Telugu Global
National

'2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర '

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నారు రాజా ''ఇది దురదృష్టకరం. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీలో కూడా ఇదే జరుగుతోంది. తమిళనాడు ప్రభుత్వం కూడా జీఎస్టీ చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అధికారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోంది.'' అని ఆరోపించారాయన.

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర
X

2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర అని భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధానకార్యదర్శి డి.రాజా అన్నారు. ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కేసీఆర్ జాతీయ రాజకీయాలకు రావడం మంచి పరిణామమని, తాము ఆయనను మనస్పూర్తిగా స్వాగతిస్తున్నామని రాజా అన్నారు.ఇది సానుకూల పరిణామమని, గతంలో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు.

ఇక బీఆరెస్ తో పొత్తు విషయంపై రాజా స్పందిస్తూ , రాష్ట్రంలోని మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చాం. జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రి 'అబ్ కీ బార్, కిసాన్ సర్కార్' నినాదాన్ని స్వాగతిస్తున్నాం. ఇక ఎన్నికల పొత్తుల విషయానికి వస్తే దానికి ఇంకా సమయం ఉంది అని చెప్పారు రాజా.

బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టిందని, 60 పార్లమెంట్ నియోజకవర్గాలను గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందనే ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. ''దాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. బీజేపీ చాలా క్లెయిమ్ చేస్తోంది కానీ వాస్తవం వేరు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీపై అసంతృప్తి పెరుగుతోంది. హైదరాబాద్‌ను దక్షిణాదికి ద్వారం అని బీజేపీ వాదించినా ఆ పార్టీ పెద్దగా ఏమీ సాధించలేకపోయింది. బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోంది.'' అని రాజా అన్నారు.

బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందన్నారు రాజా ''ఇది దురదృష్టకరం. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీలో కూడా ఇదే జరుగుతోంది. తమిళనాడు ప్రభుత్వం కూడా జీఎస్టీ చెల్లింపుపై కేంద్ర ప్రభుత్వంపై బహిరంగంగానే వ్యాఖ్యానించింది. రాష్ట్రాల అధికారాలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం లాక్కుంటోంది.'' అని ఆరోపించారాయన.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను లాగేసుకుంటోందని, బీజేపీ రాజకీయ ఎజెండాను నడపడానికి గవర్నర్ కార్యాలయం ఉపయోగించబడుతోందని రాజా ఆరోపించారు. ''తమిళనాడులో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికన్నా గవర్నర్ ఎక్కువ అధికారం చలాయించే ప్రయత్నం చేస్తున్నారు. కేరళ, తెలంగాణలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత కాలంలో గవర్నర్ల ప్రాముఖ్యత ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అసలు గవర్నర్ల వ్యవస్థనే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. '' అని రాజా డిమాండ్ చేశారు.

First Published:  3 Jan 2023 6:44 AM GMT
Next Story