Telugu Global
National

బీజేపీ గెలుపుకోసం RSS దేశంలో వరుస బాంబు పేలుళ్ళకు పాల్పడింది‍... కోర్టులో RSS నాయకుడి అఫిడవిట్

దేశంలో బీజేపీని గెలిపించడం కోసం ఆరెస్సెస్ దేశవ్యాప్తంగా వరస బాంబు పేలుళ్ళకు పాల్పడిందని ఆరెస్సెస్ మాజీ కార్యకర్త బహిర్గతం చేశారు. దానికి తానే ప్రత్యక్ష సాక్షినంటూ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు.

బీజేపీ గెలుపుకోసం RSS దేశంలో వరుస బాంబు పేలుళ్ళకు పాల్పడింది‍... కోర్టులో RSS నాయకుడి అఫిడవిట్
X

దేశవ్యాప్తంగా జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆర్‌ఎస్‌ఎస్ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ మాజీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంగ్ (ఆర్‌ఎస్‌ఎస్) నాయకుడు యశ్వంత్ షిండే నాందేడ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎన్నికలలో బీజేపీని గెలిపించాలనే లక్ష్యంతో ఈ బాంబు పేలుళ్ళు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు.

బాంబు పేలుళ్ల శిక్షణకు తాను సాక్షినని యశ్వంత్ షిండే చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

యశ్వంత్ షిండే ఆగస్టు 30న నాందేడ్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు మీడియా రిపోర్ట్ చేసింది. భారతదేశం అంతటా ఆర్‌ఎస్‌ఎస్ బాంబులు పేల్చిందని షిండే తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. తాను ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌కు రాష్ట్ర, జాతీయ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశానని పేర్కొన్నారు.

అఫిడవిట్ ప్రకారం, షిండే, "1999లో, తాను మహారాష్ట్రలో ఉన్నప్పుడు, మిలిటెంట్ గా ఉన్న కొంతమంది యువతను జమ్మూకి తీసుకెళ్లి అక్కడ వారికి ఆధునిక ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇస్తానని ఇంద్రేష్ కుమార్ తనతో చెప్పాడు."

"ఈ శిక్షణకు వ్యక్తులను ఎంపిక చేయడం కోసం, థానే (మహారాష్ట్ర)లో VHP రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో, తనకు నాందేడ్‌కు చెందిన హిమాన్షు పన్సే పరిచయమయ్యాడు. ఆ సమయంలో హిమాన్షు పన్సే గోవాలో వీహెచ్‌పీకి పూర్తిస్థాయి కార్యకర్త. అతను, అతని 7 మంది స్నేహితులు బాంబు పేలుళ్ళ శిక్షణకు ఎంపికయ్యారు. హిమాన్షు, అతని ఏడుగురు స్నేహితులను, షిండేను జమ్మూకు తీసుకెళ్లాడు. అక్కడ వారు భారత ఆర్మీ జవాన్ల నుండి ఆధునిక ఆయుధాల శిక్షణ పొందారు, "అని అఫిడవిట్ లో షిండే తెలిపాడు.

ఆ తర్వాత 2003 జూలైలో తనకు దక్షిణ ముంబైలోని ఖేత్వాడి ప్రాంతంలోని గోల్ డ్యూల్ (రౌండ్ టెంపుల్) వద్ద ఒక ముఖ్యమైన సమావేశం గురించి సందేశం వచ్చింది. ఆ సమావేశానికి నేను వెళ్ళాను అని చెప్పారు షిండే.

"అక్కడ ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. వారు RSS సభ్యులు. VHP, మహారాష్ట్ర ప్రాంత్ నాయకుడు మిలింద్ పరాండే యొక్క సన్నిహిత సహచరులు. బాంబు తయారీలో శిక్షణా శిబిరాన్ని త్వరలో నిర్వహించబోతున్నామని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు పాల్పడే ప్లాన్ ఉందని ఈ ఇద్దరు వ్యక్తులు షిండేకు తెలియజేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అత్యధిక బాంబు పేలుళ్లకు పాల్పడాలని వారు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అది విని షిండే దిగ్భ్రాంతికి గురయ్యాడు, కానీ తన ముఖంలో ఆ భావం చూపించలేదు. ఇదంతా 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసమేనా అని వారిని అడిగాడు. వారు సమాధానం చెప్పలేదు."

