Telugu Global
National

'గోబ్యాక్ అముల్', ట్విట్టర్ ట్రెండింగ్...రాష్ట్రాలమీద‌ కేంద్రం కుట్రలపై మండిపడుతున్న కర్నాటక జనం

గుజరాత్ కు చెందిన అముల్ త్వరలో కర్నాటకలో ఎంటర్ అవుతుందనే ఈ ప్రచారం కన్నడిగులను ఆందోళనకు గురి చేస్తున్నది. కర్నాట‌కకు చెందిన నందిని పాలను, పాల ఉత్పత్తులను నాశ‌నం చేసి గుజరాత్ కు చెందిన అముల్ కు లాభం చేకూర్చడం కోసం ఇది కేంద్ర ప్రభుత్వ చేస్తున్న కుట్రగా సోషల్ మీడియాలో నెటిజనులు విమర్శ‌ల వర్షం కురిపిస్తున్నారు.

గోబ్యాక్ అముల్, ట్విట్టర్ ట్రెండింగ్...రాష్ట్రాలమీద‌ కేంద్రం కుట్రలపై మండిపడుతున్న కర్నాటక జనం
X

‘అమూల్ మీకు పాలు, పెరుగు రూపంలో కొత్త తాజాదనాన్ని అందిస్తుంది. వాణిజ్య ప్లాట్‌ఫారమ్‌లలో త్వరలో అందుబాటులోకి వస్తుంది. మీరు వాటిని మీ ఇంటి వద్దే ఆర్డర్ చేయవచ్చు'

' అముల్ త్వరలో మీ బెంగళూరుకు చేరుకుంటోంది', 'కెంగేరి నుండి వైట్‌ఫీల్డ్ వరకు, తాజాదనం యొక్క కొత్త అనుభవం' ఈ ప్రచారం ప్రస్తుతం బెంగళూరులో ఊదరగొడుతోంది.

గుజరాత్ కు చెందిన అముల్ త్వరలో కర్నాటకలో ఎంటర్ అవుతుందనే ఈ ప్రచారం కన్నడిగులను ఆందోళనకు గురి చేస్తున్నది. కర్నాట‌కకు చెందిన నందిని పాలను, పాల ఉత్పత్తులను నాశ‌నం చేసి గుజరాత్ కు చెందిన అముల్ కు లాభం చేకూర్చడం కోసం ఇది కేంద్ర ప్రభుత్వ చేస్తున్న కుట్రగా సోషల్ మీడియాలో నెటిజనులు విమర్శ‌ల వర్షం కురిపిస్తున్నారు. కర్ణాటక మార్కెట్లోకి అమూల్ ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ #GoBackAmul, #SaveNandini హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్‌లో ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి

కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎంఎఫ్)కి చెందిన రాష్ట్ర స్థానిక బ్రాండ్ నందినికి అమూల్ ప్రవేశం ముప్పు తెచ్చిపెడుతుందన్న ఆందోళనల నేపథ్యంలో ట్విట్తర్ వార్ తెరపైకి వచ్చింది.

కొన్ని రోజుల క్రితం మాండ్యాలో జరిగిన బహిరంగ సభలో అమూల్, నందిని మధ్య సహకారం ఉండాలని, వీలైతే విలీనం కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ పరిణామం సంభవించింది. కర్నాటక డెయిరీ మార్కెట్‌లోకి అమూల్ ప్రవేశించడం అనేక వర్గాలను, ప్రత్యేకించి పాడి రైతులు, కన్నడ అనుకూల సమూహాలను ఆందోళనకు గురి చేస్తోంది. .

