Telugu Global
National

ఎమ్మెల్యే బీజేపీలో చేరితే 20 కోట్లు, మరొకరిని చేర్పిస్తే 25 కోట్లు

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నద‌ని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. తమ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ నేతలు 20 కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చారని ఆప్ నేతలు మండిపడ్డారు.

ఎమ్మెల్యే బీజేపీలో చేరితే 20 కోట్లు, మరొకరిని చేర్పిస్తే 25 కోట్లు
X

భారతీయ జనతా పార్టీ తమ ప్రభుత్వాన్ని కూలదోయడానికి, పార్టీ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. కొందరు ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు సంప్రదించారని 20 కోట్లు తీసుకుంటారా లేక సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కుంటారా అని బెదిరిస్తున్నారని AAP జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.

ఢిల్లీ డిప్యూటీ సీఎం ను మహారాష్ట్రలో షిందే లాగా ఉపయోగించుకోవాలని ప్రణాళిక రచించిన బీజేపీ అది ఫెయిల్ అవడంతో ఇప్పుడు ఇతర ఎమ్మెల్యేలను సంప్రదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

"పార్టీలో చేరితే ఒక్కొక్కరికి 20 కోట్ల రూపాయలు, ఇతర ఎమ్మెల్యేలను తమ వెంట తీసుకువస్తే 25 కోట్ల రూపాయలు ఇస్తాం అని బీజేపీ నేతలు ఆఫర్ ఇచ్చారు'' అని సింగ్ చెప్పారు.

ఆప్ శాసనసభ్యులు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్‌లను భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు సంప్రదించారని సింగ్ చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సంజయ్ సింగ్ తో పాటు ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. తమను బీజేపీ నేతలు ఎలా సంప్రదించారో వివరించారు.

సిసోడియాపై ఉన్న కేసులు నకిలీవని తమకు తెలుసునని, అయితే ఆప్‌ని గద్దె దించాలని తమ‌ సీనియర్ నేతలు నిర్ణయించుకున్నారని, ఆప్ నేతలను చేర్చుకునే బాధ్యతను తమకు అప్పగించారని తమను కలిసిన బీజేపీ నేతలు వివరించారని ఎమ్మెల్యే సోమనాథ్ భారతి అన్నారు. ఏది ఏమైనా ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీజేపీ నేత ఒకరు నాతో అన్నారు.అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సవాల్ విసిరిన సంజయ్ సింగ్, "మీరు చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బెదిరించి పడగొట్టారు, కానీ ఇది ఢిల్లీ. ప్రజలు ఇక్కడ కేజ్రీవాల్‌ను మూడుసార్లు ఎన్నుకున్నారు. ఇక్కడ మీ కుట్రలు విజయవంతం కావు" అని అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్‌లో ఈ విషయంపై స్పందించారు. ఇది చాలా తీవ్రమైన విషయం . పరిస్థితిని సమీక్షించడానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) ఈ రోజు సాయంత్రం తన నివాసంలో సమావేశమై వ్యూహాన్ని రూపొందిస్తుంది అని చెప్పారు.

ఆప్ ఎమ్మెల్యేలు కేజ్రీవాల్, భగత్ సింగ్ అనుచరులు, సైనికులు. వాళ్ళు ప్రాణాలైనా ఇస్తారు కానీ పార్టీకి ద్రోహం చేయరు అని డిప్యూటీ సీఎం సీసోడియా అన్నారు.

First Published:  24 Aug 2022 10:59 AM GMT
Next Story