Telugu Global
National

అమిత్ షా చుట్టూ అనుమానాస్పద వ్యక్తి చక్కర్లు, ఏపీ ఎంపీ పేరు చెప్పిన వైనం

సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఎంపీకి పర్సనల్ సెక్రటరీని అని చెప్పారని ముంబాయి పోలీసులు చెబుతున్నారు.

అమిత్ షా చుట్టూ అనుమానాస్పద వ్యక్తి చక్కర్లు, ఏపీ ఎంపీ పేరు చెప్పిన వైనం
X

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముంబాయి పర్యటనలో భద్రతా వైఫల్యం బయటపడింది. మంగళవారం ఘటన జరిగినప్పటికీ ఈ విషయాన్ని పోలీసులు గురువారం వెల్లడించారు.

అమిత్ షా ఈ వారం మొదట్లో రెండు రోజుల పర్యటనకు ముంబాయి వచ్చిన సమయంలో ఒక వ్యక్తి హోంశాఖ సిబ్బంది ఐడీ కార్డును ధరించి షాను ఫాలో అయ్యాడు. కొన్ని గంటల పాటు అమిత్ షా భద్రతా బృందంలో అతడు తిరిగాడు. అమిత్ షాకు అత్యంత దగ్గరకు వెళ్లడంతో పాటు, ఆంక్షలున్న ప్రాంతంలో అనుమానాస్పదంగా పదేపదే సంచరించాడు. దాంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిని ప్రశ్నించారు. దాంతో తన పేరు హేమంత్‌ పవార్ అని, తాను కేంద్ర హోంశాఖలో పనిచేస్తున్నానని చెప్పాడు.

భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన నగర అసిస్టెంట్‌ పోలీస్ కమిషనర్‌ పాటిల్‌ ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. డిప్యూటీ సీఎం ఫ‌డ్నవీస్ నివాసానికి అమిత్ షా వచ్చిన సమయంలో తొలుత తాను అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గమనించినట్టు ఫిర్యాదులో వివరించారు. అతడు తెల్ల చొక్కా ధరించి, మెడలో హోంమంత్రిత్వ శాఖ ఐడీ కార్డుతో కనిపించారన్నారు. కొన్ని గంటల తర్వాత ముఖ్యమంత్రి షిండే నివాసం వద్ద కూడా కనిపించాడని, ఆంక్షలున్న ప్రాంతంలో అతడు అనుమానాస్పదంగా తిరగడం చూసి ప్రశ్నించగా.. తన పేరు హేమంత్ పవార్‌ అని కేంద్ర హోంశాఖకు చెందిన వాడిని అని చెప్పారని వెల్లడించారు.

దాంతో ముంబాయి పోలీసులు కేంద్ర భద్రతా బృందాలను సంప్రదించగా.. అలాంటి పేరుతో తమ భద్రతా బృందంలో ఎవరూ లేరని స్పష్టత ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పదంగా తిరిగి వ్యక్తిని పట్టుకునేందుకు గాలించగా.. నాన చౌక్‌ వద్ద పట్టుబడ్డాడని అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ వివరించారు.

సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ఎంపీకి పర్సనల్ సెక్రటరీని అని చెప్పారని ముంబాయి పోలీసులు చెబుతున్నారు. అయితే ఏపీకి చెందిన ఏ ఎంపి పేరును అతడు చెప్పారన్న విషయం బయటకు రాలేదు. పట్టుబడిన వ్యక్తి చెప్పిన వివరాలను ధృవీకరించుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  8 Sep 2022 7:14 AM GMT
Next Story