Telugu Global
National

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. కర్నాటకలో కమీషన్ల కక్కుర్తి

కాంట్రాక్టు మొత్తంలో 40 శాతం లంచంగా ఇవ్వాలంటూ అధికార బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ SCA ప్రెసిడెంట్ కెంపన్న మరోసారి ఆరోపించారు.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. కర్నాటకలో కమీషన్ల కక్కుర్తి
X

కమీషన్లు లేకుండా కాంట్రాక్ట్ పనులు జరగడం దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. పని విలువలో 10శాతం కమీషన్లు ఇవ్వడం కాంట్రాక్టర్లకు కూడా అలవాటైపోయింది. అయితే ఇప్పుడు కర్నాటకలో బీజేపీ నేతలు బాగా కక్కుర్తిలో ఉన్నారు. సీఎం కుర్చీ ఎప్పుడు మారుతుందో తెలియదు, కొత్తగా సీఎం అయ్యే వ్యక్తి మంత్రులుగా ఎవరిని తీసుకుంటారో తెలియదు. ఈ కన్ఫ్యూజన్లో అవకాశం ఉన్నప్పుడే కమీషన్లు కొట్టేయాలనే ప్లాన్ లో ఉన్నారు మంత్రులు. అందుకే కాంట్రాక్టర్లనుంచి 40శాతం కమీషన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. 40శాతం మంత్రులకు సమర్పించుకుంటే, ఇక పనులేం చేయాలి, తామేం మిగుల్చుకోవాలంటూ దిగాలు పడ్డారు. స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ (SCA) ప్రెసిడెంట్ కెంపన్న ఈ పంచాయితీని ప్రధాని దగ్గర పెడతానంటూ హెచ్చరించారు.

కాంట్రాక్టు మొత్తంలో 40 శాతం లంచంగా ఇవ్వాలంటూ అధికార బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వేధింపులకు గురిచేస్తున్నారంటూ SCA ప్రెసిడెంట్ కెంపన్న మరోసారి ఆరోపించారు. ఈ విషయమై ప్రధాని మోదీకి లేఖ రాయబోతున్నట్టు చెప్పారు. ఇటీవల స్వాతంత్ర వజ్రోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు అని అన్నారని, అయితే ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోని మంత్రులే లంచాలు మరిగారని ఆరోపించారు. బీజేపీ నేతల లంచావతారంపై న్యాయవిచారణకు డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ కోలార్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మునిరత్న అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. న్యాయవిచారణ కమిటీ ముందు సాక్ష్యాలు బయటపెడతానని కూడా చెప్పారు. తమ ఆరోపణలు తప్పని తేలితే, జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధమేనన్నారు కెంపన్న.

కాంట్రాక్టుల్లో 40 శాతం కమీషన్‌ ఇవ్వాలంటూ బీజేపీ మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప వేధిస్తున్నారంటూ ఆమధ్య ఉడుపికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈశ్వరప్పను మంత్రివర్గం నుంచి తొలగించారు. ఆ తర్వాత ఆయనకు పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడం విశేషం. ఇప్పుడు మరో మంత్రి మునిరత్నపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన కూడా 40 శాతం కమిషన్లు ఆశిస్తున్నారంటూ మండిపడుతున్నారు కాంట్రాక్టర్లు.

అయితే ఈ ఆరోపణలను సీఎం బసవరాజ్ బొమ్మై ఖండించారు. రాజకీయ దురుద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారంటూ మండిపడ్డారాయన. కాంట్రాక్టర్లు లోకాయుక్తలో ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. ఒకవేళ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 40శాతం కమీషన్ల వ్యవహారం కర్నాటకలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

First Published:  26 Aug 2022 4:03 AM GMT
Next Story