Telugu Global
National

హిందువులకన్నా ముస్లిం జనాభా పెరిగిపోతున్నదన్న‌ భగవత్ మాటల్లో నిజమెంత? డేటా ఏం చెప్తోంది?

జనాభా నియంత్రణ చట్టం అందరికి సమానంగా వర్తించక‌ పోవడం వల్ల భారత్ లో మత ఆధారిత అసమతుల్యత ఏర్పడిందని ఆరెస్సెస్ ఛీగ్ మోహన్ భగవత్ చెప్పిన మాటల్లో నిజముందా ? అసలు నిజాలేంటి ? డేటా ఏం చెప్తోంది ?

హిందువులకన్నా ముస్లిం జనాభా పెరిగిపోతున్నదన్న‌ భగవత్ మాటల్లో నిజమెంత? డేటా ఏం చెప్తోంది?
X

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్, మోహన్ భగవత్ తన వార్షిక దసరా ప్రసంగంలో, అక్టోబర్ 5, బుధవారం, జనాభా నియంత్రణ చట్టం అందరికి సమానంగా వర్తించాలని ఇప్పుడున్న పరిస్థితి వల్ల‌ ఒక మతం జనాభా విపరీతంగా పెరిగిపోతుందని, మరొక మతం జనాభా క్షీణిస్తోందని దీనివల్ల మత ఆధారిత అసమతుల్యత ఏర్పడుతుందని, బలవంతపు మత మార్పిడుల వల్ల కూడా ఇది జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన పరోక్షంగా చెప్పినా ముస్లింల జనాభా పెరిగిపోతోందని, హిందువుల జనాభా తగ్గుతోందని ఆయన అసలు ఉద్దేశం.

ఇదే విష‌యాన్ని ఆయన మరింత వివరిస్తూ ఒక మతం జనాభా విచ్చల విడిగా పెరగడం వల్ల తూర్పు తైమూర్, కొసావో, దక్షిణ సూడాన్ వంటి మత సమాజ కొత్త దేశాలు ఏర్పడ్డాయన్నారాయన.

ఇలా ఒకే మతం జనాభా పెరిగి, మరో మతం జనాభా తగ్గడం వనరుల పంపకం విషయంలో ఒకరికి భారం అవుతుందన్నారాయన‌.

ఇదంతా ఆయన ముస్లింలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటలు. ఆరెస్సెస్ కానీ, బీజేపీ కానీ చాలా కాలంగా ఈ సిద్దాంతాన్ని ప్రచారం చేస్తున్నాయి. దేశంలో ఇప్పుడు పెరుగుతున్న మత ఆధార జనాభా పెరుగుదల కారణంగా కొన్ని ఏళ్ళ తర్వాత హిందువుల జనాభా కన్నా ముస్లింల జనాభా ఎక్కువవుతుందని ఆరెస్సెస్ ప్రచారం చేస్తోంది.

అసలు మోహన్ భగవత్ కానీ, ఆరెస్సెస్, బీజేపీలు కానీ చేస్తున్న ప్రచారంలో నిజముందా ? దేశంలో కొన్నేళ్ళుగా ప్రభుత్వమే సేకరిస్తున్న డేటా ఏం చెప్తోంది ? ఆచరణలో ఏం జరుగుతున్నదో తెలుసుకోకుండా మన మెదడులో పుట్టిన ఓ సిద్దాంతాన్ని ప్రతిపాదించడం సరైనదేనా ? ఒక సారి అసలు వాస్తవాలేంటో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ చెక్ చేద్దాం.

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) ప్రకారం యావరేజ్ గా ఒక హిందూ ఒక మహిళకు 1.94 పిల్లలు, ఒక ముస్లిం మహిళకు 2.36 పిల్లలు ఉన్నారు.సంతానోత్పత్తి మధ్య వ్యత్యాసం కేవలం 0.42 మంది పిల్లలు మాత్రమే. 1992లో హిందూ మహిళల కంటే ముస్లిం మహిళలు సగటున 1.1 మంది పిల్లలను ఎక్కువగా కలిగి ఉన్నారని అంచనా వేసిన పరిస్థితితో పోలిస్తే ఇది చాలా తక్కువ‌.

మనంఇంకా లోతుల్లోకి వెళ్తే వాస్తవ పరిస్థితి మరింత స్పష్టంగా బయటపడుతుంది. గత రెండు దశాబ్దాల్లో, ముస్లింల సంతానోత్పత్తి 35%, హిందూ సంతానోత్పత్తి 30% తగ్గిందని డేటా చెప్తోంది. నిజానికి గత 20 ఏళ్లలో హిందువుల కంటే ముస్లింలలోనే జనాభా తగ్గుదల రేటు ఎక్కువగా ఉంది. బహుశా 2030 నాటికి హిందూ-ముస్లిం సంతానోత్పత్తి రేటు ఒకే స్థాయికి వస్తాయని ఈ డేటా నిర్ధారిస్తుంది.

ప్యూ రీసెర్చ్ సెంటర్ 2021 నివేదిక కూడా ఈ ఫలితాలను రుజువు చేస్తుంది. ముస్లింలలో సంతానోత్పత్తి రేటు ఇప్పుడు దాదాపు హిందువులతో సమానంగా ఉంది. 1992 , 2015 మధ్యకాలంలో, ముస్లిం సంతానోత్పత్తి రేటు 4.4 నుండి 2.6కి క్షీణించగా, హిందువుల సంఖ్య 3.3 నుండి 2.1కి పడిపోయిందని నివేదిక పేర్కొంది.

