Telugu Global
National

'పఠాన్' దేశభక్తి సినిమా.. చూసి తట్టుకునే ధైర్యం ఉండాలి : షారుక్ ఖాన్

కాషాయ బికినీలో హీరోయిన్‌ను కావాలనే చిత్రీకరించారని, ఇది మా మనోభావాలను గాయపరిచిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

పఠాన్ దేశభక్తి సినిమా.. చూసి తట్టుకునే ధైర్యం ఉండాలి : షారుక్ ఖాన్
X

ఇప్పుడు దేశమంతటా 'పఠాన్' సినిమాపై చర్చ జరుగుతోంది. షారుక్ ఖాన్, దీపిక పదుకొన్ జంటగా శ్రీధరన్ రాఘవన్ దర్శకత్వంలో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా జనవరి 25న విడుదల కానున్నది. బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహాం కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇటీవల ఈ సినిమాలోని 'బేషరమ్ రంగ్' అనే పాటను చిత్ర బృందం విడుదల చేసింది. అందులో దీపికా పదుకోన్ కాషాయం రంగులోని బికినీలో రెచ్చిపోయింది. అదే పాటలో ఆమెకు జంటగా ఉన్న షారుక్.. పచ్చని చొక్కాలో కనిపించాడు. దీంతో బీజేపీ నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

కాషాయ బికినీలో హీరోయిన్‌ను కావాలనే చిత్రీకరించారని, ఇది మా మనోభావాలను గాయపరిచిందని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు షారుక్ చొక్కాను పచ్చని రంగులో ఉందని, ఇది లవ్ జీహాద్‌కు ప్రతీక అంటూ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పఠాన్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బాయ్ కాట్ పఠాన్ అంటే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే దీపిక ఫీఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో ట్రోఫీని ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ గొడవ ఇలా జరుగుతుండగానే షారుక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోసేలా మారాయి. సాధారణంగా తమ సినిమా విడుదలవుతున్న సమయంలో అనవసరమైన వివాదాల జోలికి, కాంట్రవర్సీ కామెంట్ల జోలికి వెళ్లరు. కానీ షారుక్ మాత్రం తనదైన శైలిలోనే సెటైర్లు వేయడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల పఠాన్ సినిమాకు సంబంధించి పలువురు నెటిజన్లు ట్విట్టర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. దీనికి షారుక్ తనదైన రీతిలో స్పందించారు.

ఇది దేశభక్తి సినిమాయేనా అని ఒక వ్యక్తి ప్రశ్నించగా.. ఇది కచ్చితంగా దేశభక్తి సినిమానే.. కాకపోతే యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. చూసి తట్టుకునే ధైర్యం మీకుందా అని జవాబిచ్చారు. షారుక్ ఇచ్చిన జవాబు ఏంటో అర్థం కాక నెటిజన్ ఏకంగా తన ప్రశ్నను డిలీట్ చేసుకోవడం గమనార్హం. మరోవ్యక్తి ఈ సినిమాను ఎందుకు చూడాలి అని అడగగా.. ఎంటైర్‌టైన్‌మెంట్ కోసం అంటూ కౌంటర్ ఇచ్చారు. ఈ సినిమా ఎంత మేర కలెక్షన్ చేస్తుందని ప్రిడిక్షన్ చేస్తున్నారు అని ఒకరు ప్రశ్నించారు. తాను ప్రిడిక్షన్స్ చెప్పడానికి ఇక్కడ లేనని.. మీ అందరికీ నా సినిమాలతో వినోదం అందించాలని ఉన్నాను అని షారుక్ రిప్లై ఇచ్చాడు. మొత్తానికి బీజేపీ అభిమానులు షారుక్‌ను ముప్పతిప్పలు పెట్టాలని భావించినా.. షారుక్ మాత్రం ఎలాంటి భయం లేకుండా తన మనసులోని మాటలను బయటకు చెప్పారు.

First Published:  20 Dec 2022 4:16 AM GMT
Next Story