Telugu Global
National

అమర జవాన్‌కి అవమానం.. తండ్రికి పోస్ట్‌లో శౌర్య చక్ర పంపిన కేంద్రం..

అమర జవాన్ కుటుంబానికి పోస్ట్ ద్వారా శౌర్య చక్ర పతకాన్ని పంపించింది కేంద్రం. ఇది తన బిడ్డకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఆ జవాన్ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శౌర్య చక్రను తిప్పి పంపించేశారు.

అమర జవాన్‌కి అవమానం.. తండ్రికి పోస్ట్‌లో శౌర్య చక్ర పంపిన కేంద్రం..
X

దేశ రక్షణ కోసం కుటుంబాల్ని త్యాగం చేసి, అవసరమైతే ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే జవాన్ల విషయంలో కేంద్రం ఎలాంటి వైఖరితో ఉందో మరోసారి స్పష్టమైంది. అగ్నిపథ్ అంటూ జవాన్ ఉద్యోగాల్ని కాంట్రాక్ట్ పరం చేసిన కేంద్రం, ఇప్పుడో అమర జవాన్ విషయంలో స్పందించిన తీరు విమర్శలకు తావిస్తోంది. అమర జవాన్ కుటుంబానికి పోస్ట్ ద్వారా శౌర్య చక్ర పతకాన్ని పంపించడం చర్చనీయాంశమైంది. ఇది తన బిడ్డకు జరిగిన అవమానంగా భావిస్తున్నానని ఆ జవాన్ తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సైన్యంలో మూడో అతి పెద్ద పురస్కారం శౌర్య చక్రను ఆయన తిప్పి పంపించేశారు.

దేశ రక్షణ కోసం ప్రాణాలు వదిలిన వీర సైనికులను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు పురస్కారాలు అందజేస్తుంది ప్రభుత్వం. రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను ఇస్తుంటారు. స్వాతంత్య్ర‌ దినోత్సవమో లేక రిపబ్లిక్‌ దినోత్సవం సందర్భంగానో ఈ పురస్కారాలను కుటుంబ సభ్యులకు ఇచ్చి సత్కరిస్తారు. కానీ ఇలా పోస్ట్‌లో పంపించడం ఇదే తొలిసారి.

ఐదేళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ లాన్స్‌ నాయక్‌ గోపాల్‌ సింగ్‌ భదోరియా కన్నుమూశారు. ప్రభుత్వం ఆయకు మూడో అతి పెద్ద సైనిక పురస్కారమైన శౌర్య చక్రను ప్రకటించింది. గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని బాపూనగర్‌లో గోపాల్ సింగ్ కుటుంబం నివశిస్తుండేది. గోపాల్ సింగ్ తో ఆయన భార్యకు విభేదాలున్నాయి. కోర్టులో విడాకుల కేసు నడుస్తుండగా గోపాల్ సింగ్ చనిపోయారు. ఆ తర్వాత విడాకుల కేసులో తీర్పు వచ్చింది. దీంతో శౌర్య చక్ర పురస్కారాన్ని, దానితోపాటు ఇచ్చే పారితోషికాన్ని కోడలికి కాకుండా తమకే ఇవ్వాలంటూ తల్లిదండ్రులు కోర్టుకెక్కారు. కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో.. అవార్డుని తమకి అందజేయాలంటూ గోపాల్ సింగ్ తండ్రి మునీం సింగ్ కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. కేంద్రం శౌర్య చక్రను పోస్ట్‌లో పంపించింది. దీంతో మునీం సింగ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ పురస్కారాన్ని తిరస్కరించారు.

First Published:  9 Sep 2022 1:05 PM GMT
Next Story