గతంలో ది వైర్ నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ S.Y. ఖురేషీ... 'ది పాపులేషన్ మిత్: ఇస్లాం, ఫ్యామిలీ ప్లానింగ్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఇండియా' అనే పుస్తకాన్ని ఇచ్చేందుకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భగవత్‌తో తాను కలిసిన సమావేశం గురించి చెప్పారు. ముస్లింలు సంఖ్యాపరంగా హిందువులను అధిగమిస్తారనేది హిందుత్వ గ్రూపుల శుద్ధ అబద్దపు ప్రచారం అని తాను ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌తో చెప్పానని ఖురేషీ చెప్పారు.

"1,000 సంవత్సరాలలో కూడా ఇది జరగదు. బహుభార్యాత్వం గురించిన ప్రశ్న [హిందువుల కంటే ముస్లింల అధిక జనాభా పెరుగుదల రేటు గురించి తరచుగా వాదించడానికి ముస్లింల బహుభార్యాత్వం గురించి లేవనెత్తుతారు] భారతదేశంలో తలెత్తదు. భారతదేశంలో 1,000 మంది పురుషులు ఉంటే 940 మంది స్త్రీలు ఉన్నారు. అసలు భార్యలే దొరక‌క‌ 60 మంది బ్రహ్మచారులు కష్టపడుతున్నారని నేను అతనికి చెప్పాను. మరి, బహుభార్యత్వం అనే ప్రశ్న ఎక్కడ అని అడిగాను. దీనికి, అతను హృదయపూర్వకమైన నవ్వుతో ప్రతిస్పందించాడు… దీని అర్థం, నేను చెప్పిన దాన్ని అతను వ్యతిరేకించలేదు తన నవ్వుతో అంగీకరించారు. "అని ఖురైషి వివరించారు.

ఈ సంభాషణ తర్వాత కూడా మోహన్ భగవత్ అక్టోబర్ 5న ఇటువంటి ఉపన్యాసం ఇచ్చారంటే ఖురైషీ ఇచ్చిన పుస్తకాన్ని చదవడానికి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌కి సమయం దొరకడం లేదని తెలుస్తోంది.

మరోవైపు, చాలా మంది తరచుగా లేవనెత్తే "జనాభా విస్ఫోటనం" అనే భయం కూడా ఏ హేతుబద్ధతతో కూడుకున్నది కాదు. డేటా పూర్తిగా అందుకు విరుద్దంగా చెప్తోంది. నిజానికి, 2019 స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ అంశాన్ని స్పృశించారు. "జనాభా విస్ఫోటనం గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది," అని ఆయన అన్నారు, ఇది భారతదేశ అభివృద్ధిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది అన్నారాయన‌.

ఇక ఆవాదనలలోని అసలు విషయాల్లోకి వస్తే...జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NFHS) (2019-21) ప్రకారం, మొత్తం సంతానోత్పత్తి రేటు (TFR) 2016లో 2.2 నుండి 2కి తగ్గింది, ఇది అసలు ఉండాల్సిన 2.1 కంటే తక్కువగా ఉంది.

అలాగే, ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం భారతదేశ జనాభా వృద్ధి రేటు 2001లో 1.73% నుండి 2018లో 1.04%కి పడిపోయింది. 12 రాష్ట్రాలలో జనాభా పెరుగుదల రేటు 1% కంటే తక్కువగా ఉంది. అధిక సంతానోత్పత్తి రాష్ట్రాలుగా పరిగణించబడే బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ , హర్యానా వంటి రాష్ట్రాల్లో కూడా కాలక్రమేణా జనాభా వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది.

భగవత్ తన ప్రసంగంలో బలవంతంగా మతం మారడం గురించి కూడా ప్రస్తావించారు. హిందూత్వ సంస్థలు కూడా చాలా కాలంగా బలవంతపు మతమార్పిడుల బూచిని చూపిస్తున్నాయి. ముఖ్యంగా క్రైస్తవ మతం హిందువులను తమ మతంలోకి మార్చుకుంటోదని ఆరెస్సెస్ చెప్తూ వస్తోంది.

నిజానికి ఆ ఆరోపణల్లో కూడా వాస్తవం లేదు.

అందుబాటులో ఉన్న జనాభా లెక్కల సమాచారం ప్రకారం, 1971 నుండి దేశ జనాభా లెక్కల ప్రకారం... క్రైస్తవ జనాభా స్థిరంగా ఉంది లేదా క్షీణించింది. 1971 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో క్రైస్తవులు 2.6% ఉన్నారు. 2001 నాటికి, ఈ సంఖ్య 2.3%కి పడిపోయింది. 2011 జనాభా లెక్కల యొక్క మతపరమైన లెక్కలను ప్రభుత్వం ఎప్పుడూ విడుదల చేయలేదు, కానీ లీకైన డేటా ప్రకారం క్రైస్తవ కమ్యూనిటీ రోజు రోజుకు క్షీణిస్తోంది.

మత మార్పిడి అంశంపై, జూన్ 2021లో విడుదల చేసిన ప్యూ పరిశోధన నివేదిక, భారతదేశంలో ఎవరైనా ఒక మతం నుండి మరొక మతానికి మారడం అత్యంత అరుదైన విషయం అని పేర్కొంది.

లెక్కలు, డేటా చూస్తూ ఉంటే మోహన్ భగవత్ , ఆరెస్సెస్, బీజేపీ చేస్తున్న ప్రచారాలు, తయారు చేస్తున్న సిద్దాంతాలు పూర్తిగా వాళ్ళ ఊహలనుండి ఉద్భవిస్తున్నవే అనేది అర్దమవుతున్నది. వాళ్ళ ఊహల,ప్రచారాల‌ వెనక మరేదైనా ఎజెండా ఉందా ?

First Published:  6 Oct 2022 3:00 AM GMT
Next Story