Telugu Global
National

రాహుల్ పాదయాత్రలో 'సావర్కర్ ఫొటో'.. కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం

ఈ ఫ్లెక్సీకి సంబంధించిన వీడియోను స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వైరల్‌గా మారింది. విషయాన్ని గ్రహించిన పార్టీ హైకమాండ్ వెంటనే ఫ్లెక్సీ కట్టిన నెండుబరిసి ప్రాంత ఐఎన్‌టీయూసీ ప్రెసిడెంట్ సురేశ్‌ను సస్పెండ్ చేసింది.

రాహుల్ పాదయాత్రలో సావర్కర్ ఫొటో.. కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహం
X

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కేరళలో సాగుతున్న ఆయన యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు కలవడం, సామాన్యులతో క‌లిసి నడుస్తుండటంతో రాహుల్‌కు మద్దతు పెరుగుతోంది. అయితే కేరళలోని అలువలో భారత్ జోడో యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన పొడవైన ఫ్లెక్సీ వివాదానికి దారి తీసింది. రాహుల్‌కు స్వాగతం పలుకుతూ స్థానిక కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర సమరయోధుల ఫొటోలతో ఒక ఫ్లెక్సీని కట్టింది. అయితే అందులో సావర్కర్ ఫొటో ఉండటంతో విమర్శలు చెలరేగాయి. సావర్కర్ అసలు స్వాతంత్ర సమరయోధుడే కాదని.. ఆయన బ్రిటిషర్ల వద్ద క్షమాభిక్ష పొంది, వారి నుంచి పెన్షన్ కూడా తీసుకున్నాడని చరిత్ర చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనను ఏనాడూ స్వాతంత్ర సమరయోధుడిగా గుర్తించలేదు. కేవలం బీజేపీ వచ్చిన తర్వాతే సావర్కర్‌కు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కాగా, ఈ ఫ్లెక్సీకి సంబంధించిన వీడియోను స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ సోషల్ మీడియాలో పోస్టు చేయగానే వైరల్‌గా మారింది. విషయాన్ని గ్రహించిన పార్టీ హైకమాండ్ వెంటనే ఫ్లెక్సీ కట్టిన నెండుబరిసి ప్రాంత ఐఎన్‌టీయూసీ ప్రెసిడెంట్ సురేశ్‌ను సస్పెండ్ చేసింది. ఆ బ్యానర్ వెంటనే తీసేసినా.. దానికి సంబంధించిన ఫ్లెక్సీలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, ఫ్లెక్సీ కట్టిన సురేశ్ అసలు పొరపాటు ఎలా జరిగిందో చెప్పుకొచ్చాడు.

రాహుల్ పాదయాత్ర సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల ఫొటోలతో కూడిన 88 అడుగుల ఫ్లెక్సీని ఏర్పాటు చేయాలని భావించాము. నేను ఓ ప్రింటింగ్ ప్రెస్‌కు వెళ్లి 20 మంది ఫ్రీడమ్ ఫైటర్ల ఫొటోలతో ఫ్లెక్సీ డిజైన్ చేయమని చెప్పి వెళ్లాను. అక్కడ ఉన్న వ్యక్తి గూగుల్ నుంచి ఫొటోలు డౌన్‌లోడ్ చేశాడు. అతడికి సావర్కర్ ఎవరో తెలియదు. నేను కూడా ప్రూఫ్ రీడింగ్ చూసుకోకుండానే ప్రింట్ చేయించానని చెప్పారు. ప్రింటింగ్ పూర్తయిన తర్వాత రాత్రి వెళ్లి ఆ పొడవైన బ్యానర్‌ను రోడ్డు పక్కన కట్టానని అన్నాడు. అయితే ఎవరో తెలియని వ్యక్తి ఆ బ్యానర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎమ్మెల్యే అన్వర్ నాకు కాల్ చేశారు. మీ బ్యానర్‌లో సావర్కర్ ఫొటో ఉంది.. ఆ వీడియో వైరల్ అయ్యింది చూసుకోండి అని చెప్పారు. ఆయన కూడా ఆ వీడియో షేర్ చేసినట్లు నాకు తెలిసింది. వెంటనే సావర్కర్ ప్లేస్‌లో గాంధీ బొమ్మ అతికించాను. కానీ ఆ తర్వాత బ్యానర్ మొత్తం తీసేశానని చెప్పుకొచ్చాడు.

నా వల్ల పార్టీకి అవమానం జరిగింది. నేను అజాగ్రత్తతో ఉండటం వల్లే ఇలా అయ్యింది. నేను సస్పెండ్ అయినందుకు బాధపడటం లేదు. కానీ నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందనే విచారిస్తున్నానంటూ మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా మొదట ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆ తర్వాత తప్పును సరిదిద్దుకున్నది. కేవలం చిన్న పొరపాటు వల్లే అలా జరిగింది. సావర్కర్‌ను మేము ఎప్పుడూ హిందుత్వ ప్రమోటర్‌గానే చూస్తామని వివరించింది.

First Published:  23 Sep 2022 3:15 AM GMT
Next Story