Telugu Global
National

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల పరిష్కారం ఇక ఈజీ

ఈపీఎఫ్‌ చందా దారు తన బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. అలా కేవైసీ ఆమోదించినవారికి ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌ తెలిపింది.

ఈపీఎఫ్‌ క్లెయిమ్‌ల పరిష్కారం ఇక ఈజీ
X

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌) ఉద్యోగుల క్లెయిమ్‌ల పరిష్కారానికి మార్గం సుగమం చేసింది. దీని ద్వారా ఉద్యోగుల క్లెయిమ్‌లు ఇకపై ఎలాంటి అవాంతరాలు లేకుండా పరిష్కారం కానున్నాయి. ఉద్యోగులు చేసే ఈపీఎఫ్‌ క్లెయిమ్‌లకు సంబంధించి ఇప్పటివరకు బ్యాంకు చెక్, బ్యాంకు పాస్‌ పుస్తకం జత చేయాల్సిన అవసరం ఉండేది. క్లెయిమ్‌ చేసినవారు చెక్, పాస్‌ బుక్‌ ఇవ్వకపోతే సంబంధిత క్లెయిమ్‌ను తిరస్కరించే పరిస్థితి ఉండేది.

తాజాగా ఉద్యోగుల క్లెయిమ్‌లను తిరస్కరించుకుండా ఉండటం కోసం ఈపీఎఫ్‌ వెసులుబాటు కల్పించింది. అదేంటంటే.. ఈపీఎఫ్‌ చందా దారు తన బ్యాంకు ఖాతా వివరాల కేవైసీ ధ్రువీకరణ చేయాల్సి ఉంటుంది. అలా కేవైసీ ఆమోదించినవారికి ఈ సదుపాయం లభిస్తుందని ఈపీఎఫ్‌ తెలిపింది. చందా దారుడి ఖాతా వివరాలను బ్యాంకు, ఎన్‌పీసీఐ ఆధార్‌ కేవైసీ ద్వారా ధ్రువీకరణ పూర్తయిన క్లెయిమ్‌లకు చెక్, బ్యాంకు పాసు పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది.

ఆధార్‌ కేవైసీ పూర్తయిన చందా దారుల క్లెయిమ్‌లపై ’బ్యాంకు కేవైసీ ఆన్‌లైన్‌లో ధ్రువీకరణ పూర్తయింది. చెక్, పాస్‌ పుస్తకం జతచేయాల్సిన అవసరం లేదు’ అంటూ క్లెయిమ్‌ దరఖాస్తులో నోట్‌ ఉంటుందని ఈపీఎఫ్‌వో తెలిపింది. ఈ సమాచారం ఆధారంగా ఉద్యోగుల క్లెయిమ్‌ దరఖాస్తులు పరిష్కరించాలని ఆ సంస్థ ఆదేశాలు జారీ చేసింది.

First Published:  11 Jun 2024 6:37 AM GMT
Next Story