Telugu Global
National

మీ సింహాన్ని చంపేశాం.. తీసుకెళ్లండి.. మృతదేహాన్ని ఇంటికే తెచ్చిన ప్రత్యర్థులు

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, పాత కక్షల కారణంగానే హర్ దీప్‌ని ప్రత్యర్థులు హత్య చేశారని ఎస్పీ రాజ్ పాల్ సింగ్ సంధు తెలిపారు.

మీ సింహాన్ని చంపేశాం.. తీసుకెళ్లండి.. మృతదేహాన్ని ఇంటికే తెచ్చిన ప్రత్యర్థులు
X

నేరాల నియంత్రణకు పోలీసు శాఖ, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వాటి సంఖ్య తగ్గడం లేదు. కారణం చట్టాల్లోని లొసుగులను దుండగులు తమకు అనుకూలంగా వినియోగించుకోవడమే. ఏ తప్పు చేసినా బయటపడతాం.. అనే ధీమాతోనే కొందరు బరి తెగించి నేరాలకు పాల్పడుతున్నారు. నేరానికి పాల్పడింది మేమే.. ఏం చేసుకుంటారో చేసుకోండి..అన్నట్లుగా దుండగులు ప్రవర్తిస్తున్నారు.

తాజాగా చండీగఢ్ రాష్ట్రంలో ఓ హత్య జరిగింది. యువకుడిని చంపిన దుండగులు మృతదేహాన్ని తీసుకొని అతడి ఇంటి వద్దకే వచ్చారు. పైగా అతడి తల్లిదండ్రులతో వెకిలిగా మాట్లాడారు. ఈ సంఘటన ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది.

కపుర్తలా ప్రాంతానికి చెందిన హర్ దీప్ సింగ్ అనే 22 ఏళ్ల యువకుడికి అదే ప్రాంతానికి చెందిన హర్ ప్రీత్ సింగ్‌తో వివాదాలు ఉన్నాయి. ఈ గొడవలకు సంబంధించి హర్ దీప్‌పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. దీంతో తనను అరెస్టు చేస్తారన్న భయంతో హర్ దీప్ వేరే ఊర్లో ఉంటున్నాడు.

కాగా ఇటీవల అతడు బ్యాంకు పని ఉండడంతో సొంతూరికి వచ్చాడు. పని నిమిత్తం బయటకు వెళ్లిన హర్ దీప్ ఇంటికి తిరిగి రాలేదు. అర్ధరాత్రి ఆరుగురు దుండగులు హర్ దీప్ ఇంటి వద్దకు వచ్చారు. హర్ దీప్‌ని చంపేశాం అంటూ.. వారు కేకలు పెట్టారు. దీంతో ఏం జరిగిందో అని అతడి తల్లిదండ్రులు బయటకు వచ్చి చూడగా.. తమ కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండటం కనిపించింది.

అప్పటికి కూడా ఆ దుండగులు అక్కడి నుంచి వెళ్లలేదు. మీ కొడుకు సింహం అన్నారు.. ఇప్పుడు తీసుకువెళ్లండి మీ సింహాన్ని.. అంటూ వెకిలి చేష్టలు చేశారు. రక్తపు మడుగులో ఉన్న హర్ దీప్‌ని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హర్ దీప్ తండ్రి గుర్ నామ్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా, పాత కక్షల కారణంగానే హర్ దీప్‌ని ప్రత్యర్థులు హత్య చేశారని ఎస్పీ రాజ్ పాల్ సింగ్ సంధు తెలిపారు.


First Published:  23 Sep 2023 9:23 AM GMT
Next Story