తాను వారి ప్లాన్‌ను ఆమోదించనప్పటికీ, తన అసమ్మతిని బహిరంగంగా చూపించలేదని, పథకంలో పాల్గొన్న వ్యక్తులను గుర్తించడానికి అందులో భాగస్వామిగా నటించాలని నిర్ణయించుకున్నానని షిండే పేర్కొన్నాడు.

"ఇది సింహగడ్ కోట పాదాల వద్ద ఒక రిసార్ట్‌లో నిర్వహించబడిన మూడు రోజుల శిబిరం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జల్గావ్, నాందేడ్ తదితర జిల్లాల నుంచి దాదాపు 20 మంది యువకులు శిక్షణకు హాజరయ్యారు.'' అని షిండే పేర్కొన్నారు.

అఫిడవిట్‌లో యశ్వంత్ షిండే బాంబు పేలుళ్ల ప్రాజెక్టులో పాల్గొన్న పలువురు విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి), ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుల పేర్లను పేర్కొన్నారు.

ఇంద్రేష్ కుమార్, హిమాన్షు పన్సే, మిలింద్ పరాండే, రాకేష్ ధావాడే, రవి దేవ్ (మిథున్ చక్రవర్తి)లను ఈ కేసులో ప్రధాన కుట్రదారులుగా అఫిడవిట్ లో షిండే పేర్కొన్నారు. మిలింద్ పరాండే, రాకేష్ ధావద్ శిక్షణా శిబిరాలను నిర్వహించగా, బాంబు తయారీలో రవిదేవ్ శిక్షణ ఇచ్చారని షిండే చెప్పారు.

"మిథున్ చక్రవర్తి ప్రతిరోజు ఉదయం 10 గంటలకు శిబిరానికి చేరుకొని రెండు గంటల పాటు శిక్షణను నిర్వహించారని చెప్పారు. శిక్షణ పొందిన వారికి బాంబులు తయారు చేయడానికి 3-4 రకాల పేలుడు పౌడర్‌లు, పైపుల ముక్కలు, వైర్లు, బల్బులు, గడియారాలు వంటి మెటీరియల్‌లను అందించారు" అని షిండే పేర్కొన్నారు.

శిక్షణ పొందుతున్న వారిని రిమోట్ ఫారెస్ట్ లొకేషన్‌కు తీసుకెళ్లి బాంబులను ఉపయోగించి ప్రాక్టీస్ చేయించారు. టైమర్‌తో కూడిన బాంబును ట్రైనీలు తవ్విన చిన్న గొయ్యిలో ఉంచుతారు, పేలుడు పదార్థాన్ని పేల్చడానికి ముందు ఆ గొయ్యిని మట్టి, పెద్ద బండరాళ్లతో నింపుతారు తర్వాత దాన్ని పేల్చుతారు. వారి ప్రయోగాలు విజయవంతమయ్యాయి అని షిండే తన అఫిడవిట్ లో పేర్కొన్నారు.

బాంబు పేలుళ్ల కుట్రలో పాల్గొనకుండా హిమాన్షు పన్సేను ఒప్పించేందుకు తాను నాందేడ్‌కు పలుమార్లు వెళ్ళానని అయితే సీనియర్ నాయకుల ఒత్తిడి కారణంగానే పన్సే ఈ కుట్రను కొనసాగించారని ఆయన పేర్కొన్నారు.

శిక్షణ తర్వాత హిమాన్షు మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతంలో మూడు పేలుళ్లకు పాల్పడ్డాడు. అతను ఔరంగాబాద్‌లోని ప్రధాన మసీదులో పెద్ద పేలుడుకు ప్లాన్ చేసాడు. ఆ పేలుడు కోసం బాంబును తయారు చేస్తూ 2006లో నాందేడ్‌లో ప్రాణాలు కోల్పోయాడు.

మిలింద్ పరాండే దేశవ్యాప్త బాంబు దాడుల కుట్రకు సూత్రధారి అని షిండే తెలిపారు. ప్రస్తుతం మిలింద్ పరాండే వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.

అఫిడవిట్ ప్రకారం - షిండేను ఉద్దేశపూర్వకంగా RSS, BJP నాయకులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎంచుకున్నారు, ఎందుకంటే పరిస్థితులను బట్టి, అతను దేశవ్యాప్తంగా పేలుళ్లను నిర్వహించగలడని వారు విశ్వసించారు. మహారాష్ట్రలో "గర్జన", జమ్మూ-కశ్మీర్, పంజాబ్, హర్యానా, అస్సాం , యుపిలో "హిందూ యువ ఛత్ర పరిషత్", కర్ణాటకలో "శ్రీరామసేన" , పశ్చిమ బెంగాల్‌లో తపన్ ఘోష్ వంటి సీనియర్ నాయకులతో షిండే మాట్లాడారు. ఈ సమూహాలన్నీ 500-600 బాంబు పేలుళ్లను నిర్వహించాడానికి సిద్దంగా ఉన్నారు.

