Telugu Global
National

నవీన భారత పితామహుడిగా మోడీని పోలుస్తారా..? సంజయ్ రౌత్ ఫైర్

నవీన భారతదేశంలో ఆకలి కేకలు, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, అలాంటప్పుడు నవీన భారత పితామహుడిగా మోడీని అభివర్ణించడం ఆయన్ని అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు.

నవీన భారత పితామహుడిగా మోడీని పోలుస్తారా..? సంజయ్ రౌత్ ఫైర్
X

నవీన భారత పితామహుడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అభివర్ణిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత అభివర్ణించడంపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గ నేత సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీని ఇలా పోల్చడం ఆయన్ను అవమానపరచడమేనని రౌత్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మాక్ కోర్ట్ ఇంటర్వ్యూలో అమృతా ఫడ్నవిస్ మాట్లాడుతూ మన దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నట్లు పేర్కొన్నారు. అప్పట్లో మన జాతిపిత మహాత్మా గాంధీ అయితే, నవీన భారత పితామహుడు మోడీ అని కామెంట్స్ చేశారు.

అయితే అమృత చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం సృష్టించాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను మహాత్మా గాంధీ మునిమనువడు తుషార్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మోడీని మహాత్ముడితో ఎలా పోలుస్తారని మండిపడ్డారు. కాగా ఈ విషయమై తాజాగా సంజయ్ రౌత్ స్పందించారు. అమృత చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో రౌత్ విమర్శలు చేశారు.

నవీన భారతదేశంలో ఆకలి కేకలు, పేదరికం, నిరుద్యోగం, ఉగ్రవాదం రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, అలాంటప్పుడు నవీన భారత పితామహుడిగా మోడీని అభివర్ణించడం ఆయన్ని అవమానపరచడమేనని వ్యాఖ్యానించారు. జాతిపితగా మహాత్మా గాంధీని మాత్రమే దేశ ప్రజలు పిలుచుకున్నారన్నారు. బీజేపీకి కానీ, ఆర్ఎస్ఎస్ కి కానీ స్వాతంత్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేదని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ తో సంబంధాలు ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లను తమ వాళ్లుగా చిత్రించుకునే ప్రయత్నాలు బీజేపీ చేస్తోందని రౌత్ విమర్శించారు.

First Published:  25 Dec 2022 1:57 PM GMT
Next Story