Telugu Global
National

'ఆరెస్సెస్ మోడీకి వ్యతిరేకంగా ఉంది,ఈ సారి యోగీని ప్రధానిగా చేయాలనుకుంటోంది'

డబ్బుకు ఆశపడే ఆరెస్సెస్ లోని ఓ వర్గం మోడీకి మద్దతుగా ఉందని అయినప్పటికీ యొగీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని మాలిక్ అన్నారు.

ఆరెస్సెస్ మోడీకి వ్యతిరేకంగా ఉంది,ఈ సారి యోగీని ప్రధానిగా చేయాలనుకుంటోంది
X

కొంత కాలంగా ప్ర‌ధాని మోడీపై విరుచుకపడుతున్న జ‌మ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరో సంచలన విషయం బైటపెట్టారు. మోహన్ భగవత్ సహా, ఆరెస్సెస్ సీనియర్ నేతలంతా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల తర్వాత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ను ప్రధానిని చేయాలనుకుంటున్నారని చెప్పారు.

పుల్వామా దాడి ప్రభుత్వ వైఫల్యమంటూ, బీజేపీ ప్రభుత్వాలు అవినీతిమయపోయాయంటూ కొంత కాలంగా ఆరోపణలు చేస్తున్న మాలిక్ 'ది వైర్ బెబ్' పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, డబ్బుకు ఆశపడే ఆరెస్సెస్ లోని ఓ వర్గం మోడీకి మద్దతుగా ఉందని అయినప్పటికీ యొగీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందని మాలిక్ అన్నారు.

బీజేపీ నాయకులు ప్రతీసారీ మత విభజనలు తీసుకొచ్చి, హిందువులను రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారని మాలిక్ ఆరోపించారు. అయితే అన్ని వేళలా హిందుత్వ ఎజెండా పని చేయదన్న మాలిక్ హిందువుల్లోని యువకులు, మహిళలు, రైతులతో సహా దేశంలోని అన్ని వర్గాలు కేంద్రంలోని బీజేపీ పాలనపై విసిగిపోయాయ‌ని చెప్పారు.

బీజేపీ తనకు తాను జాతీయవాద పార్టీగా ప్రచారం చేసుకుంటోంది కాని అది ఒక భ్రమ అని మాలిక్ అన్నారు. తమది అవినీతి వ్యతిరేక‍ పార్టీ అని చెప్పుకునే మోడీ తన మిత్రుడు గౌతమ్‌ అదానీకి అప్పనంగా 11 విమానాశ్రయాలు ఎలా అప్పగించారని ప్రశ్నించారు. ఈ సారి ఎన్నికల్లో హిందుత్వ ఎజెండా పని చేయదని నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు వ్యతిరేక విధానాలు లాంటివి ముఖ్యపాత్ర పోషిస్తాయని మాలిక్ అభిప్రాయపడ్డారు.

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ ఏకమై మోడీని గద్దె దించాల్సిన అవసరమున్నదని నొక్కి చెప్పిన సత్యపాక్ మాలిక్ తాను వచ్చే ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు. ప్రధాని మోడీ అసమర్థ, పక్షపాత చర్యలను ఎండ గడతానని అన్నారు. రాబోయేది కొత్త ప్రభుత్వమే అని ఆయన అభిప్రాయపడ్డారు.

First Published:  3 May 2023 2:53 AM GMT
Next Story