై శరద్ పవార్ ఫైర్
X

ప్రతీసారీ బీజేపీ పై విరుచుకపడే ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ ఆశ్చర్యంగా ఈ సారి ప్రతిపక్షాలపై మండి పడ్డారు. దేశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్న అసలు సమస్యలను వదిలేసి విపక్షాలు పనికి మాలిన విషయాలపై సమయం వృథా చేస్తున్నాయని ఆరోపించారు.

దేశంలో నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణం వంటి తీవ్ర సమస్యలుండగా విపక్షాలు ఎవరి డిగ్రీలు ఏంటి అనే విషయాలపై పోరాటం చేస్తున్నాయని మండిపడ్డారు.

"ఈరోజు కాలేజ్ డిగ్రీ ప్రశ్న తరుచుగా అడుగుతున్నారు. మీ డిగ్రీ ఏంటి, నా డిగ్రీ ఏంటి అని, ఇవి రాజకీయ అంశాలా?" అని పవార్ అన్నారు. నాయకులు ఈ దేశం ఎదుర్కుంటున్న అసలైన సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

"నిరుద్యోగం, శాంతిభద్రతలు, ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించండి. మతం, కులం పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. మహారాష్ట్రలో అకాల వర్షం పంటలను నాశనం చేసింది. ఈ అంశాల‌పై చర్చలు అవసరం." అని పవార్ అన్నారు.

దేశంలోని ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో పవార్ మాట్లాడటం ఇది రెండవ‌ సారి. అదానీ విషయంలో కూడా పవార్ ప్రతిపక్షాలతో విభేదిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఆయన US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్, అదానీ వ్యవహార‍ంలో అదానీకి మద్దతు ప్రకటించారు. అదానీపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికను విమర్శించారు.

అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) విచారణ జరిపించాలని కాంగ్రెస్ తో సహా ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తుండగా పవార్ మాత్రం జేపీసీ అవసరం లేదని వ్యాఖ్యానించారు.

బీజేపీ పై పోరాటానికి ఐక్యమవ్వాలనుకుంటున్న ప్రతిపక్షాల ఆలోచనలను పవార్ తీరు ఇబ్బందులకు గురి చేస్తుందా ?

First Published:  10 April 2023 4:32 AM GMT
Next Story