Telugu Global
National

సీఎం పోస్ట్ 2500 కోట్లు.. కర్నాటకలో సంచలన ఆరోపణలు..

తాజాగా కాంగ్రెస్ నేత ఆరోపణల ప్రకారం కర్నాటక సీఎం సీటు రేటు 2500 కోట్ల రూపాయలు. కానీ, ఆ మొత్తం ఇచ్చేవారు కాస్త వెనకాముందూ ఆలోచిస్తున్నారట. అందుకే సీఎం మార్పు ప్రక్రియ తెమలడంలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

సీఎం పోస్ట్ 2500 కోట్లు.. కర్నాటకలో సంచలన ఆరోపణలు..
X

కర్నాటకలో బసవరాజ్ బొమ్మై సీఎం కుర్చీనుంచి త్వరలో దిగిపోతారనే ప్రచారం చాన్నాళ్లుగా జరుగుతోంది. అదిగో దించేస్తున్నారు, ఇదిగో కొత్త ముఖ్యమంత్రి వస్తున్నారని చెబుతున్నారే కానీ, దానికి తగ్గ ఏర్పాట్లు జరగడంలేదు. ఈలోగా అక్కడ సీఎం కుర్చీకి మాంచి డిమాండ్ ఉందని, దాని రేటు ఏకంగా 2500 కోట్ల రూపాయలు పలుకుతోందని, ఆ మొత్తం ఇవ్వడానికి ఎవరూ దొరక్క దాన్ని ప్రస్తుతం బొమ్మై దగ్గరే ఉంచారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ విషయం తాము చెబుతోంది కాదని, బీజేపీ కీలక నేత, సీనియర్ నాయకుడు చెప్పారని కాంగ్రెస్ నాయకుడు హరిప్రసాద్ ఏకంగా అసెంబ్లీలోనే ఆరోపించారు.

యడ్యూరప్పపై అసంతృప్తి పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన్ను పక్కనపెట్టిన అధిష్టానం, కర్నాటకలో బసవరాజ్ బొమ్మైకి ఆ ఆఫర్ ఇచ్చింది. అయితే బొమ్మై కూడా అక్కడ సక్సెస్ కాలేదు. బొమ్మై హయాంలో హిజాబ్ గొడవలతో సహా.. ప్రభుత్వం చాలా చికాకుల్నే ఎదుర్కొంది. చివరకు బొమ్మైని కూడా దించేయాలనే ప్రతిపాదన వచ్చింది. కొత్తగా సీఎం పోస్ట్ లోకి వచ్చేవారు భారీగా నగదు ఇచ్చుకోవాల్సి వస్తుందనే ప్రచారం కూడా మొదలైంది. రోజుకో లెక్కలు బయటపడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత ఆరోపణల ప్రకారం కర్నాటక సీఎం సీటు రేటు 2500 కోట్ల రూపాయలు. కానీ, ఆ మొత్తం ఇచ్చేవారు కాస్త వెనకాముందూ ఆలోచిస్తున్నారట. అందుకే సీఎం మార్పు ప్రక్రియ తెమలడంలేదని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

అబ్బెబ్బే అదేం లేదు..

గతంలో యడ్యూరప్ప విషయంలో కూడా అలాంటి మార్పులేవీ ఉండవంటూనే.. సడన్ గా ఆయన్ను తీసి పక్కనకూర్చోబెట్టింది అధిష్టానం. ఇప్పుడు బొమ్మై విషయంలో కూడా అలాంటిదేమీ లేదంటోంది. బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ ప్రచారాన్ని ఖండించారు. బొమ్మైను తొలగించే ప్రశ్నే లేదన్నారాయన. ఆయన నాయకత్వంపై అధిష్టానానికి పూర్తి విశ్వాసం ఉందని, బొమ్మై తన పదవి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారని, బొమ్మై నాయత్వంలోనే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటామని కూడా చెప్పారు అరుణ్ సింగ్. మరి ఈ 2500 కోట్ల ఆఫర్ ఏంటనేది రాబోయే రోజుల్లో తేలుతుందేమో చూడాలి.

First Published:  20 Aug 2022 3:00 AM GMT
Next Story