Telugu Global
National

మిత్ర ప‌క్షాల‌ను బిజెపి మింగేస్తోంది..ప‌వార్ ధ్వ‌జం

ప్రాంతీయ పార్టీలను నాశనం చేయడానికే బీజెపి ఆ పార్టీలతో పొత్తు పెట్టుకుంటోందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆరోపించారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నందుకు ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను ప్రశంసించారు.

మిత్ర ప‌క్షాల‌ను బిజెపి మింగేస్తోంది..ప‌వార్ ధ్వ‌జం
X

భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధికారం కోసం విలువ‌లు, ప్ర‌మాణాల‌ను తుంగ‌లో తొక్కుతోంద‌ని నేష‌న‌లిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్ సీపీ) అధినేత శ‌ర‌ద్ ప‌వార్ విమ‌ర్శించారు. తమతో పొత్తులు పెట్టుకున్న తర్వాత 'తన ప్రాంతీయ మిత్రులను అంతం చేస్తోందని' ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీతో తెగదెంపులు చేసుకొని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప‌వార్ ప్రశంసించారు.

పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఏడీ), మ‌హారాష్ట్ర‌లో శివసేన వంటి ప్రాంతీయ మిత్రపక్షాలు బీజేపీకి మద్దతుగా నిలిచాయి కానీ, ఎన్నిక‌ల్లో మహారాష్ట్ర లో శివసేనకు, పంజాబ్ లో అకాలీదళ్ కు తక్కువ సీట్లు వచ్చాయి. "ఎన్నికల సమయంలో ప్రాంతీయ పార్టీతో చేతులు కలపడం, ఆ పార్టీలకు తక్కువ సీట్లు వచ్చేలా చూడటం బిజెపి ప్రత్యేకత. పంజాబ్‌లోని అకాలీదళ్, మహారాష్ట్రలోని శివసేన విష‌యంలోను ఇది రుజువైంది." అని పవార్ అన్నారు.

కుటుంబాల నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్తు ఉండదని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆ పార్టీ తన మిత్రపక్షాలను 'క్రమంగా క‌బ‌ళిస్తుందని బీజేపీ చీఫ్ ప్రకటన స్పష్టం చేస్తోందని పవార్ అన్నారు. నితీష్ కుమార్ ఈ ప‌రిణామాలు, ప్ర‌క‌ట‌న‌ల‌ను చూసి రాబోయే ముప్పును ముందుగానే ప‌సి గ‌ట్టార‌ని అన్నారు. బిజెపితో బంధాన్ని తెంచుకున్నందుకు నితీష్ ను ప‌వార్ అభినందించారు.

" పార్టీలో చీలిక సృష్టించడం ద్వారా శివసేనను బలహీనపరచడానికి బిజెపి ప్లాన్ చేసింది. తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే సీఎం అయ్యారు. బీజేపీ ఆయనకు సహకరించింది.'' అని పవార్ అన్నారు. గ‌త నెల‌లో మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన‌, ఎన్‌సిపి, కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఏర్ప‌డిన మ‌హావికాస్ అఘాడి సంకీర్ణ ప్ర‌భుత్వం ప‌త‌న‌మైన విష‌యం తెలిసిందే. దీని వెన‌క బిజెపి హ‌స్తం ఉంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

First Published:  11 Aug 2022 6:44 AM GMT
Next Story