Telugu Global
National

సీల్డ్ కవర్ల పద్దతి న్యాయ సూత్రాలకు వ్యతిరేకం: సుప్రీంకోర్టు

"సీల్డ్ కవర్లు పూర్తిగా న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒకరి ప్రాణానికి హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే సీల్డ్ కవర్లను ఆశ్రయించవచ్చు," అని చంద్రచూడ్ అన్నారు.

సీల్డ్ కవర్ల పద్దతి న్యాయ సూత్రాలకు వ్యతిరేకం: సుప్రీంకోర్టు
X

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) బకాయిల కేసులో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన సీల్డ్ కవర్ నోట్‌ను ఆమోదించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. “నేను వ్యక్తిగతంగా సీల్డ్ కవర్ల పట్ల విముఖంగా ఉన్నాను. కోర్టులో పారదర్శకత ఉండాలి’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై. చంద్రచూడ్ ఈ రోజు వ్యాఖ్యానించారు.

“ఇది ఆర్డర్‌లను అమలు చేయడం గురించిన కేసు. ఇక్కడ రహస్యం ఏమి ఉంటుంది. సుప్రీం కోర్టులో ఈ సీల్డ్ కవర్ ప్రాక్టీస్‌కు ముగింపు పలకాలి… ఇది న్యాయ‌ ప్రక్రియకు విరుద్ధం. ”అని ఆయన అన్నారని హిందూ పేర్కొంది

"సీల్డ్ కవర్లు పూర్తిగా న్యాయ సూత్రాలకు విరుద్ధం. ఒకరి ప్రాణానికి హాని కలుగుతుందనుకున్నప్పుడు మాత్రమే సీల్డ్ కవర్లను ఆశ్రయించవచ్చు," అని చంద్రచూడ్ అన్నారు.

రాఫెల్ డీల్, అస్సాం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ కేసు, ఎలక్టోరల్ బాండ్ల కేసు, అయోధ్య టైటిల్ వివాదం, గుజరాత్ పోలీసుల ‘నకిలీ’ ఎన్‌కౌంటర్ కేసు, నరేంద్ర మోదీ బయోపిక్ విడుదల కేసు, అప్పటి CJI రంజన్ గొగోయ్‌కి సంబంధించిన లైంగిక వేధింపుల కేసు, భీమా కోరేగావ్ కేసు, కాంగ్రెస్ నాయకుడు P. చిదంబరం కోసం ముందస్తు బెయిల్ పిటిషన్ వంటి పలు ముఖ్యమైన కేసుల్లో సీల్డ్ కవర్ పత్రాలను సుప్రీంకోర్టు ఆమోదించింది.

అయితే సీల్డ్ కవర్ విధానం ప్రమాదకరమైనదని గత ఏడాది చివర్లో సుప్రీంకోర్టు పేర్కొంది, ఎందుకంటే ఇది తీర్పు ప్రక్రియను అస్పష్టంగా, పారదర్శకత లేకుండా చేస్తుందని, వ్యవస్థ పనితీరుపై ప్రభావితం చూపిస్తుందని, తీవ్రమైన సహజ న్యాయ ఉల్లంఘనకు కారణమవుతుందని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ ల ధర్మాసనం అక్టోబర్ 20, 2022న వెలువరించిన తీర్పులో పేర్కొన్నారు.

గతేడాది మార్చిలో అప్పటి సీజేఐ ఎన్‌వీ రమణ కూడా సీల్డ్‌ కవర్లలో రిపోర్ట్ దాఖలు చేయడాన్ని అంగీకరించలేదు.

ఇక ఈ కేసుకు సంబంధించి, 2024 ఫిబ్రవరి 28 నాటికి 10-11 లక్షల మంది పింఛనుదారుల బకాయిలను మూడు సమాన వాయిదాలలో క్లియర్ చేయాలని కోరుతూ, OROP పథకంపై 2022 తీర్పును పాటించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని కోర్టు తేల్చి చెప్పింది.

OROP పథకం కింద చెల్లించాల్సిన బకాయిల మొత్తాన్ని పేర్కొంటూ నోట్‌ను దాఖలు చేయాలని రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)ను కోర్టు ఆదేశించింది, అయితే లక్షల మంది రిటైర్డ్ డిఫెన్స్ సిబ్బంది ఇప్పటికే అనేక ఏళ్ళుగా వారి పెన్షన్ కోసం వేచిఉన్నారని, పలువురు మరణించారని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

ఫిబ్రవరి 2024లోగా బకాయిలను క్లియర్ చేయాలని కూడా సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం జూన్ 30, 2023లోపు 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న రిటైర్డ్ సైనికులకు OROP బకాయిలను చెల్లించాలి. ఆరు లక్షల మంది కుటుంబ పెన్షనర్ల బకాయిలను క్లియర్ చేయాలి అని కోర్టు తీర్పు చెప్పింది.

First Published:  20 March 2023 11:21 AM GMT
Next Story