Telugu Global
National

దామోదర్..! ఆ పేరు భారత్‌లో ఎవరూ వాడకూడదా..?

దీపావళి యాడ్‌లో దీపపు ప్రమిదెలు అమ్ముకునే వ్యక్తి పేరు దామోదర్ కావడంతోనే అసలు చిక్కు వచ్చిపడింది. మోదీ తండ్రి పేరుని కించపరుస్తారా అంటూ సాధ్వి ప్రాచి రెచ్చిపోయారు. క్యాడ్బరీని బ్యాన్ చేయాలంటూ ఆమె సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.

దామోదర్..! ఆ పేరు భారత్‌లో ఎవరూ వాడకూడదా..?
X

నరేంద్ర మోదీ సన్నాఫ్ దామోదర్ దాస్ మోదీ. నమో భక్తులకు మోదీ పేరుతోపాటు ఆయన తండ్రి పేరుపై కూడా అభిమానం పాళ్లు బాగా ఎక్కువగా ఉన్నట్టుంది. ఆ అభిమానంతోనే వారు దామోదర్ అనే పేరుపై పేటెంట్ హక్కులు తమవేనంటూ రచ్చ చేస్తున్నారు. దేశంలో ఇంకెవరూ దామోదర్ అనే పేరుని వాడకూడదంటూ హుకుం జారీ చేస్తున్నారు. వినడానికి విచిత్రంగానే ఉన్నా ఇది నిజం. దామోదర్ అనే పేరుని క్యాడ్బరీ చాకొలేట్స్ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఎందుకు వాడారంటూ హంగామా చేశారు వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచి. క్యాడ్బరీని బ్యాన్ చేయండి అంటూ ఆమె సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు.

ఇదెక్కడి పైత్యం..

ఇటీవల దీపావళి సందర్భంగా క్యాడ్బరీ ఓ అడ్వర్టైజ్‌మెంట్‌ రూపొందించింది. ఓ వృద్ధుడు తోపుడు బండిపై ప్రమిదెలను అమ్ముతుంటాడు. అతని పేరు దామోదర్. ఆ వృద్ధుడిని వెతుక్కుంటూ.. ఓ డాక్టర్ వస్తాడు. ఆ వృద్ధుడికి దీపావళి శుభాకాంక్షలు చెబుతూ క్యాడ్బరీ చాక్లెట్లతో ఉన్న ఓ గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. అంతే కాదు, అతని కోసం ఆన్‌లైన్ షాప్ పెట్టుకునే ఏర్పాటు కూడా చేస్తారు. దీంతో ఆ వృద్ధుడు కృతజ్ఞతా పూర్వకంగా కన్నీరు పెడతాడు. ఇక్కడితో ఈ యాడ్ ముగుస్తుంది. అయితే ఈ యాడ్‌లో దీపపు ప్రమిదెలు అమ్ముకునే వ్యక్తి పేరు దామోదర్ కావడంతోనే అసలు చిక్కు వచ్చిపడింది. మోదీ తండ్రి పేరుని కించపరుస్తారా అంటూ సాధ్వి ప్రాచి రెచ్చిపోయారు. క్యాడ్బరీని బ్యాన్ చేయాలంటూ ఆమె సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు.


మోదీ తండ్రి పేరుని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ సాధ్వి ప్రాచి సోషల్ మీడియాలో మండిపడ్డారు. కావాలనే అతని పేరు దామోదర్ అని పెట్టారని, చాయ్ వాలా తండ్రిని దియా వాలా(దీపాలు అమ్మేవ్యక్తి)గా చూపించారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. షేమ్ ఆన్ యు క్యాడ్బరీ అంటూ ఆమె సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టారు.

సాధ్వి ప్రాచి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దామోదర్ అనే పేరు ఎవరూ వాడకూడదా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. నీరవ్ మోదీ లాంటి వారు దేశం వదిలి పారిపోయి మోదీ పేరుని అభాసుపాలు చేశారని, స్వశక్తితో దీపాలు అమ్ముకునే వ్యక్తి పేరు దామోదర్ అని పెడితే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

First Published:  30 Oct 2022 2:06 PM GMT
Next Story