Telugu Global
National

బీజేపీ బాటలోనే కాంగ్రెస్‌

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ సైతం కాంగ్రెస్‌ను విమ‌ర్శించారు. మధ్యప్రదేశ్‌లో పొత్తును కాంగ్రెస్ తిరస్కరించిందన్నారు. ఎస్పీని మతపరమైన పార్టీ అని, వారసత్వ పార్టీ అని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ బాటలోనే కాంగ్రెస్‌
X

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష ఇండియా కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. నిన్న నితీశ్‌, ఇవాళ అఖిలేశ్‌ యాదవ్‌ కాంగ్రెస్ తీరుపై విమర్శలు గుప్పించారు. గురువారం పాట్నాలో జరిగిన సీపీఐ ర్యాలీలో పాల్గొన్న నితీశ్ కుమార్‌.. బీజేపీ నియంతృత్వ పాలనపై పోరాడడానికి ఇండియా కూటమి ఏర్పాటు చేశామన్నారు. కానీ మొదట్లో ఉన్నంత ఊపు తర్వాత లేకుండా పోయిందని.. దీనికంతటికి కారణం కాంగ్రెస్ పార్టీనే అని విమర్శించారు. కూటమిని వదిలేసి కాంగ్రెస్ ఐదు రాష్ట్రాల ఎలక్షన్ కోసం పాకులాడుతోందంటూ ఫైర్ అయ్యారు.

తాజాగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ సైతం కాంగ్రెస్‌ను విమ‌ర్శించారు. మధ్యప్రదేశ్‌లో పొత్తును కాంగ్రెస్ తిరస్కరించిందన్నారు. ఎస్పీని మతపరమైన పార్టీ అని, వారసత్వ పార్టీ అని కాంగ్రెస్‌ నేతలు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ భాషలోనే కాంగ్రెస్ మాట్లాడుతోందన్నారు. ఇక ఇటీవల జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా సైతం ఇండియా కూటమిలో పార్టీల తీరుపై పెదవి విరిచారు. ప్రస్తుతం బీజేపీని ఎదుర్కొనేంత బలంగా ఇండియా కూటమి లేదన్నారు. కాంగ్రెస్‌, సమాజ్‌ వాదీ పార్టీ మధ్య విబేధాలు కూటమికి మంచిది కాదన్నారు.

లోక్‌సభ ఎన్నికలకు మరో 6 నెలల సమయం మాత్రమే ఉండటంతో ఇండియా కూటమిలో పార్టీల మధ్య విబేధాలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. విపక్ష పార్టీల మధ్య ఐక్యత నేతి బీరకాయలో నేతిలానే మారింది. ఏ రాష్ట్రంలో చూసినా ఎవరికి వారే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ తీరుపై మిగతా పార్టీలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.

First Published:  3 Nov 2023 2:42 PM GMT
Next Story