Telugu Global
National

భారత్ లో బియ్యం కొరత.. రాబోయే రోజుల్లో మహా సంక్షోభం..

భారత్ లో కూడా బియ్యం కొరత ఏర్పడే దుర్భర పరిస్థితులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల వర్షాభావంతో 13శాతం వరిసాగు తగ్గిపోవడం దీనికి కారణం.

భారత్ లో బియ్యం కొరత.. రాబోయే రోజుల్లో మహా సంక్షోభం..
X

ప్రపంచ వ్యాప్తంగా వరిధాన్యం ఉత్పత్తిలో భారత్ వాటా 40 శాతం. ఆసియాలోనే అతిపెద్ద ఎగుమతిదారు భారత్. ప్రపంచంలోని 100 దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతి అవుతాయి. కానీ ఇప్పుడు ఆ ఎగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. అక్కడితో ఆగితే పర్వాలేదు. భారత్ లో కూడా బియ్యం కొరత ఏర్పడే దుర్భర పరిస్థితులు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఇటీవల వర్షాభావంతో 13శాతం వరిసాగు తగ్గిపోవడం దీనికి కారణం. ఇప్పటికే గోధుమలు, చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడంతో వాటి ఎగుమతులు ఆగిపోయాయి. ఈ లిస్ట్ లోకి బియ్యం కూడా చేరే ప్రమాదం ఉంది.

ఎగుమతులపై తీవ్ర ప్రభావం..

వర్షాలు లేకపోవడం వల్ల భారత్ లో వరి పండించే విస్తీర్ణంలో దాదాపు నాలుగోవంతు కోతపడింది. ఈమేరకు దిగుబడి తగ్గిపోతుంది. పశ్చిమబెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. మూడేళ్లపాటు వరుసగా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా నిత్యావసరాల రేట్లు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రభావం ప్రతి ఒక్కరిపై పడుతోంది. దీంతోపాటు ఇప్పుడు బియ్యం దిగుబడి కూడా తగ్గిపోతే ప్రజల కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఎదురవుతుంది. ఎగుమతులు తగ్గిపోతే వ్యాపార వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి.

ముందు భారత్ లో అవసరాలు తీర్చుకోవాలి కాబట్టి, ఎగుమతులపై నిషేధం విధించడం తేలికైన పనే. కానీ దాని ప్రభావం సుదీర్ఘకాలం వెంటాడుతుంది. ఎగుమతులు తిరిగి ప్రారంభించాలన్నా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముందస్తుగా చేసుకున్న కాంట్రాక్ట్ లు రద్దు చేసుకుంటే, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల విషయంలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. దీంతో ఆచితూచి అడుగేయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఎగుమతులపై నిషేధం విధించకపోతే.. దేశీయంగా ధాన్యం ధరలు భారీగా పెరుగుతాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగి ప్రభుత్వం సామాన్యులతో చీవాట్లు తింటోంది. ఇప్పుడు బియ్యం ధర పెరిగితే ప్రభుత్వానికి మరింత చెడ్డపేరొస్తుంది. ఈ సంకట పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని కేంద్రం ఆలోచిస్తోంది.

ఇప్పటికే దేశీయంగా బియ్యం ధరలు రెండు వారాల్లో 10శాతం పెరిగాయి, రాబోయే రోజుల్లో ధ‌ర‌లు మరింతగా పెరుగుతాయ‌ని అంచనాలున్నాయి. వర్షాభావ పరిస్థితులకు తోడు.. ఇటీవల ఇంధన ధరలను తగ్గించే విషయంలో ఇథనాల్ ఉత్పత్తికి చక్కెరతోపాటు బియ్యాన్ని కూడా వాడుతున్నారు. దీంతో కొరత మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇథనాల్ ఉత్పత్తికి బియ్యాన్ని కేటాయించడం సరికాదని నిపుణుల అభిప్రాయం. మరి కేంద్రం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

పంతానికి పోయి..

ఆ మధ్య తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లకు ససేమిరా అంది కేంద్రం. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే రైతుల వద్ద మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసింది. కేంద్రం మొండిచేయి చూపడం.. ధాన్యం పండించే విస్తీర్ణంపై ప్రభావాన్ని చూపింది. ఇప్పటికీ ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఇలా పంతాలకు పోయి సమస్యను జఠిలం చేసుకుంటోంది కేంద్రం. అంతిమంగా ఆ ప్రభావం ప్రజలపై పడుతోంది.

First Published:  3 Aug 2022 3:53 PM GMT
Next Story