Telugu Global
National

ఈ సినీ నటులు స్లీపర్ సెల్స్ అట !

బిల్కిస్ బానో పై అత్యాచారం కేసులో 11 మంది రేపిస్టులను జైలు నుంచి విడుదల చేసిన గుజరాత్ ప్రభుత్వాన్ని నటి షబానా అజ్మీ విమర్శించినందుకు ఆమెపై మధ్యప్రదేశ్ హోం మంత్రికి కోపమొచ్చింది. ఆమెతో పాటు , నసీరుద్దీన్ షా, రచయిత జావేద్ అక్తర్ ను కూడా కలిపి వాళ్ళు తుక్డే-తుక్డే గ్యాంగ్ యొక్క స్లీపర్ సెల్స్ అంటూ ఆరోపణలు గుప్పించారు.

ఈ సినీ నటులు స్లీపర్ సెల్స్ అట !
X

ప్రశ్నలను, విమర్శలను ఎదుర్కోలేని వారు, జవాబు చెప్పలేని వారు ఎదురు దాడి చేస్తారు. ఒక్కో సారి భౌతికదాడులు కూడా చేస్తారు. ఇప్పుడు దేశంలో ప్రశ్నలు ఎదుర్కోలేని పిరికి తనం బాగా పెరిగింది. విమర్శలు సహించలేని మూర్ఖత్వం కొందరి మెదళ్ళను తొలిచివేస్తున్నది. ప్రెస్ మీట్ల నుంచి ప్రశించే జర్నలిస్టులను వెళ్ళగొడతారు. అయినా భయపడకుండా ప్రశ్నిస్తే జైళ్ళలో తోస్తారు. తూటాల కన్నా వాళ్ళిప్పుడు మాటలకే ఎక్కువ భయపడుతున్నారు. అలాంటి కోవకే చెందిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడిన మాటలు వాట్సప్ యూనివర్సిటీ పండితులకు చెవులకింపుగా ఉంటే ప్రజాస్వామిక వాదులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

బాలీవుడ్ నటులు షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా వంటి వ్యక్తులు 'తుక్డే-తుక్డే' గ్యాంగ్ యొక్క స్లీపర్ సెల్స్ అంటూ నరోత్తమ్ మిశ్రా రెచ్చిపోయారు. వాళ్ళిద్దరే కాదు రచయిత జావేద్ అక్తర్ కూడా అదే గ్యాంగ్ అంటూ ఆరోపణలు గుప్పించాడు.

ఈ ముగ్గురి గురించి మాట్లాడటానికి ఆయనో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ...

''షబానా అజ్మీ, నసీరుద్దీన్ షా, జావేద్ అక్తర్ వంటి వ్యక్తులు 'తుక్డే-తుక్డే' గ్యాంగ్ యొక్క స్లీపర్ సెల్స్, వారు కేవలం బిజెపి పాలిత రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలపై రచ్చ‌ సృష్టిస్తున్నారు. అదే రాజస్థాన్, జార్ఖండ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏమి జరుగుతుందో మాత్రం మాట్లాడరు. " అని అన్నారు.

గుజరాత్ లో బిల్కిస్ బానో పై అత్యాచారం చేసి ఏడుగురిని హత్య చేసిన 11 మంది రేపిస్టులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని షబానా అజ్మీ ప్రశ్నించారు. ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో ఆమె గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆమె మాటలు నరోత్తమ్ మిశ్రా కు కోపం తెప్పించాయి. తమ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రశించడాన్ని ఆయన సహించలేక పోయారు.

రాజస్థాన్‌లో కన్హయ్య లాల్ హత్యపైనా, దుమ్కా హత్య కేసులో జార్ఖండ్‌లో సజీవ దహనమైన మహిళ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడలేదని మిశ్రా ప్రశ్నించారు.

సినీ ప్రముఖులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే సమస్యలను ఎత్తిచూపుతున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే నసీరుద్దీన్ షా వెంటనే దేశంలో బతకడానికి భయపడుతున్నానంటాడు, అవార్డు వాపసీ గ్యాంగ్ రెచ్చిపోయి కేకలు వేస్తారని అన్నారు.

ఆ 11 మంది రేపిస్టులను విడుదల చేయడాన్ని ఎలా సమర్దించుకుంటారో మాత్రం నరోత్తమ్ మిశ్రా చెప్పలేదు. ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎదురు దాడి చేయడమే బీజేపీ రాజకీయమా ?


First Published:  4 Sep 2022 4:30 AM GMT
Next Story