Telugu Global
National

అదిగో మోడీ ప్రశంసించారు... మరో ఆజాద్‌ కాబోతున్నారు

గతంలో పార్లమెంట్ వేదికగా ఆజాద్‌ను కూడా ప్రధాని ఇలాగే ప్రశంసించారని ఆ తర్వాత ఏం జరిగిందో అందరం చూశామని సచిన్ పైలట్ అన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతోందని ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

అదిగో మోడీ ప్రశంసించారు... మరో ఆజాద్‌ కాబోతున్నారు
X

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో పరిస్థితి చల్లారడం లేదు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. గెహ్లాట్‌ కూడా ఆజాద్‌ దారిలో నడుస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోడీ సీఎంను ప్రశసించడాన్ని ప్రస్తావించిన సచిన్... గతంలో పార్లమెంట్ వేదికగా ఆజాద్‌ను కూడా ప్రధాని ఇలాగే ప్రశంసించారని ఆ తర్వాత ఏం జరిగిందో అందరం చూశామన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అదే జరగబోతోందని ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నాయకత్వం అప్రమత్తంగా ఉండాలని కోరారు.

మంగళవారం రాజస్థాన్‌ మాన్‌గర్ధామ్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీతో సీఎం గెహ్లాట్ వేదిక పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ... అశోక్ జీ, తాను ముఖ్యమంత్రులుగా కలిసి పనిచేశామని చెప్పారు. అశోక్ గెహ్లాట్‌ తమలో అత్యంత సీనియర్‌ అని... ప్రస్తుతం వేదిక మీద ఉన్న వారిలో సీనియర్ మోస్ట్ ముఖ్యమంత్రుల్లో ఆయన ఒకరు అంటూ ప్రధాని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపైనే సచిన్ పైలట్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్‌లో 92 మంది అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేల రాజీనామాల బెదిరింపులపైనా సచిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్‌ ఘటనను పార్టీ క్రమశిక్షణారాహిత్యానికి సంబంధించిన వ్యవహారంగా కాంగ్రెస్ నాయకత్వం ఇప్పటికే గుర్తించి ముగ్గురు నాయకులకు నోటీసులు ఇచ్చిందని.. అయితే క్రమశిక్షణ చర్యలు అందరిపైనా ఒకేలా ఉండాలని.. వారిపై త్వరగా చర్యలు తీసుకోవాలని సచిన్ డిమాండ్ చేశారు. ఆ పనిని కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే త్వరగా పూర్తి చేస్తారనే తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాజస్థాన్‌లో అనిశ్చిత వాతావరణాన్ని తొలగించడానికి ఇదే సరైన సమయమన్నారు.

అశోక్‌ గెహ్లాట్‌ను కాంగ్రెస్ అధ్యక్షుడిగా పంపించి రాజస్తాన్‌ సీఎంగా సచిన్‌ను నియమిస్తారన్న అనుమానంతో సెప్టెంబర్‌లో గెహ్లాట్‌ మద్దతుదారులు స్పీకర్‌ను కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు ఇచ్చారు. అయితే ఈ రాజీనామాలు ఇంకా స్పీకర్‌ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి.

First Published:  2 Nov 2022 9:06 AM GMT
Next Story