Telugu Global
National

ఆ 'సంస్కారీ రేపిస్టులు' నిజంగానే 'మంచి ప్రవర్తన' కలిగి ఉన్నారా ? అసలు నిజాలేంటి ?

బిల్కిస్ బానో అత్యాచారం కేసులోని 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం 'మంచి ప్రవర్తన' కారణం గా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ 'మంచి ప్రవర్తన' అంతా డొల్లేనని, వారు పెరోల్ మీద ఉన్నప్పుడు చేసిన చట్ట విరుద్ద కార్యాలను బైటపెడుతున్నాయి పలునివేదికలు.

ఆ సంస్కారీ రేపిస్టులు నిజంగానే మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా ? అసలు నిజాలేంటి ?
X

బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసి, 14 మందిని హత్య చేసిన కేసులో దోషులుగా ఉన్న 11 మందిని వారి "మంచి ప్రవర్తన" కారణంగా విడుదల చేసినట్లు గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. అయితే వాళ్ళలో ఒకరు పెరోల్ పై ఉన్నప్పుడు ఓ మహిళను లైంగికంగా వేధించాడు. దానిపై కేసు కూడా నమోదయ్యింది. మిగతా అందరూ పెరోల్ నింబందనలను అతిక్రమించారు.

కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆగస్టు 15న విడుదలైన వారు విడుదలకు ముందు దాదాపు 1,000 రోజులు పెరోల్ పై జైలు వెలుపల గడిపారని కూడా నివేదికలు తెలిపాయి.

'లైవ్ లా' ప్రకారం, ఈ కేసులో 11 మంది దోషులలో ఒకరైన మితేష్ చిమన్‌లాల్ భట్, పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఒక మహిళ పై లైంగిక‌ వేధింపులకు పాలడ్డాడు. అతనిపై జూన్ 2020లో భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 354 , 504, 506 (2) కింద కేసు నమోదు చేయబడింది.ఈ కేసు ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉందని నివేదిక పేర్కొంది.

మరో తొమ్మిది మంది ఖైదీలకు పెరోల్ మంజూరైన తర్వాత చాలా సార్లు ఆలస్యంగా లొంగిపోయారు. ఈ ఉల్లంఘనలకు వారిని జైలు అధికారులు హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో శిక్షలు కూడా విధించారు.. దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ సమాచారం మొత్తం ఉంది.

'మంచి ప్రవర్తన'

"మంచి ప్రవర్తన" వల్ల‌ ఆగస్టు 15న సామూహిక అత్యాచారం కేసులో దోషులు విడుదలయ్యే ముందు, వారిలో 10 మంది ఒక్కొక్కరు 1,000 రోజులకు పైగా జైలు వెలుపల ఉన్నారు (పెరోల్, ఫర్‌లో, తాత్కాలిక బెయిల్‌పై )అని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకంగా నివేదించింది.

(పెరోల్ మరియు ఫర్ లో రెండూ షరతులతో కూడిన విడుదలకు సంబంధించినవి. స్వల్పకాలిక నిర్బంధం ఉన్నవారికి పెరోల్ ఇవ్వబడుతుంది, అయితే దీర్ఘకాలిక నిర్బంధం ఉన్నవారికి ఫర్లాఫ్ అనుమతించబడుతుంది.)

రమేశ్ చందన (58) అత్యధిక రోజులు జైలు వెలుపల ఉన్నారని గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ను ఉటంకిస్తూ వార్తాపత్రిక నివేదించింది. అతను 1,576 రోజులు (నాలుగు సంవత్సరాలకు పైగా) బయట ఉన్నాడు (1,198 రోజుల పెరోల్, 378 రోజుల ఫర్లోతో సహా).

అతను తిరిగి లొంగిపోవడానికి 122 రోజులు ఆలస్యం చేశాడు. దీంతో అతని 14-రోజుల ఫర్లోను జనవరి, జూన్ 2015 మధ్య 136 రోజుల పాటు పొడిగించారని దినపత్రిక నివేదించింది. వాస్తవానికి, అతను 11 సార్లు ఫర్‌లో లీవ్‌ను పొందగా, అతను మూడుసార్లు ఆలస్యంగా లొంగిపోయాడని మరొక నివేదిక తెలిపింది.

ఆలస్యంగా లొంగిపోయినందుకు అతనిపై 2015లో జైలు చట్టం 51 (ఎ), 51 (బి) కింద కేసు కూడా నమోదైంది.

గుజరాత్ ప్రభుత్వ అఫిడవిట్ లో 11 మంది దోషులు సగటున 1,176 రోజుల సెలవులు - ఫర్‌లో, పెరోల్, తాత్కాలిక బెయిల్ పొందారని నివేదిక పేర్కొంది.

వారిలో ఒకరైన బకాభాయ్ వహోనియా (57) మాత్రమే అతి తక్కువ రోజులు మొత్తం 998 రోజులు జైలు బయట ఉన్నారు.

మరో దోషి, రాజుభాయ్ సోని (58) ఆలస్యంగా లొంగిపోయారు, దీనితో 90 రోజుల పెరోల్ 2013 సెప్టెంబర్ , 2014 జూలై మధ్య 287 రోజుల సెలవుగా మారింది. మొత్తంగా, అతను 1,348 రోజులు జైలు నుండి బయట ఉన్నాడు.

11 మందిలో పెద్దవాడైన జస్వంత్ నాయ్ (65) 2015లో నాసిక్ జైలులో 75 రోజులు ఆలస్యంగా లొంగిపోవడంతో మొత్తం 1,169 రోజులు జైలు బయట ఉన్నారని నివేదిక పేర్కొంది.

ముఖ్యంగా,చట్ట ప్రకారం వీరి విడుదలకు సంబంధించి బానో, ఆమెకుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కోరాలి. అయితే దాహోద్ పోలీసు సూపరింటెండెంట్ హితేష్ జోయ్సర్, ఒకే ఒక దోషి రాధేశ్యామ్ షాను ముందస్తుగా విడుదల చేయడంపై మాత్రమే బానో, ఆమె కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కోరారు. "అతన్ని ముందస్తుగా విడుదల చేయకూడదని" వారు ఖచ్చితంగా చెప్పారు.స్టేషన్ డైరీలో వారి అభిప్రాయాన్ని నమోదు కూడా చేశారు.

మరో 10 మంది విషయంలో, బానో కుటుంబం నుండి ఎలాంటి అభిప్రాయాన్ని కోరలేదని నివేదిక పేర్కొంది.

ఈ కేసులో 11 మంది దోషుల విడుదలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై నవంబర్ 29న సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

దీన్ని బట్టి మంచి ప్రవర్తన వల్లనే ఆ 11 మంది రేపిస్టులను విడుదల చేశామన్న గుజరాత్ ప్రభుత్వ వాదనలోని డొల్లతనం బైటపడుతుంది. ఈ విడుదల కు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వపు అవకాశ‌వాదం కూడా బహిర్గతమవుతున్నది.

First Published:  20 Oct 2022 2:52 AM GMT
Next Story