Telugu Global
National

11 మంది రేపిస్టుల విడుదలపై కేంద్రానికి, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

గుజరాత్ లో 11 మంది రేపిస్టులను ప్రభుత్వం జైలు నుంచి విడుదల చేయడంపై ఈ రోజు సుప్రీం కోర్టు కేంద్రానికి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

11 మంది రేపిస్టుల విడుదలపై కేంద్రానికి, గుజరాత్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
X

బిల్కిస్ బానో కేసులో 11 మంది రేపిస్టుల విడుదలపై సుప్రీంకోర్టు కేంద్రానికి, గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వీరి విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను పురస్కరించుకుని.. దీనిపై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ విక్రమ్ నాథ్ లతో కూడిన బెంచ్ గురువారం ఈ పిటిషన్ ను విచారించింది. ఈ కేసులో 11 మంది నిందితులను జైలు నుంచి విడుదల చేయాలన్న గుజరాత్ ప్రభుత్వ క్షమాభిక్ష ఉత్తర్వులను తాము సవాలు చేస్తున్నామని సీనియర్ లాయర్ కపిల్ సిబల్, మరో లాయర్ అపర్ణా భట్ పేర్కొన్నారు. ఈ కేసులోని నేర తీవ్రతను కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కపిల్ సిబల్ కోరారు. 1992 నాటి తమ రెమిషన్ పాలసీని అనుసరించి ఈ చర్య తీసుకున్నామని, అంతే తప్ప 2014 నాటి పాలసీని కాదని గుజరాత్ ప్రభుత్వం ఇదివరకే తెలిపింది. ఈ నిందితుల్లో ఒకరైన రాధేశ్యామ్ భగవాన్ దాస్ షా అలియాస్ లాలా వకీల్ తమకు క్షమాభిక్ష పెట్టాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ ని పరిశీలించాలని గత మే నెలలో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది.


నిందితులను దోషులుగా నిర్ధారించే నాటికి 1992 జులై 9 తేదీ రెమిషన్ పాలసీ అమల్లో ఉందని, అందువల్ల ముందుగానే తమను విడుదల చేయాలని ఆ నిందితుడు పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు.. హర్యానా వర్సెస్ జగదీష్ కేసులో నాడు తానిచ్చిన తీర్పును పరిశీలించినట్టు కనబడుతోంది. నిందితులను ముందుగానే రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ తేదీని పరిగణనలోకి తీసుకోవాలని.. ఈ పాలసీని వర్తింపజేయాలని నాడు కోర్టు సూచించింది.

గుజరాత్ ప్రభుత్వ ఉత్తర్వులను సీపీఎం నేత సుభాషిణి అలీ, జర్నలిస్ట్, ఫిల్మ్ మేకర్ రేవతి లాల్, సామాజిక కార్యకర్త రేఖావర్మ తమ పిటిషన్ లో సవాలు చేశారు. అయితే ఈ ఉత్తర్వులలోని ఉచితానుచితాలను తాము పరిశీలించినట్టు కోర్టు పేర్కొంది. ఏమైనా.. ఈ కేసులో 11 మంది రేపిస్టుల విడుదల పట్ల కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కనబడుతోంది.




First Published:  25 Aug 2022 8:32 AM GMT
Next Story