Telugu Global
National

మన్ కీ బాత్ వినలేదని విద్యార్థులకు రూ.100 జరిమానా

గత నెల 30వ తేదీన ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ స్కూలులో ప్రసారం చేశారు. అయితే ఆరోజు ఆదివారం కావడంతో చాలామంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

మన్ కీ బాత్ వినలేదని విద్యార్థులకు రూ.100 జరిమానా
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతినెల చివరి ఆదివారం ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గత నెల 30వ తేదీన ఈ కార్యక్రమం 100వ ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. అయితే మోడీ ప్రసంగం వినలేదని డెహ్రాడూన్ లోని జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ స్కూలు విద్యార్థులకు రూ. 100 జరిమానా విధించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయమై విద్యార్థుల హక్కుల జాతీయ సంఘాన్ని ఆశ్రయించారు.

గత నెల 30వ తేదీన ప్రధాని మోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ స్కూలులో ప్రసారం చేశారు. అయితే ఆరోజు ఆదివారం కావడంతో చాలామంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో ప్రధాని స్పీచ్ వినని విద్యార్థులు రూ. వంద చొప్పున జరిమానా చెల్లించాలని స్కూలు యాజమాన్యం పాఠశాల వాట్సప్ గ్రూప్ లో నోటీసు పంపింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలన్నారు.

ఈ నోటీస్ చూసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని వారు విద్యార్థుల హక్కుల జాతీయ సంఘ నేతల దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాల యాజమాన్యం స్కూల్ వాట్సప్ గ్రూపులో విద్యార్థులకు నోటీసు పంపిందని స్క్రీన్ షాట్లను ఆధారంగా చూపారు. దీంతో స్పందించిన ఆ సంఘ అధ్యక్షుడు ఆరిఫ్ ఖాన్ విషయాన్ని తెలియజేస్తూ డెహ్రాడూన్ ముఖ్య విద్యాధికారికి ఒక లేఖ రాశారు. మన్ కీ బాత్ కి హాజరు కాలేదని జరిమానా విధించిన పాఠశాల యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరారు.

దీనిపై తాజాగా ముఖ్య విద్యాధికారి స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి జీఆర్డీ నిరంజనాపూర్ అకాడమీ స్కూలుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లోగా పాఠశాల యాజమాన్యం సరైన వివరణ ఇవ్వకపోతే విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్టు భావించి శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆ నోటీసులో పేర్కొన్నారు.

First Published:  6 May 2023 7:36 AM GMT
Next Story