Telugu Global
National

వచ్చే కర్నాటక ఎన్నికల్లో 100 సీట్లకు పోటీ చేయనున్న SDPI .... ఎవరి లాభం కోసం ?

SDPI ప్రవేశం రాష్ట్రంలోని మైనారిటీల ఓట్లను చీల్చడమే కాకుండా అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి హిందూత్వ కార్డును దూకుడుగా ఉపయోగించడానికి అవకాశం ఇస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

వచ్చే కర్నాటక ఎన్నికల్లో 100 సీట్లకు పోటీ చేయనున్న SDPI .... ఎవరి లాభం కోసం ?
X

గత సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను, దాని అనుబంద సంస్థలను నిషేధించింది. అయితే దాని రాజకీయ విభాగమైన డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (SDPI)ను మాత్రం నిషేధించలేదు. ఇప్పుడా పార్టీ కర్నాటకలో 100 అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తానని ప్రకటించింది. SDPI 100 సీట్లకు పోటీ చేయడం కాంగ్రెస్ ను దెబ్బ కొట్టి బీజేపీని గెలిపించడానికే అని రాజకీయ నిపుణుల వాదన. ముస్లింల ఓట్లను చీల్చి కాంగ్రెస్ ఓట్లను చీల్చడమే SDPI ప్రధాన ఉద్దేశమని, ఆ పార్టీ బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా పోటీ చేస్తాం’’ అని SDPI జాతీయ అధ్యక్షుడు ఎం.కె. ఫైజీ బెంగళూరులో తెలిపారు. తొలి జాబితాలో బెంగళూరు, దక్షిణ కన్నడ, మైసూరు, ఉడిపి, చిత్రదుర్గ తదితర జిల్లాల్లో అభ్యర్థులను ప్రకటించారు.

ఈ ఏడాది చివర్లో జరగనున్న ఎన్నికలకు SDPI సిద్ధమవుతున్న తరుణంలో, కాంగ్రెస్, బిజెపిలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తమ ఓట్లను చీల్చేందుకు SDPIని బిజెపి ఉపయోగించుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా, కాంగ్రెస్ తన బుజ్జగింపు రాజకీయాల కోసం ఎస్‌డిపిఐని ఉపయోగించుకుంటోందని బీజేపీ ఆరోపిస్తోంది.

SDPIకి బీజేపీ నిధులు ఇస్తోందని గత ఏడాది జూలైలో బిజెపి మాజీ నాయకుడు సూరత్‌కల్‌ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ శాసనసభ్యుడు,కర్ణాటక కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ చీఫ్ ప్రియాంక్ ఖర్గే ప్రస్తావించారు.

“ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సత్యజిత్ సూరత్‌కల్ చెప్పినట్టు వారు (SDPI) బిజెపికి చెందిన ‘బి’ టీమ్ తప్ప మరొకటి కాదు. బీజేపీ వ్యూహాత్మకంగా SDPIకి మద్దతు ఇస్తుందని, వారికి (SDPI) నిధులు ఇస్తుందని ఆయన అన్నారు. ఓట్లను చీల్చేందుకు, కాంగ్రెస్‌ను ఓడించేందుకు మాత్రమే (SDPI) ఉందని ఆయన (సూరత్‌కల్‌) చెప్పారు. ఆ రెండు పార్తీల మధ్య అవగాహన గురించి మనకు ఇంతకన్నా ఏం తెలియాలి? ” అని ప్రియాంక్ ఖర్గే అన్నారు.

.

బిజెపి నాయకులు ఈ ఆరోపణలను ఖండించారు, బదులుగా SDPIతో కాంగ్రెస్ పార్టీకే అవగాహన ఉందని బిజెపి శాసనసభ్యుడు రఘుపతి భట్ ఆరోపించారు.

“వారు (SDPI) ఒక రాజకీయ పార్టీ. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. వారితో మాకు ఎటువంటి సంబంధం లేదు. వారు సాధారణంగా కాంగ్రెస్‌తో అవగాహన కుదుర్చుకుని పోటీ చేస్తారు. మేము (బిజెపి) వారి (మైనారిటీ) ఓట్లపై కూడా ఆధారపడటం లేదు. మాకు బలమైన పునాది ఉంది, ”అని ఉడిపి బిజెపి శాసనసభ్యుడు రఘుపతి భట్ అన్నారు.

