Telugu Global
National

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. - రిటైర్డ్ పోలీస్​ అధికారిపై కాల్పులు

షీరీ బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి అయిన మహ్మద్ షఫీ మసీదులో ప్రార్థనలు చేస్తుండగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు.

రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. - రిటైర్డ్ పోలీస్​ అధికారిపై కాల్పులు
X

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లా రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మ‌ద్ షఫీని కాల్చిచంపారు. పోలీసు అధికారి ఆదివారం మసీదులో ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

షీరీ బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి అయిన మహ్మద్ షఫీ మసీదులో ప్రార్థనలు చేస్తుండగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయప‌డిన షఫీ అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనపై కశ్మీర్ జోన్ పోలీసులు సామాజిక మాధ్యమం ట్విట్ట‌ర్ (ఎక్స్)లో పోస్టు చేశారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నారు. జమ్మూకశ్మీర్ పోలీస్ శాఖలో మాజీ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా షఫీ పనిచేసినట్టు గుర్తించారు. పోలీసు అధికారిని తామే కాల్చిచంపినట్టు ఇంతవరకూ ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించలేదు.

గత నెలలో శ్రీనగర్‌లోని ఈద్గా మైదానంలో ఇన్‌స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ వానీ స్థానిక యువకులతో క్రికెట్ ఆడుతుండగా ఉగ్రవాదులు దాడి చేశారు. అతడిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇటీవల కాలంలో జమ్ము కాశ్మీర్ లో పోలీసులపై వరుస దాడులు జరుగుతున్నాయి. రాజోరి సెక్టార్‌లో ఎల్‌ఓసి వెంబడి ఉగ్రవాదులు గత గురువారం నాడు జరిపిన దాడిలో నలుగురు సైనికులు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుల్వామాతో పాటు జమ్మూకశ్మీర్‌లోని ఇతర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. శ్రీనగర్‌లోని అన్ని ప్రధాన కూడళ్లలో పాటు ఎగ్జిట్‌ పాయింట్ల వద్ద మొబైల్ వాహన తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

First Published:  24 Dec 2023 6:58 AM GMT
Next Story