Telugu Global
National

ఇదేనా జడేజా దేశభక్తి.. భార్య ఎన్నిక కోసం బంగ్లా టూర్‌కు డుమ్మా!

ఇదేనా జడేజా దేశభక్తి.. భార్య ఎన్నిక కోసం బంగ్లా టూర్‌కు డుమ్మా!
X

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా త్వరలో జరగనున్న బంగ్లాదేశ్ టూర్‌కు డుమ్మా కొట్టాడు. తన గాయం ఇంకా నయం కాలేదని, ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటానని బీసీసీఐకి చెప్పడంతో అతడిని సెలెక్టర్లు బంగ్లా టూర్‌కు ఎంపిక చేయలేదు. డిసెంబర్ నెలలో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడటానికి బంగ్లాదేశ్ వెళ్లనున్నది. ఏడేళ్ల తర్వాత భారత జట్టు అక్కడ ద్వైపాక్షిక సిరీస్ కోసం పర్యటించనున్నది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌లో చోటు దక్కాలంటే భారత జట్టుకు ఈ రెండు టెస్టులు కీలకం కానున్నాయి. టెస్టుల్లో ఆల్‌రౌండర్ అయిన జడేజా ఇప్పడు కీలకమైన సిరీస్‌కు దూరమవడంపై అభిమానులు మండిపడుతున్నారు.

రవీంద్ర జడేజా భార్య రివాబా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జామ్‌నగర్ (నార్త్) సెగ్మెంట్ నుంచి బీజేపీ తరపున ఆమె బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు డిసెంబర్ 1, 5న రెండు దశల్లో జరుగనున్నాయి. ఇక బంగ్లా టూర్ డిసెంబర్ 4న ప్రారంభం కానున్నది. రివాబా జడేజా పోటీ చేస్తున్న జామ్‌నగర్ (నార్త్)కు డిసెంబర్ 1నే పోలింగ్ జరుగనున్నది. అయితే, టూర్‌కు అందుబాటులో ఉండాలంటే ముందుగానే టీమ్ ఇండియా క్యాంప్‌లో జాయిన్ కావాలి. అంతే కాకుండా నిత్యం ఫ్యామిలీతో టచ్‌లో ఉండే అవకాశం కూడా పెద్దగా ఉండదు. అందుకే జడేజా కావాలనే టూర్ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

భార్య ఎన్నికల్లో పోటీ చేస్తున్నందునే జడేజా గాయం పేరుతో జట్టుకు దూరమయ్యాడంటూ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీసీసీఐ కార్యదర్శిగా జై షా ఉండటం వల్లే అతడికి వెసులు బాటు లభించిందని కూడా అంటున్నారు. బీజేపీ తరపున బరిలో ఉండటం వల్లే జడేజా జట్టుతో చేరకపోయినా బీసీసీఐ పట్టించుకోవట్లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దేశం కోసం ఆడే అవకాశం కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారని, కానీ వచ్చిన అవకాశాన్ని జడేజా దుర్వినియోగం చేయడం శోచనీయం అని అంటున్నారు. ఇదేనా జడేజాకు ఉన్న దేశభక్తి అని ప్రశ్నిస్తున్నారు.

రవీంద్ర జడేజా చివరిగా అగస్టులో హాంకాంగ్‌తో చివరి వన్డే ఆడాడు. ఆ తర్వాత గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టీ20 వరల్డ్ కప్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న న్యూజీలాండ్ సిరీస్‌లో కూడా జడేజా జట్టుతో పాటు లేడు. ప్రస్తుతం కోలుకున్నానని, బంగ్లా టూర్‌కు వస్తానని చెప్పిన జడేజా.. హఠాత్తుగా తన నిర్ణయం మార్చుకున్నాడు. గాయం తిరగబెట్టిందని, పూర్తిగా కోలుకోలేదని బీసీసీఐకి చెప్పాడు. దీంతో అతడిని బంగ్లా టూర్‌కు ఎంపిక చేయలేదు. రివాబా జడేజాకు టికెట్ కన్ఫార్మ్ అయ్యాకే జడేజా తన నిర్ణయం మార్చుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. బీసీసీఐ కేటగిరి 'ఏ'లో ఉన్న రవీంద్ర జడేజా ఏడాదికి రూ. 5 కోట్ల వేతనం అందుకుంటున్నాడు. ప్రస్తుతం అతడు జట్టుతో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లకపోయినా.. కాంట్రాక్ట్ ఆటగాడిగా అతడికి వేతనం లభిస్తుంది.

జడేజా ఇంట్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్..

రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా బీజేపీ తరపున బరిలో ఉండగా.. జడేజా సోదరి రైనబా కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్తగా పని చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం మొదలైన దగ్గరి నుంచి వదిన మరదళ్ల మధ్య మాటల యుద్దం కొనసాగుతున్నది. రివాబాకు రాజ్‌కోట్ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉండగా.. తను మాత్రం జామ్‌నగర్ నుంచి ఎందుకు పోటీ చేస్తోందని రైనబా విమర్శిస్తున్నారు. తన ఓటు హక్కును జామ్‌నగర్‌కు మార్చుకోవాలని ఆమె ఏనాడూ ఆలోచించలేదని ఆరోపించారు.

రివాబా అసలు పేరు రివా సింగ్ హర్‌దేవ్ సింగ్ సోలంకి అని.. నామినేషన్ పేపర్లో కూడా అదే పేరు ఉంటుందని.. కానీ బ్రాకెట్లో జడేజా అని చేర్చుకుందని ఆరోపించారు. తన సోదరుడితో పెళ్లై ఏడేళ్లైనా ఏనాడూ జడేజా అనే పేరును తన పేరు పక్కన చేర్చుకోలేదు. కానీ ఎన్నికల్లో తన సోదరుడి పాపులారిటీని వాడుకోవడానికి మాత్రం పక్కన జడేజా అని పెట్టుకుందని రైనబా విమర్శిస్తున్నారు. మరోవైపు రివాబాగానీ, రవీంద్ర జడేజా కానీ ఈ ఆరోపణలపై స్పందించలేదు. గుజరాత్ ఎన్నికల్లో తన మద్దతు పార్టీ తరపున కాదని, తన భార్య కోసం మాత్రమే అని అతడు స్పష్టం చేస్తున్నాడు.

First Published:  25 Nov 2022 1:19 PM GMT
Next Story