Telugu Global
National

'నన్ను గెలిపిస్తే... ఊరికి మూడు ఎయిర్ పోర్టులు, రోజుకో మందు బాటిల్, స్త్రీలకు మేకప్ కిట్... ఫ్రీ ఫ్రీ ఫ్రీ'

హర్యాణాలోని ఓ గ్రామంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఓ అభ్యర్థి ఇస్తున్న హామీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రామానికి మూడు ఎయిర్ పోర్టులు, ఫ్రీ మందు, 20 రూపాయలకే పెట్రోల్, 100 రూపాయలకే గ్యాస్...ఇలాంటి 13 హామీలిచ్చాడు ఆ సర్పంచ్ అభ్యర్థి.

నన్ను గెలిపిస్తే... ఊరికి మూడు ఎయిర్ పోర్టులు, రోజుకో మందు బాటిల్, స్త్రీలకు మేకప్ కిట్... ఫ్రీ ఫ్రీ ఫ్రీ
X

ఎన్నికలొస్తే రాజకీయ నాయకుల నోట్లో నరం ఉండదు, వాళ్ళు చేసే వాగ్దానాలకు హద్దుండదు. వాళ్ళు ఇచ్చిన‌ వాగ్దానాలెంటో ఎన్నికల తర్వాత వాళ్ళకే కాదు జనాలకు కూడా గుర్తుండవు. అయితే నాయకులిచ్చే వాగ్దానాల్లో కూడా కొన్ని వింతగా, కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి.

హర్యాణాలోని సిర్సాద్ అనే గ్రామంలో జైకరన్ లాత్వాల్ అనే అతను సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నాడు.

తనకు ఓటేయమని ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్న ఆయన ఇస్తున్న హామీలు వింటే తల తిరిగిపోవడం ఖాయం. ఆయనను గెలిపిస్తే గ్రామం కోసం ఏమేం చేస్తాడో ఆయన పోస్టర్లు ప్రింట్ చేసి గోడలకు కూడా అతికించాడు. ఆయన ఇచ్చిన హామీలను ఒక్క సారి చూద్దాం...

1.గ్రామానికి మూడు విమానాశ్ర‌యాలు

2. మద్యంతాగే వారికి రోజుకో మందు బాటిల్

3. మహిళలకు ఉచిత మేకప్ కిట్

4. 20 రూపాయలకు లీటర్ పెట్రోల్

5. 100 రూపాయలకు గ్యాస్ సిలండర్

6. జిఎస్‌టి రద్దు

7. ఉచిత వై-ఫై

8. ప్రతి కుటుంబానికి ఉచిత బైక్‌లు

9. సిర్సాద్ నుండి ఢిల్లీకి మెట్రో లైన్

10. ప్రతి ఐదు నిమిషాలకు సిర్సాద్ నుండి గోహనా వరకు హెలికాప్టర్ సేవలు

11. ప్రతి యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం

12. కరెంట్ కోసం అండర్ గ్రౌండ్ లైన్, నీళ్ళ కోసం పైనుంచి పైప్ లైన్

13. ప్రతిరోజు సర్పంచ్ మన్ కీ బాత్

ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ పోస్టర్ ఫోటోను ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా ఆన్‌లైన్‌లో షేర్ చేశారు. పైగా నేను ఆ వూరికి వెళ్ళిపోతాను అని కామెంట్ చేశారాయన.

దీనిపై నెటిజనులు కూడా భారీగానే స్పందిస్తున్నారు. ఇవన్నీ ప్రధాని అభ్యర్థి కూడా చేయలేరని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, ఇతను ప్రధాని పదవికి పోటీ పడాలని మరో నెటిజన్ సూచించారు. అయితే ఆ గ్రామానికి వెళ్ళాలన్న కోరికను మాత్రం చాలా మంది నెటిజనులు వెల్లడించారు.


Next Story