Telugu Global
National

భగత్ సింగ్ పాత్ర కోసం సాధన.. మెడకు ఉరితాడు బిగుసుకుని విద్యార్థి మృతి

ఉరితాడు మెడకు కట్టుకుని కిందకు దూకినా నేలను తాకిన తర్వాత మెడకు ఉన్న ఉరితాడు తొలగించుకోవచ్చు అని సంజయ్ భావించాడు. అయితే కిందకు దూకిన తర్వాత కాళ్ళు నేలను తాకకపోవడంతో తాడు మెడకు బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు.

భగత్ సింగ్ పాత్ర కోసం సాధన.. మెడకు ఉరితాడు బిగుసుకుని విద్యార్థి మృతి
X

స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అంటే ఆ విద్యార్థికి ఎంతో ఇష్టం. త్వరలో పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో భగత్ సింగ్ పాత్ర వేస్తానని పేరు ఇచ్చాడు. అందుకోసం కొద్ది రోజులుగా సాధన చేస్తున్నాడు. భగత్ సింగ్‌ను బ్రిటీష్ పాలకులు ఉరితీసి చంపిన సంగతి తెలిసిందే. పాత్రలో భాగంగా ఉరేసుకోవడంపై సాధన చేస్తున్న విద్యార్థి.. నిజంగానే ఉరి బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలో జరిగింది.

వచ్చే నెల ఒక‌టో తేదీన కర్ణాటకలో కన్నడ రాజ్యోత్సవం జరగనుంది. ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. కన్నడ రాజ్యోత్సవంలో భాగంగా పాఠశాలల్లో కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చిత్రదుర్గంలోని కెలకోట ఎస్ఎల్వీ పాఠశాలలో కూడా ఈ వేడుకలు జరపాలని నిర్ణయించారు.

అందులో భాగంగా సంజయ్ గౌడ(12) అనే విద్యార్థి భగత్ సింగ్ పాత్రను పోషిస్తానని పేరు నమోదు చేసుకున్నాడు. ఆదివారం సెలవు రోజు కావడంతో తాను పోషిస్తున్న భగత్ సింగ్ పాత్ర కోసం సంజయ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రిహార్సల్స్ చేస్తున్నాడు. భగత్ సింగ్‌ను ఉరి తీసే సన్నివేశం కోసం సంజయ్ కూడా ఖైదీ దుస్తులు ధరించాడు. ఫ్యాన్‌కు ఉరితాడు కట్టి సిద్ధం చేశాడు. ఆ తర్వాత ముఖానికి దుస్తుల సంచి తొడుక్కుని ఉరితాడు మెడకు తగిలించుకున్నాడు. ఎత్తయిన ప్రదేశం నుంచి కిందకు దూకాడు.

అయితే ఉరితాడు మెడకు కట్టుకుని కిందకు దూకినా నేలను తాకిన తర్వాత మెడకు ఉన్న ఉరితాడు తొలగించుకోవచ్చు అని సంజయ్ భావించాడు. అయితే సంజయ్ ఉరితాడు మెడకు కట్టుకొని కిందకు దూకిన తర్వాత కాళ్ళు నేలను తాకకపోవడంతో తాడు మెడకు బిగుసుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. భగత్ సింగ్ పాత్రను పోషిద్దామని అనుకొని నిజంగానే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

First Published:  31 Oct 2022 7:15 AM GMT
Next Story