Telugu Global
National

జైనుల జోలికొస్తే ఊరుకోం.. సేవ్ శిఖర్జీ ఉద్యమం ఉధృతం

జార్ఖండ్ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న జైనుల పుణ్యక్షేత్రం సమ్మద్ శిఖర్జీ. మొత్తం 24మంది జైన తీర్థంకరుల్లో 20మంది ఇక్కడే మోక్షాన్ని పొందారు. అందుకే ఈప్రాంతం జైనులకు అత్యంత పవిత్రమైనది

జైనుల జోలికొస్తే ఊరుకోం.. సేవ్ శిఖర్జీ ఉద్యమం ఉధృతం
X

ఏదైనా మతానికి చెందిన పవిత్ర స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామంటూ ప్రభుత్వాలు ముందుకొస్తే, కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే దాదాపుగా ఎవరూ అడ్డుచెప్పరు. కానీ జైనులు మాత్రం ఆ క్షేత్ర పవిత్రత దెబ్బతీయొద్దని, వ్యాపార ప్రయోజనాలకోసం తమ మత విశ్వాసాలను కించరపచొద్దని వేడుకుంటున్నారు. జార్ఖండ్ లోని శిఖర్జీ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే ప్రతిపాదన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం జార్ఖండ్ లోనే కాదు, దేశవ్యాప్తంగా సేవ్ శిఖర్జీ ఉద్యమాన్ని ఉధృతం చేశారు.

శిఖర్జీ ప్రాధాన్యమేంటి..?

జార్ఖండ్ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న జైనుల పుణ్యక్షేత్రం సమ్మద్ శిఖర్జీ. మొత్తం 24మంది జైన తీర్థంకరుల్లో 20మంది ఇక్కడే మోక్షాన్ని పొందారు. అందుకే ఈప్రాంతం జైనులకు అత్యంత పవిత్రమైనది. దిగంబరులు, శ్వేతాంబరులకు ఈ ప్రాంతం చాలా ముఖ్యం. జైన మందిరంతోపాటు, తీర్థంకరుల పాదముద్రల చుట్టూ ఇక్కడ ఆలయాల నిర్మాణం ఉంటుంది. ఆ పాద ముద్రలను జైనులు అత పవిత్రంగా భావిస్తారు.




పర్యాటకంతో నష్టమేంటి..?

పర్యాటక ప్రాంతంగా ప్రకటించి అభివృద్ధి చేస్తే జనం తాకిడి పెరుగుతుంది, శిఖర్జీ ప్రాధాన్యం మరింత ప్రాచుర్యంలోకి వస్తుందనేది ప్రభుత్వం వాదన. కానీ జైనులు అంగీకరించడంలేదు. అభివృద్ధి పేరుతో తమ పుణ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయొద్దని వారు వేడుకుంటున్నారు. జనం తాకిడి ఎక్కువైతే ప్రశాంతత దెబ్బతింటుందని, దీన్ని ఓ కమర్షియల్ టూరిస్ట్ ప్ల్లేస్ గా మార్చడం తమకు ఇష్టం లేదని చెబుతున్నారు. శిఖర్జీ ఆధ్యాత్మిక క్షేత్రంగానే ఉండాలని వారు కోరుతున్నారు. సేవ్ శిఖర్జీ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. జార్ఖండ్‌ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ముంబైలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద నిర్వహించిన నిరసన ప్రదర్శనలో వేల సంఖ్యలో జైనులు పాల్గొన్నారు. అటు జార్ఖండ్ లోని రాంచీ సహా ఇతర ప్రాంతాల్లో కూడా జైనులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. మరి దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.

First Published:  5 Jan 2023 1:16 AM GMT
Next Story