Telugu Global
National

ఆడ్ డేస్ లో నేను సారీ చెప్తా.. ఈవెన్ డేస్ లో నువ్వు సారీ చెప్పు

ఢిల్లీ వీధుల్లో తిరిగితే రామచిలుకలు కూడా కాకుల్లా మారిపోతాయంటూ మరో కార్టూన్ చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలో సిగరెట్ తాగడం కంటే యోగా చేయడమే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా మీమ్స్ పెడుతున్నారు.

ఆడ్ డేస్ లో నేను సారీ చెప్తా.. ఈవెన్ డేస్ లో నువ్వు సారీ చెప్పు
X

ఢిల్లీలో కాలుష్యం పరిధి దాటింది, ఈ విషయంలో ఎవరూ చేయడానికేం లేదు, ఇది ఒకరోజులో వచ్చే మార్పు కూడా కాదు. కానీ ప్రతిసారీ ఢిల్లీ ప్రభుత్వం పంజాబ్ పై విమర్శలు చేసేది. పంజాబ్ లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్లే ఢిల్లీలో శీతాకాలం వాయుకాలుష్యం పెరిగిపోతుందనేది. కానీ ఈసారి రెండు చోట్లా ఆమ్ ఆద్మీ ప్రభుత్వాలే ఉన్నాయి. దీంతో ఇటీవలే కామన్ గా ప్రెస్ మీట్ పెట్టిన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కాలుష్యానికి పూర్తి బాధ్యత తమదేనంటున్నారు. వచ్చే ఏడాదికల్లా ఈ కాలుష్యాన్ని నివారించే ప్రయత్నం చేస్తామంటున్నారు. అయితే సోషల్ మీడియా వదిలిపెడుతుందా.. ఢిల్లీ కాలుష్యంపై ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. సమస్యను అనుభవిస్తున్నవారికి ఇది కోపం తెప్పించినా సోషల్ మీడియాలో మాత్రం ఈ మీమ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

సారీ, సరి.. బేసి

ఢిల్లీలో వాహనాల వినియోగంపై సరి, బేసి విధానాన్ని మళ్లీ తీసుకొస్తామని అన్నారు సీఎం కేజ్రీవాల్. దీనిపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. సరి రోజుల్లో నేను సారీ చెప్తా, బేసి రోజుల్లో నువ్వు సారీ చెప్పు అంటున్నట్టుగా ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మన్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్టు కార్టూన్ వదిలారు. ఈ కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఢిల్లీ వీధుల్లో తిరిగితే రామచిలుకలు కూడా కాకుల్లా మారిపోతాయంటూ మరో కార్టూన్ చక్కర్లు కొడుతోంది. ఢిల్లీలో సిగరెట్ తాగడం కంటే యోగా చేయడమే ఆరోగ్యానికి హానికరం అన్నట్టుగా మీమ్స్ పెడుతున్నారు. యోగా చేస్తూ డీప్ బ్రీత్ తీసుకుంటే ఢిల్లీలో పై ప్రాణం పైనే పోతుందనేది ఇక్కడ సెటైర్. ఇక సూపర్ మ్యాన్ కూడా ఢిల్లీ వీధుల్లో తిరిగితే 10నిమిషాల తర్వాత ఆస్పత్రికి వచ్చి ఆక్సిజన్ పెట్టుకోవాల్సిందేనంటూ ఇంటర్నెట్ లో జోకులు పేలుతున్నాయి.

మీమ్స్ సంగతి ఎలా ఉన్నా ఢిల్లీ ప్రభుత్వం కాలుష్యం వల్ల కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆదేశాలిచ్చింది. స్కూల్స్ మూసివేసింది. డీజిల్ ఇంజిన్ ఉన్న రవాణా వాహనాలకు ఢిల్లీలోకి నో ఎంట్రీ అని స్పష్టం చేసింది. ప్రైవేట్ కార్యాలయాలు కూడా ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయించుకోవాలని సూచించారు సీఎం కేజ్రీవాల్. త్వరలో సరి, బేసి విధానం తిరిగి తీసుకొస్తామన్నారు.

First Published:  5 Nov 2022 12:17 PM GMT
Next Story