Telugu Global
National

భారత్‌లో భారీగా తగ్గిన సంతానోత్పత్తి..

భారత్‌లోని పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది. దేశం మొత్తమ్మీద సగటున సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయింది.

భారత్‌లో భారీగా తగ్గిన సంతానోత్పత్తి..
X

జనాభాలో చైనాను భారత్ దాటేస్తుందన్న భయాందోళనలు ఓవైపు ఉన్నా.. మరోవైపు భారత్ లో సంతానోత్పత్తి శాతం భారీగా పడిపోయిందన్న వాస్తవాలు కూడా వెలుగు చూస్తున్నాయి. గడచిన పదేళ్ల కాలంలో భారత్ లో సాధారణ సంతానోత్పత్తి రేటు 20శాతం పడిపోయిందని శాంపిల్ రిజిస్ట్రేషన్ డేటా-2020 రిపోర్టు స్పష్టం చేసింది.

ప్రతి వెయ్యి మంది మహిళలకు ఒక ఏడాదిలో జన్మించిన చిన్నారుల సంఖ్యను జనరల్ ఫర్టిలిటీ రేట్ గా చెబుతారు. 2008 -2010లో భారత్ లో జనరల్ ఫర్టిలిటీ రేట్ (GFR) 86.1 శాతం కాగా, 2018-20 మధ్య కాలంలో అది 68.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే సంతోనాత్పత్తి క్షీణత ఎక్కువగా ఉంది. భారత్ లోని పట్టణ ప్రాంతాల్లో సంతానోత్పత్తి క్షీణత 15.6 శాతంగా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో 20.2 శాతంగా ఉంది. దేశం మొత్తమ్మీద సగటున సాధారణ సంతానోత్పత్తి రేటు 20 శాతం పడిపోయింది. GFR గణాంకాలు జనాభావృద్ధి తగ్గుదలను సూచిస్తున్నాయని చెబుతున్నారు అధికారులు.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు ఏపీలో 50.7 శాతం, తెలంగాణలో 52.6 శాతంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 28.5 శాతం మేర సంతానోత్పత్తి రేటు ఉంది. సంతానోత్పత్తి రేటు కోసం 15-49 సంవత్సరాల వయసు మధ్య వారిని ఎంపిక చేసి సర్వే చేపడతారు.

కారణాలేంటి..?

సంతానోత్పత్తి తగ్గడానికి చాలా కారణాలు కనపడుతున్నాయి. దంపతులు కెరీర్ పై దృష్టిపెట్టి సంతానానికి ప్రయారిటీ ఇవ్వకపోవడం ప్రధాన కారణం కాగా, ఆరోగ్య సమస్యలు ద్వితీయ కారణంగా తెలుస్తోంది. మహిళల్లో అక్షరాస్యత శాతం పెరగడం, ఆధునిక సంతాన నిరోధక సాధనాల వల్ల కూడా సంతానోత్పత్తి గణనీయంగా పడిపోయిందని చెబుతున్నారు. పెద్ద కుటుంబాలు కనుమరుగవుతున్నాయి. గతంలో ఇద్దరు పిల్లలకు ప్రాధాన్యమిస్తున్న కుటుంబాలు ఎక్కువగా ఉండగా, ఆడ అయినా మగ అయినా ఇప్పుడు ఒకే ఒక్కరితో సరిపెడుతున్నారు. దీంతో సంతానోత్పత్తి శాతం భారీగా పడిపోయింది.

First Published:  27 Sep 2022 9:55 AM GMT
Next Story