Telugu Global
National

ఎన్నికలవేళ రిజర్వేషన్లతో పొలిటికల్ గేమ్

ముస్లింలను OBC జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్‌ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది.

ఎన్నికలవేళ రిజర్వేషన్లతో పొలిటికల్ గేమ్
X

కమీషన్ రాజ్ అనే అపవాదు మూటగట్టుకున్న కర్నాటక బీజేపీ ప్రభుత్వం, అసెంబ్లీ ఎన్నికల వేళ రిజర్వేషన్ల పొలిటికల్ గేమ్ మొదలు పెట్టింది. మైనార్టీల ఓట్లు తమకు పడవనే అనుమానంతో వారి రిజర్వేషన్లు తొలగించి ఒక్కలిగలు, లింగాయత్ లకు సమానంగా పంచింది. ఈ వివాదం ఇప్పుడు కర్నాటకను ఊపేస్తోంది. తాము అధికారంలోకి వస్తే ఆ 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయిస్తామని చెబుతున్న కాంగ్రెస్.. ఒక్కలిగలు, లింగాయత్ ల ఓట్లు తమకు పడవేమోననే అనుమానంతో భయపడుతోంది.

ముస్లింలకు OBC కోటాలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది. వాటిని ఏకపక్షంగా తొలగించింది బీజేపీ ప్రభుత్వం. EWS కోటాలో ముస్లింలకు 10శాతం రిజర్వేషన్ ఉందనే సాకుతో OBC జాబితాలోని 2B కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించింది. ఆ 4 శాతం రిజర్వేషన్లను లింగాయత్ లకు 2 శాతం, ఒక్కలిగలకు 2 శాతం కేటాయించింది. దీంతో అక్కడ మెజార్టీ ఓటర్లుగా ఉన్న లింగాయత్ లు, ఒక్కలిగలు బీజేపీకి మరింత దగ్గరవుతున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఆ రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతున్నా కూడా ఆ రెండు వర్గాల ఓట్లు తమకు దూరమవుతాయని భయపడుతోంది.

ముస్లింలను OBC జాబితా నుంచి ఏ ప్రాతిపదికన తొలిగించారంటూ కాంగ్రెస్‌ మండిపడింది. ఇది మతాల మధ్య మంటలు రాజేసే యత్నమంటూ దుయ్యబట్టింది. ముస్లింల 4 శాతాన్ని తమకు పంచడంపై లింగాయత్‌ లు, ఒక్కలిగలు కూడా సంతోషంగా లేరని చెప్పుకొచ్చింది. మరోవైపు ఎస్సీ రిజర్వేషన్లను 4 భాగాలు చేసింది. దీంతో కర్నాటకలో ఎస్సీ రిజర్వేషన్లలో తమకు అన్యాం జరిగిందంటూ బంజారాలు, ఆదివాసీలు ఆందోళనకు దిగారు.

మొత్తమ్మీద ఎన్నికల వేళ కర్నాటకలో రిజర్వేషన్ల రాజకీయం రాజుకుంది. ఈ మంటల్ని ఎగదోసి పబ్బం గడుపుకోవాలని చూస్తోంది బీజేపీ. అవినీతి సర్కారు అనే ముద్ర నుంచి దూరం జరగాలనే ప్రయత్నాల్లో ఉంది. అది ఎంతవరకు సాధ్యపడుతుందో చూడాలి.

First Published:  29 March 2023 6:45 AM GMT
Next Story