SDPI ప్రవేశం రాష్ట్రంలోని మైనారిటీల ఓట్లను చీల్చడమే కాకుండా అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి హిందూత్వ కార్డును దూకుడుగా ఉపయోగించడానికి అవకాశం ఇస్తుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

"వారు (SDPI) ఓట్లను చీల్చడంలో కీలక‌ పాత్ర పోషిస్తారు" అని బెంగళూరుకు చెందిన రాజకీయ విశ్లేషకుడు మరియు అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ సభ్యుడు ఎ. నారాయణ అన్నారు.

ఇవి SDPIకి మొదటి ఎన్నికలు కాదు. ఆ పార్టీ గతంలో స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలు రెండింటిలోనూ పోటీ చేసింది, కానీ పెద్దగా విజయం సాధించలేదు.

2013 అసెంబ్లీ ఎన్నికల్లో SDPI 23 స్థానాల్లో పోటీ చేసి 3.27 శాతం ఓట్లను సాధించింది.

2018లో, పార్టీ పోటీ చేస్తాననిముందుగా ప్రకటించిన చాలా స్థానాల నుండి వైదొలిగింది. అయితే చివరకు పోరాడిన మూడు స్థానాల్లో 10.50 శాతం ఓట్లను పొందగలిగింది.

ఆ పార్టీ పోటీ చేసిన మూడు నియోజకవర్గాల్లో 45,781 ఓట్లను సాధించింది. ఆ ఎన్నికల్లో మొత్తం ఓట్లలో 0.12 శాతం ఓట్లు సాధించింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవనప్పటికీ, కర్ణాటకలో 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో SDPI ఆరు స్థానాలను గెలుచుకుంది.

వాస్తవానికి, కోస్తా కర్ణాటకలో SDPI క్రమంగా బలం పెంచుకుంటోంది. ప్రత్యేకించి హిజాబ్, హలాల్ మాంసంపై నిషేధం, హిందూ ఉత్సవాల్లో ముస్లింల భాగస్వామ్యం, పెరిగిన నైతిక పోలీసింగ్ , 'లవ్ జిహాద్' వంటి వివాదాస్పద అంశాల నేపథ్యంలో కాంగ్రెస్ వంటి పార్టీలకు SDPI ముప్పుగా పరిణమించనుంది.

మరో వైపు, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), జనతాదళ్ (సెక్యులర్) వంటి పార్టీలు కూడా రంగంలో ఉన్నందున, గెలుపు మార్జిన్‌లు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే అస్థిర రాజకీయాలకు నెలవైన కర్నాటకలో మరింత అస్తిరతకు దారి తీయ‌వచ్చని నిపుణుల వాదన.

కర్నాటకలోని చాలా ప్రాంతాలలో రాజకీయాలు కుల సమీకరణాలపై ఆధారపడి ఉండగా, కోస్తా జిల్లాల్లో మాత్రం ఓట్లు మత రాజకీయాలపై ఆధారపడి ఉన్నాయి.

కోస్తా కర్ణాటక, మల్నాడ్ ప్రాంతాలలో ఇప్పుడు SDPI కారణంగా కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. హిజాబ్ వంటి వివాదాస్పద అంశాల నుండి దూరంగా ఉండాలనే కాంగ్రెస్ వైఖరి దానిని రెంటికి చెడ్డరేవడిలా చేసింది.

కర్నాటకలోని కోస్తా ప్రాంతంలో ఉన్న మొత్తం 21 అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ పార్టీకి 2013లో 13 సీట్లు ఉండగా, 2018లో కేవలం మూడింటిని మాత్రమే గెలుచుకోగలిగింది.

ఇప్పటికే బీజేపీని ఎదిరించడంలో అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ కు SDPI రూపంలో మరో బలమైన అడ్డంకి ఎదురవబోతోంది. కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు SDPI ని బీజేపీయే ఎన్నికల్లో నిలబెడుతుందనే ఆరోపణలో నిజమున్నా లేకున్నా ఈ పరిణామం మాత్రం బీజేపీకి ఆనందాన్నిచ్చేదే.

First Published:  8 Jan 2023 12:10 PM GMT
Next Story