Telugu Global
National

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా?

జమ్ము కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి తెలుగు రాష్ట్రాల విషయం కూడా తెరపైకి వచ్చింది.

ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా?
X

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే తేల్చి చెప్పింది. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి గానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల డీ-లిమిటేషన్ సాధ్యపడదని స్పష్టం చేసింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం.. ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225కి, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెంచాల్సి ఉన్నది. ఈ చట్టం అమలులోకి వచ్చి ఎనిమిదిన్నర ఏళ్లు గడిచినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పట్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ముందడుగు పడదని అందరూ భావించారు. కానీ జమ్ము కశ్మీర్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పునర్విభజనకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి తెలుగు రాష్ట్రాల విషయం కూడా తెరపైకి వచ్చింది.

ప్రొఫెసర్ కే. పురుషోత్తమ్ రెడ్డి గత నెలలో ఏపీ, టీఎస్‌లో అసెంబ్లీ సీట్ల పెంపుపై రిట్ పిటిషన్ దాఖలు చేశారు. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, కానీ ఎనిమిదిన్నర ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తెలుగు రాష్ట్రాల విషయం మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ కేఎం. జోసెఫ్, జస్టిస్ హృషికేశ్ రాయ్ ల బెంచ్ దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతే కాకుండా జమ్ము కశ్మీర్‌కు సంబంధించి పునర్విభజన చేయాలని జారీ చేసిన ఉత్తర్వులు, దానికి వ్యతిరేకంగా హాజీ అబ్దుల్ ఘనీ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా జత చేయాలని కోరింది.

ఏపీని రెండుగా విభజిస్తూ చేసిన చట్టంలోనే డీలిమిటేషన్‌కు సంబంధించిన క్లాజ్ ఉందని, పునర్విభజనకు ప్రత్యేకంగా చట్టం చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ, ఏపీ సుప్రీంకోర్టకు తెలిపాయి. ఇప్పటికే జమ్ము కశ్మీర్‌తో పాటు అస్సాం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్ రాష్ట్రాలన్నింటికీ కలిపి కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయా రాష్ట్రాల విషయంలో లేని అభ్యంతరం తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఎందుకని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ విషయంలో రెండు రాష్ట్రాలపై వివక్ష చూపడం రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘించడమే అని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

కాగా, బీజేపీ ప్రభుత్వం కావాలనే రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపును తొక్కి పట్టిందనే వాదనలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ కంటే ప్రాంతీయ పార్టీలైన టీఆర్ఎస్, వైసీపీ బలంగా ఉన్నాయి. అసెంబ్లీ సీట్ల పెంపు కారణంగా బీజేపీ కంటే వాటికే ఎక్కువ లాభం ఉంటుంది. అంతే కాకుండా ఆ పార్టీలు మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. సుప్రీంకోర్టే ఇప్పుడు జోక్యం చేసుకోవడంతో కేంద్రం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటులో నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రశ్నించగా.. కచ్చితంగా సీట్లు పెంచాలని చట్టంలో లేదని చెప్పి కేంద్రం తప్పించుకున్నది. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టుకు మాత్రం పూర్తి ఆధారాలతో అఫిడవిట్ నమోదు చేయాల్సి ఉన్నది. పునర్విభజన చట్టంలోనే ఉండటంతో కేంద్రం ఏమని సమాధానం చెప్తుందో వెయిట్ చేయాల్సిందే.

First Published:  13 Oct 2022 12:01 PM GMT
Next Story