Telugu Global
National

శివాజీకి అవమానం.. మహారాష్ట్ర గవర్నర్ ని తొలగించాల్సిందే..

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు పాతవైపోయాయని అన్నారు గవర్నర్ కోష్యారీ, ఆ స్థానంలో కొత్త తరం నాయకుల విగ్రహాలు పెట్టాలన్నారు.

శివాజీకి అవమానం.. మహారాష్ట్ర గవర్నర్ ని తొలగించాల్సిందే..
X

ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. శివాజీని అవమానించిన గవర్నర్ ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఉద్ధవ్ సేన నేత సంజయ్ రౌత్. గవర్నర్ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం సీఎం షిండే తప్పు అని అన్నారు. వెంటనే షిండే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు సంజయ్ రౌత్. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు.

కోష్యారీ చేసిన వ్యాఖ్యలేంటి..?

మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాలు పాతవైపోయాయని అన్నారు గవర్నర్ కోష్యారీ, ఆ స్థానంలో కొత్త తరం నాయకుల విగ్రహాలు పెట్టాలన్నారు. కొత్త తరంలో మహారాష్ట్ర కీర్తిపతాకాన్ని రెపరెపలాడించినవారు చాలామందే ఉన్నారన్నారు కోష్యారీ. అంబేద్కర్ దగ్గర్నుంచి నితిన్ గడ్కరీ వరకు చాలామంది నాయకులున్నారని, వారి విగ్రహాలు పెట్టాలని పిలుపునిచ్చారు.

శివాజీకి గడ్కరీకి పోలికేంటి..

బీజేపీ నాయకుడైనంత మాత్రాన శివాజీకి, గడ్కరీకి పోలికేంటని అంటున్నారు ఉద్ధవ్ సేన నాయకులు. ప్రభుత్వంలో భాగమైన షిండే సేనపై వారు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఆత్మగౌరవ నినాదంతో శివసేనను విచ్ఛిన్నం చేసి ఉద్ధవ్‌ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండేకు, ఇప్పుడా ఆత్మగౌరవం ఏమైందంటూ ఎద్దేవా చేశారు సంజయ్ రౌత్. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌ షా కూడా శివాజీ మహారాజ్‌, ఔరంగజేబుకు ఐదుసార్లు క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు. గవర్నర్ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పడమే కాకుండా తక్షణమే ఆయన్ను పదవినుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌ నాయకుడు రాహల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో వీర సావర్కర్‌ పై చేసిన వ్యాఖ్యలను ఉద్ధవ్ వర్గం ఖండించిందని, నిరసన తెలిపిందని గుర్తు చేశారు సంజయ్ రౌత్. సావర్కర్‌ పై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బూట్లతో దాడి చేస్తోందని, ఇప్పుడు గవర్నర్‌ చేసిన పనికి రాజ్ భవ‌న్‌ పైకి చెప్పులు విసరాలా అని మండిపడ్డారు. గవర్నర్‌ వ్యాఖ్యల ప్రకారం రాముడు, కృష్ణుడి విగ్రహాలు కూడా పాతవి అయిపోయాయి కాబట్టి, ఇప్పుడూ మనం కొత్త దేవతలను ఆరాధించాలా అని సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు.

First Published:  21 Nov 2022 6:12 AM GMT
Next Story