Telugu Global
National

మోడీ సర్కార్ గోదుమల ఎగుమతులను బ్యాన్ చేశాక అత్యంత లాభపడ్డది రిలయన్స్... లోగుట్టు ఏంటి ?

మోడీ సర్కార్ గోదుమల ఎగుమతులపై బ్యాన్ విధించాక రిలయన్స్ కంపెనీ ఎగుమతులు గతంలో కన్నా పెరిగిపోయాయి. దేశంలోనే రెండవ అతిపెద్ద గోదుమల ఎగుమతిదారుగా ఎదిగింది.

మోడీ సర్కార్ గోదుమల ఎగుమతులను బ్యాన్ చేశాక అత్యంత లాభపడ్డది రిలయన్స్... లోగుట్టు ఏంటి ?
X

మే 13 సాయంత్రం, మోడీ సర్కార్ గోధుమల ఎగుమతులపై అకస్మాత్తుగా నిషేధాన్ని ప్రకటించింది. దాంతో ఎగుమతుల కోసం గోదుమలు సేకరించిన వ్యాపారులందరూ నష్టపోయారు. ఇతర దేశాలతో వాళ్ళు చేసుకున్న ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాల్సి వచ్చింది. కానీ అప్పుడే గోదుమల ఎగుమతి రంగంలోకి అడుగుపెట్టిన బిలియనీర్ ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రం గోదుమ ఎగుమతుల్లో రెండవ అతిపెద్ద సంస్థగా నిల్చింది.

వ్యాపారంలందరూ నష్టాలపాలైతే, ఎగుమతులు ఆపేసుకోవాల్సి వస్తే రిలయన్స్ మాత్రమే ఎలా ఎగుమతులు చేయగలిగింది?

భారత దేశంలో గోదుమల ధరలు పెరగకుండా చూడడానికని చెప్పి వాణిజ్య మంత్రిత్వ శాఖ మే 13 వ తేదీన ఎగుమతుల బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే 13వ తేదీ వరకు ముందు జారీ చేయబడిన బ్యాంక్ గ్యారెంటీ - తిరిగి పొందలేని లెటర్ ఆఫ్ క్రెడిట్ (LC) కలిగి ఉన్న ఎగుమతిదారులు మాత్రమే గోధుమలను ఎగుమతి చేయడానికి అనుమతించబడతారని నిబందన విధించింది.

ఆ నిబందన ప్రకారం ఎగుమతి దారుల్లో LC లను ఉపయోగించే సంస్థల్లో భారతదేశపు అతిపెద్ద గోధుమ ఎగుమతిదారు ITC లిమిటెడ్. అయితే ఆ సంస్థ కూడా అప్పటికి భవిష్యత్తు ఎగుమతుల కోసం ఇంకా పూర్తిగా LCలను పొందలేదు.

కానీ అప్పుడప్పుడే ఈ రంగంలోకి అడుగుపెట్టిన రిలియన్స్ మాత్రం అన్నీ సిద్దం చేసుకొని ఉంది. ఆ సంస్థకు గోదుమల ఎగుమతులు బ్యాన్ చేస్తారనే విషయం ముందే తెలుసా అనే అనుమానాలు రేకిత్తించే విధంగా అది కనీసం 2,50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను కొనుగోలు చేయడానికి మే 12న జారీ చేసిన 85 మిలియన్ డాలర్ల‌ LCని కలిగి ఉందని అల్ జజీరా వెబ్ సైట్ తెలిపింది.

ఆగస్టు 16 నాటికి పోర్ట్ డేటా ప్రకారం, 2.1 మిలియన్ టన్నుల గోధుమల ఎగుమతి జరిగింది. అందులో సుమారు 3,34,000 మెట్రిక్ టన్నులు రిలయన్స్‌కు చెందినవి కాగా ITC 7,27,733 మెట్రిక్ టన్నుల గోదుమలు ఎగుమతి చేసింది.

ఇక ప్రభుత్వం విధించిన ఎగుమతుల బ్యాన్ తో చిన్న వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఎక్కువ లాభాలకు విక్రయించాలనే ఆశతో చిన్న వ్యాపారులు అప్పటికే ఎక్కువ ధరలు పెట్టి గోధుమలను కొనుగోలు చేశారు, ధరలు మరింత పెరుగుతాయని భావించి రైతులు తమ పంటలో కొంత భాగాన్ని దాచుకున్నారు.

కానీ ఒక్క‌ స్ట్రోక్‌తో, వారి ఆశలన్నీ తలకిందులయ్యాయి. ITC,రిలయన్స్‌తో సహా అన్ని పెద్ద ఎగుమతిదారులు రైతుల వద్ద , చిన్న వ్యాపారుల వద్ద గతంలో అంగీకరించిన ధరలకు గోధుమలను తీసుకోవడానికి నిరాకరించారు. ధరలు పూర్తిగా పడిపోయాయి.

ఉత్తరప్రదేశ్‌లోని మధురలో సందీప్ బన్సాల్ అనే మిల్లర్ అంతకు ముందు గోదుమల అమ్మకాలకు సంబంధించి ITCతో ఓ ఒప్పంద చేసుకున్నాడు. అయితే శుక్రవారం నిషేధం విధిస్తే సోమవారం నాడు అతనికి ITC నుండి ఓ మెయిల్ వచ్చింది. ఆ మిల్లర్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు, అన్ని డెలివరీలను నిలిపివేయమని ఆ మెయిల్ సారాంశం.

ఒక్క సందీప్ బన్సల్ మాత్రమే కాదు అనేక మంది వ్యాపారులు, రైతులు తమ గోదుమలను తక్కువ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే అప్పుడే రంగంలోకి దిగిన రిలయన్స్ రిటైల్స్ మాత్రం అతిపెద్ద ఎగుమతి దారైన ITC తో పోటీ పడి రెండవ స్థానంలో నిల్చింది.

ఇక ప్రభుత్వం గోదుమల ఎగుమతులపై నిషేధం సడెన్ గా విధించినప్పటికీ రిలయన్స్ మాత్రం అన్ని సరంజామాలతో ముందే రెడీగా ఎలా ఉంది అనే ప్రశ్నకు మీరే జవాబు వెతుక్కోండి.

First Published:  30 Aug 2022 9:59 AM GMT
Next Story