Telugu Global
National

ఎట్ట‌కేల‌కు త‌లొగ్గిన ఆర్ఎస్ఎస్ !

ప్రేమ ఉన్నా లేకపోయినా ఆరెస్సెస్ జాతీయ జెండాకు తలవంచాల్సి వచ్చింది. దేశభక్తి గురించి అందరికీ క్లాసులు చెప్పే సంఘ్ తన సోషల్ మీడియా అకౌంట్ల డీపీల్లో జాతీయ జెండాను పెట్టకపోవడంపై వచ్చిన విమర్షలకు తలొగ్గి ఎట్టకేలకు డీపీలు మార్చింది.

ఎట్ట‌కేల‌కు త‌లొగ్గిన ఆర్ఎస్ఎస్ !
X

దేశ వ్యాప్తంగా వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్ ) ఎట్ట‌కేల‌కు త‌లొగ్గింది. ఆగస్టు 15న భారత స్వాతంత్య్ర‌దినోత్స‌వ 75వ వేడుక‌ల సందర్భంగా తన ట్విట్టర్ ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకానికి మార్చింది. ప్ర‌ధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పిలుపునిచ్చిన 'హర్ ఘర్ తిరంగ' కార్యక్రమంలో చేరింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా తన ట్విట్టర్ డిస్ ప్లే ఫోటోను మార్చారు.

కేంద్రం 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమంలో భాగంగా విస్తృత ప్ర‌చారం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని త్రివర్ణ పతాకంతో తమ సోషల్ మీడియా ఖాతాలలో ప్రదర్శించాలని ప్రజలకు ప్రధాని మోడి విజ్ఞ‌ప్తి చేశారు. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఆర్ఎస్ఎస్ దానిని పాటించ‌లేదు. దీనిపై విప‌క్షాలు, ప్ర‌జ‌ల నుంచి కూడా పెద్ద ఎత్తున‌ విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వారం రోజులుగా ఎదుర‌వుతున్న విమ‌ర్శ‌ల నేప‌ధ్యంలో ఆర్ఎస్ఎస్ తన డీపీల‌ను మార్చ‌డం గ‌మ‌నార్హం.

''ఎవరి ఒత్తిడితోనూ మేం ఎలాంటి నిర్ణయం తీసుకోం. మా అధికారిక ట్విటర్ హ్యాండిల్ యొక్క డిస్‌ప్లే పిక్‌ని మార్చవలసి వస్తే, అది తగిన సమయంలో జ‌రుగుతుంది" అని సంఘ్ సీనియర్ కార్యకర్త ఒకరు విమ‌ర్శ‌ల‌పై గత వారం వ్యాఖ్యానించారు.

"సంఘ్ ఇప్పటికే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రచారానికి తన మద్దతును ప్రకటించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థల ద్వారా నిర్వ‌హించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని స్వయంసేవకులందరికీ విజ్ఞప్తి చేసింది. దీనిపై ఎవరూ రాజకీయాలు చేయవద్దని, మహోత్సవం జరుపుకోవడంపై దృష్టి పెట్టాల‌ని విజ్ఞ‌ప్తి చేశాం. " అని సంఘ్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు.

చారిత్ర‌కంగా చూసిన‌ప్పుడు ఆర్ఎస్ఎస్ త్రివర్ణ పతాకానికి బదులుగా కాషాయ‌ జెండాను ఎగురవేస్తుంది.

'హర్ ఘర్ తిరంగ' దీక్ష నేపథ్యంలో, ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో త్రివర్ణ పతాకం లేకపోవడం ప్రతిపక్ష నేతలనుంచి విమర్శలకు దారితీసింది. కాంగ్రెస్‌కు చెందిన పవన్ ఖేరా ,జైరాం రమేష్, తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, అధికార పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్ స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలో "ఇతరులకు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు " వాళ్ళు ఆచ‌రించాలి. లేక‌పోతే వాళ్ళది కపట దేశభక్తిగానే ఉంటుంద‌ని విరుచుకుపడటంతో మొత్తానికి ఆర్ఎస్ఎస్ మెత్త‌బ‌డ‌క త‌ప్ప‌లేదు.

First Published:  13 Aug 2022 10:55 AM GMT
Next Story