నందిని బ్రాండ్ వాల్యూని ప్రోత్సహించడానికి పాల ఫెడరేషన్ తగినంతగా పని చేయడం లేదని చాలా మంది నమ్ముతున్నారని కెఎమ్‌ఎఫ్ డైరెక్టర్లలో ఒకరైన ఆనంద్ కుమార్ అన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా ధరలను నిర్ణయించే స్వయంప్రతిపత్తిని పాడి రైతులకు ప్రభుత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

“అమూల్ కంటే మెరుగైన నాణ్యమైన పాలు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ నందిని బ్రాండ్‌ను మార్కెటింగ్ చేయడంలో, ప్రచారం చేయడంలో మేము చాలా వెనుకబడి ఉన్నాము. అమూల్ పాల వినియోగం కేవలం 10 శాతం అయినప్పటికీ, వారి ప్రకటనలు 90 శాతం ఉన్నాయి. ఇది కర్ణాటక పాడి రైతులకు తీవ్ర‌ ఆందోళన కలిగించే అంశం. నందిని ని రక్షించుకోవడానికి ,బ్రాండ్ విలువను పెంపొందించడానికి, ప్రజలకు అవగాహన కల్పించడానికి మేము బలమైన ప్రకటనల ప్రచారాన్ని అమలు చేయాలి, ”అని కుమార్ అన్నారు.

ట్విటర్‌లో, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య, కర్ణాటకలో అమూల్‌కు బ్యాక్‌డోర్ ప్రవేశాన్ని అనుమతించినందుకు కర్ణాటక బిజెపి ప్రభుత్వంపై మండిపడ్డారు.. కర్ణాటకలో అమూల్ ప్రవేశంతో కన్నడిగుల ఆస్తులకు ముప్పు వాటిల్లుతుందని అన్నారు.

“@PMOIndia @narendramodi, @HMOIndia @AmitShah & వారి డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో జాగ్రత్త!! కన్నడిగులకు చెందిన ఆస్తులన్నీ అమ్మేస్తారు. మన‌ బ్యాంకులను నాశనం చేసిన తర్వాత, వారు ఇప్పుడు మన రైతులు నిర్మించిన నందిని KMF బ్రాండ్‌ను నాశనం చేయాలని నిర్ణయించుకున్నారు. KMF , అమూల్ విలీనం గురించి కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడిన రోజు నుండి రాష్ట్ర పాల ఉత్పత్తి దెబ్బతింటూ వస్తున్నది ”అని ఆయన అన్నారు.

“విలీన ఆలోచనను కన్నడిగులు తీవ్రంగా వ్యతిరేకించినందున, అమూల్ ఇప్పుడు బ్యాక్‌డోర్ ఎంట్రీని పొందేందుకు ప్రయత్నిస్తోంది. గుజరాత్‌కు చెందిన అమూల్ గతంలో పాలు, పెరుగు విక్రయించేందుకు కర్ణాటక మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆ చర్యను మేము అనుమతించలేదు. కానీ ఇప్పుడు కర్నాటక బీజేపీ అముల్ ను ఆత్మీయంగా స్వాగతిస్తోంది. KMF రోజువారీ పాల సేకరణ 99 లక్షల లీటర్లు. కాగా ఇప్పుడు 71 లక్షల లీటర్లకు పడిపోయింది'' అని ఆయన ఆందోళన వెలిబుచ్చారు.

కర్నాటక‌లోకి అముల్ దొడ్డిదారి ఎంట్రీపై జనతాదళ్ (సెక్యులర్) కూడా మండిపడింది. కర్నాటక నుండి నందిని బ్రాండ్‌ను నిర్మూలించడానికి అమూల్ ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించింది. .

“ఈ పరిణామం మన దేశం గర్వించదగ్గ సంస్థ KMF నందినిని దశలవారీగా తొలగించే దుష్ట ప్రణాళికలో భాగంగా కనిపిస్తోంది. ప్రత్యక్ష విలీనం సాధ్యం కానప్పుడు, ఈ రకమైన మాయలు చేస్తారు. మనం మౌనంగా కూర్చుంటే భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది’’ అని జేడీ(ఎస్) పేర్కొంది.

ప్రతిపక్షాలే కాకుండా పలు కన్నడ సంఘాలు కూడా కర్నాటకలోకి అముల్ రంగప్రవేశం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనిపై పోరాటం చేయాలని నిర్ణయించాయి. రైతులతో కలిసి పలు సంఘాలు పోరాడటానికి ప్రణాలికలు రచిస్తున్నాయి.

First Published:  8 April 2023 3:49 AM GMT
Next Story