Telugu Global
National

RRR నాటు.. మోదీకి తగిలిన ఘాటు

ఈ ఏడాది ఆస్కార్ కి భారత అధికారిక ఎంట్రీ “ఛెల్లో షో”. ఈ సినిమా ఎంపికలో కూడా బీజేపీ తన గుజరాత్ ఫార్ములాని, స్వార్థపూరిత బుద్ధిని చూపెట్టుకుందని విమర్శించారు నెటిజన్లు.

RRR నాటు.. మోదీకి తగిలిన ఘాటు
X

RRR కి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ వచ్చింది. కానీ ఆ సినిమా భారతీయ అఫిషియల్ ఎంట్రీ కాదు. భారత్ తరపున RRR ని కేంద్ర బృందం నామినేట్ చేయలేదు. అయినా రాజమౌళి సొంతగా ఆస్కార్ కి దరఖాస్తు చేసుకున్నారు. అకాడమీ అవార్డ్ సాధించారు. ఈ విజయంలో కేంద్రం సపోర్ట్ ఏమీ లేదు. కానీ కేంద్రంలోని పెద్దలు ఇస్తున్న బిల్డప్ చూస్తుంటే మాత్రం RRRని వీళ్లే సపోర్ట్ చేశారా అనేంతలా ఉంది. ఇదే విషయంపై నెటిజన్లు మండిపడుతున్నారు. RRR క్రెడిట్ ని కేంద్రం తన ఖాతాలో వేసుకుంటోందని వెటకారం చేస్తున్నారు.

ఇక్కడా గుజరాత్ లాబీయింగేనా..?

ఈ ఏడాది ఆస్కార్ కి భారత అధికారిక ఎంట్రీ “ఛెల్లో షో”. ఈ సినిమా ఎంపికలో కూడా బీజేపీ తన గుజరాత్ ఫార్ములాని, స్వార్థపూరిత బుద్ధిని చూపెట్టుకుందని విమర్శించారు తెలంగాణ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి. RRR వంటి అద్భుతమైన సినిమాని కనీసం ఆస్కార్‌ కి నామినేట్ చేయాలనే సోయి కూడా కేంద్రంలోని బీజేపీ సర్కారుకు లేకుండా పోయిందన్నారు. RRR సినిమా టీం స్వయంగా ఆస్కార్ కి అప్లికేషన్ పెట్టుకుని పోటీలో పాల్గొన్నదని, భారత ప్రభుత్వం నామినేట్ చేసి ఉంటే అది మరింత గౌరవప్రదంగా ఉండేదని అన్నారు. తెలుగుజాతికి, తెలుగు సినిమాకి మరింత గౌరవం వచ్చి ఉండేదని చెప్పారు. కానీ సినిమా అవార్డుల విషయంలోనూ బీజేపీ స్వార్థపూరితంగా కక్షపూరితంగా వ్యవహరించిందని విమర్శించారు. ఇది బీజేపీ దిగజారుడుతనానికి నిదర్శనం అని అన్నారాయన.


అప్పుడు బెదిరింపులు, ఇప్పుడు సంబరాలు..

RRR సినిమా విడుదల సమయంలో బండి సంజయ్‌ తో పాటు కొందరు బీజేపీ నేతలు రచ్చ రచ్చ చేశారు. ఎన్టీఆర్ గెటప్ గురించి గొడవ చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టాలని చూశారు. సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లను తగలబెడతామంటూ స్వయంగా బండి సంజయ్ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు కూడా. కట్ చేస్తే RRR ఘన విజయం తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో హీరో జూనియర్ ఎన్టీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అప్పట్లోనే బండి వ్యవహారం చర్చకు వచ్చింది. సినిమా విడుదలకు ముందు బండి బెదిరించారు, విడుదలయ్యాక అమిత్ షా ప్రత్యేక విందు ఇచ్చారంటూ సెటైర్లు పేలాయి. ఆనాడు బండి మాటలకు భయపడి ఉంటే నేడు తెలుగు సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ సాధించేదా..? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. బెదిరించేది వాళ్లే.. అవార్డు రాగానే సంబరాలు చేసేది వాళ్లే.. బీజేపీది ద్వంద్వ నీతి అంటూ మండిపడ్డారు.

First Published:  13 March 2023 8:46 AM GMT
Next Story