Telugu Global
National

డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రధాని, అదాని..

రాబోయే 100 రోజులు దేశం కోసం పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి.. దేశాన్ని కాపాడుకుందామని చెప్పారు.

డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ప్రధాని, అదాని..
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. రాష్ట్రాల్లో కూడా అధికారాన్నిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ తో అభివృద్ధి రెట్టింపవుతుందనేది ఆ పార్టీ నేతల వాదన. అయితే ఆ డబుల్ ఇంజన్ తో అభివృద్ధి జరగదని, అవినీతి రెట్టింపవుతుందని అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. డబుల్ ఇంజన్ అంటే అదాని, ప్రధాని అని ఎద్దేవా చేశారు. ఆల్రడీ అదాని అనే ఇంజన్ షెడ్డుకు పోయిందని, 2024 ఎన్నికల తర్వాత ప్రధాని ఇంజన్ కూడా షెడ్డుకు పోతుందని కౌంటర్ ఇచ్చారు. నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడ్డారు.


ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోదీని కలసి వచ్చిన రోజుల వ్యవధిలోనే ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మోదీ అనే మెడిసిన్ కు ఎక్స్ పయిరీ డేట్ దగ్గరపడిందన్నారు. ప్రతి మెడిసిన్ కు ఒక ఎక్స్ పయిరీ డేట్ ఉంటుందని, అలాగే మోదీకి కూడా ఉందని, ఆ డేట్ దగ్గరపడిందన్నారు. రాబోయే రోజుల్లో మోదీ అనే మెడిసిన్ దేశంలో పనిచేయదన్నారు. లోక్ సభలో రాహుల్ గొంతు విప్పడంతో అదానీ ఇంజన్ ఆగిపోయిందని, షెడ్ కు పోయిందని, ఇప్పుడు రాహుల్ గాంధీ చేపట్టే 'భారత్ న్యాయ యాత్ర' తో ప్రధాని ఇంజన్ ఆగిపోవడం ఖాయమన్నారు. ఆ ఇంజన్ ని కూడా షెడ్డుకు పంపిస్తామని చెప్పారు.

100రోజులు దేశం కోసం..

రాబోయే 100 రోజులు దేశం కోసం పనిచేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చి.. దేశాన్ని కాపాడుకుందామని చెప్పారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో కర్నాటక, తెలంగాణలో పార్టీ విజయం సాధించిందని.. ఈసారి రాహుల్ చేపడుతున్న 'భారత్ న్యాయ యాత్ర'తో మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ దే అధికారం అని చెప్పారు. ఎర్రకోటపై కాంగ్రెస్ మూడు రంగుల జెండా ఎగరడం ఖాయమన్నారు. దీన్ని మోదీ కూడా ఆపలేరని చెప్పారు రేవంత్ రెడ్డి.

First Published:  29 Dec 2023 3:43 AM GMT
Next Story