తాను మాత్రం హిందుత్వను నమ్ముతాను కానీ ఉగ్రవాద ధోరణులు లేని హిందూ మతాన్ని గొప్పగా భావిస్తానని షిండే అఫిడవిట్ లో తెలిపాడు.

తాను ఆరెస్సెస్ నాయకులు చేస్తున్న క్రూరమైన నేరాలలో భాగం కావాలని కోరుకోలేదని అతను పేర్కొన్నాడు. ఆర్‌ఎస్‌ఎస్‌లో తనకు మంచి సంబంధాలున్న వారిని కూడా బాంబు పేలుళ్లకు పాల్పడకుండా నిరుత్సాహపరిచినట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా ఎంతో మంది అమాయక హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల ప్రాణాలను కాపాడాన‌ని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

"దేశమంతటా పేలుళ్లకు కారణమయిన‌ ఆర్‌ఎస్‌ఎస్, విహెచ్‌పిల పథకం ఆశించినంత విజయవంతం కాకపోవడంతో బిజెపికి రాజకీయంగా ప్రయోజనం కలగలేదు. ఫలితంగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ప్రధాన కుట్రదారులైన మిలింద్ పరాండే వంటి వ్యక్తులు భయపడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు, కానీ వారు రహస్యంగా కుట్రలు పన్నుతూనే ఉన్నారు. వారు అండర్ గ్రౌండ్ లో ఉంటూ దేశవ్యాప్తంగా అనేక బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. హిందుత్వ పక్షపాతం కలిగిన‌ పోలీసులు, ఏకపక్ష మీడియా సహాయంతో ఆ కేసులన్నింటినీ ముస్లింలపై తోసేశారు. అది 2014 లోక్‌సభ ఎన్నికల్లో వారికి సహాయపడింది'' అని యశ్వంత్ షిండే అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

షిండే అఫిడవిట్ ప్రకారం, 2014లో కేంద్రంలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాగానే VHP, RSSకి చెందిన అన్నిఅండ‌ర్ గ్రౌండ్ విధ్వంసక శక్తులు అకస్మాత్తుగా క్రియాశీలమయ్యాయి.

2006 నాటి నాందేడ్ పేలుడు కేసులో పేర్కొన్న ముగ్గురు వ్యక్తులు ప్రధాన కుట్రదారులని అఫిడవిట్‌లో షిండే పేర్కొన్నాడు.వారిని చట్టం ముందు తీసుకురావాలని అభ్యర్థించాడు.

కాగా షిండే ఆరోపణలను వీహెచ్పీ ఖండించింది. నాందేడ్ కోర్టులో యశ్వంత్ షిండే అనే వ్యక్తి అలా‍ంటి అఫిడవిట్ దాఖలు చేశాడని తనకు తెలియదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ అన్నారు.

''దేశ వ్యతిరేక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఆర్‌ఎస్‌ఎస్ ఎప్పటికీ మద్దతివ్వదు, ఆర్‌ఎస్‌ఎస్ హిందూమతాన్ని విశ్వసిస్తుంది, దేశానికి వ్యతిరేకమైన దేనిలోనూ వారు పాల్గొనరు" అని బన్సాల్ అన్నారు.

మిలింద్ పరాండే ఒక గొప్ప‌ వ్యక్తి అని, అతను తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశాడని, పరండేను నిందించే ఎవరినైనా నమ్మరాదని ఆయన అన్నారు.

మరో వైపు షిండే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)పై విరుచుకపడింది.

యశ్వంత్ షిండే కోర్టులో దాఖలు చేసిన‌ అఫిడవిట్ 'సంఘ్ యొక్క దేశ వ్యతిరేక కార్యకలాపాల గురించి భయంకరమైన సమాచారాన్ని' వెల్లడిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు. దేశం మొత్తం బాంబులు వేయడానికి ఆరెస్సెస్ ఎలా కుట్ర పన్నిందో అఫిడవిట్ బహిర్గతం చేసిందని విమర్శించిన ఖేరా ఆరెస్సెస్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


First Published:  2 Sep 2022 10:28 AM GMT
Next Story